Saturday, December 23, 2017

"ఫోర్త ఎస్టేట్"-రాఖీ

కత్తి మీద సాము
నెత్తి మీద పాము
నిత్యం నీవృత్తి

చెరగని చిరునవ్వు
విసుగెరుగని మోము
ప్రశ్నించడం నీ ప్రవృత్తి

ఓ పాత్రికేయ మిత్రమా
బహుముఖ ప్రజ్ఞాశాలివి
జనహిత దీక్షాశీలివి

సమాజంలో నీ పాత్ర చిరస్మరణీయం
నిగ్గు తేల్చడం నిలదీయడంలో
నీ తెగువ అద్వితీయం

వార్తకోసం ఆత్రంలో
నీఇంటి వంటనూనె(కయ్యే పైకం) సైతం 
నీబండిలో పెట్రోలౌతుంది

నీ పిల్లల్ని స్కూలుకు దింపే సమయం కూడ వాళ్ళనొదిలి నీవెంట పరుగెడుతుంది.

నువు రచ్చకీడ్చే కుటిల నాయకుల నుండి
నువు ఉతికి ఆరేసే
అవినీతి ఉద్యోగుల వరకు
ఏ దుష్ట శక్తినీ వదలవు

ఆహార కల్తీ నుండి మొదలు
యుద్ద శతఘ్నుల వరకు ఏ కుంభకోణం నీ దృక్కోణం నుండి తప్పించుకోవు

ఆకలి పోరాటాలు
చీకటి వ్యాపారాలు
అన్నీ నీకు వార్తా విశేషాలే

సాహస కృత్యాలు
పరిశోధనా ఛేదనలు
నీకు సహజాతాలే

అడవిలో అన్నల తోనైనా
విదేశీ ప్రముఖులతోనైనా
నీ చొచ్చుకపోయే విధం
అభినందనీయం

పండుగలు ఉత్సవాలు
నీకు ప్రజలతోనే అనుభూతులు
బంధుమిత్రుల పెండ్లీ పేరంటాలు
నీకు గగన కుసుమాలు

సెలవు లేని నిత్య కృషీవలుడవు
అలుపెరుగని
సైనికుడవు

విద్రోహ శక్తుల కరాళనృత్యం
ఒకోసారి నీకు మృత్యు తుల్యం

ఏ నాడు ఏకీడు నెదుర్కోవాలో
ఏ వార్తకు ప్రతి ఫలంగా
నీ మరణ వార్త బహుమతిగా గైకొనాలో.,!

జోహార్ మిత్రమా
జేజేలు నేస్తమా!!!

No comments:

Post a Comment