Thursday, October 1, 2020

 "ముట్టుడెలా..?!"


నెలసరి నెలతకు ఓ నలత
అదో ప్రకృతి సహజ రుగ్మత
పగలంతా యంత్రంగా
రేయంతా రతికేళి మాత్రంగా
నలిగే మహిళకు 
ఆ మూడురోజులూ ఆటవిడుపు
అత్యవసరమైతే మినహా 
తానో పొడసూపని పొద్దుపొడుపు

ఆచారం ఆసరాగా ..పవిత్రత పారిశుద్యంగా
అంటరాకపోవడం ఓ వెసులుబాటు

విధిలేక చేసే విధినిర్వహణం
మది మాత్రం అతలాకుతలపు ఆక్రమణం
ఆ తరుణాన తరుణికి శారీరక మానసిక రణం

చాదస్తమో దుష్ట సాంప్రదాయమో ఐతే అవని
దూరంగా ఉంచడం,ముట్టనీకపోవడమే సరైనపని
మహిళావాదులూ మరచిన వాస్తవం ఇది
అభ్యుదయం పేరిట నేడూ స్త్రీ హక్కులకు సమాధి

 "కాళ్ళ క్రింది నేల"



ఏ ఎండ మావో.,
దాహం తీర్చదు,
జీవగంగకు

ఏ సుత్తీ కత్తీ కొడవలీ 
పరిమార్చదు ఆకలి 
కరుణించనిదే నేలతల్లి.,

అస్థిత్వం ఋణాత్మకమై,
వ్యక్తుల ఆపాదనతో 
జాతీయత
శత్రువుకి తాకట్టు పెట్టబడదు.

నేస్తం!
ఉక్రోషం,ఆక్రోషం 
మనకడుపునింపేవి కావాలి ,
చించేవిగా కాకుండా 
ఆలోచించేవిగా కావాలి!! 

 


"ఆకలే కులం యాచనే మతం"

బతకడానికి బహుముఖ వేషాలు
కడుపు చేత పట్టుకుంటె చేయలేరు మోసాలు
శుక్రవారం వచ్చిందంటే తయారు ఊదు సాయెబు
చిన్నపాటి అట్టముక్కతో .,ఊదుపాత్రలో పొగరాజేస్తూ...

ఆ కూడలిలో రెడ్ సిగ్నల్ పడీపడగానే 
పరుగుపరుగున వచ్చి,ప్రతికార్లోకీ ధూపం ఎగదోస్తూ..
లక్ష్యం యాచనే ఐనా ,చేయిసాచి అడగడు
రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా ,పొగవేయడం మానడు

ఇవ్వడం సంగతి అటుంచి
కారు దొరల రకరకాల వ్యాఖ్యలు, ఈసడింపులు
"నమ్మరాదు బై టెర్రరిస్టులు వీళ్ళు",ఒక భద్రతాధికారి తానే ఐనట్లు
"అరె జావ్ జావ్ ఔర్ కోయీ కామ్ నహీ",ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లా కామెంటు
"హిందువులని అడగడమేంటో",ఒక మతప్రవక్త ఉవాచ
"టోటల్ సిటీ ఆల్ బెగ్గర్స్. హౌ పిటీ",ఒక సంస్కర్త ఆవేదన
"సారీ బాస్ చుట్టా నహీ,ఓన్లీ టూథౌసండ్ నోట్",దానకర్ణుడి నిస్సహాయత..,

అనాధలకేదీ  కులం మతం..
ఆకలికేదీ అభిమానం,అభిమతం
అన్నీటికీ సాయబుదొకటే సమాధానం
"అల్లా ఆప్కో భలా కరేఁ "...!

 


"అవలోకన"

గరిక పోచ
అణదొక్కబడితేనేం
చినుకు పలకరిస్తేనే
చివ్వున తల ఎత్తుకోద

గొంగళి పురుగు
విదిలించ బడితేనేం
యోగసమాధిలో
రంగులు సంతరించుకోద

పడ్డవాడెప్పటికీ
కాబోడు చెడ్డవాడు
జనతకు జగతికి
గారాల బిడ్డవాడు

వగచుటమానితేనె
చేరగలుగు తీరాల
దిగజారని పట్టుదల
ఎక్కించును అందలాల!!

 


"కలల తీరం"

ఓయ్..!
నీది నీలోకం నాది నాలోకం
మన మనసులు మాత్రం మమేకం..
మొత్తానికి లోకానికి
మనమో పిచ్చిమాలోకాలం

కాలం లోలకం..
మన వాలకమెరుగదు
ఎంత ఆగమన్నా ఆగదు
ఐతేనేం యుగాలు మారినా 
మన దాహంతీరదు మోహం ఆరదు
 
దూరంతో మనకెందుకు వైరం
నా మదిలో నీవు నీమదిలో నేను దూరాక
కనులు మూస్తే నువ్వు కలల్లోనూ నువ్వే
కానీ నీ తలపులతో నిదుర కాస్తా పరార్
వెతలతో కలతలతో
ఎలా కలవను రాని కలలో

రా వచ్చేసెయ్
బంధాలు బంధనాలు త్రెంచుకొని
సాగిపోదాం చేతిలో చెయ్యుంచుకొని

 


"భాష్ప కలం"

కవులంతా సిరాతో రాస్తారు
కొందరు నెత్తురుతోను రాస్తారు
నేనైతే కన్నీటితోనే కైతలు వెలయిస్తాను

ఆపాదమస్తకం
నువ్వే నా కవితావస్తువు
దేహం ప్రాణం ప్రణయం అన్నీ నువ్వే
శిల్పం శైలి కథనం సర్వం నువ్వే
చెలీ ఇంతటి నిర్దయనా
ఇంతటి నిరాదరణా

నిన్ను తలచి తలచి
అలకతో నిను మరవాలని ఎంచి
రోజూ గుర్తుంచుకొని
మరీ  మరచిపోతున్నాను

అది ఎన్నటికైనా నీకు తెలపాలని
దాన్ని నిరంతరం లిఖిస్తున్నా..

చెలీ
నీతో చెలిమి
నా కంటి చెలమె
నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి
మరో జన్మకై వేచి చూస్తుంటాయి

ఈ ప్రతీక్షలో ప్రతీక్షణం
స్రవించే అశ్రుధారల్లో
లోకమంతా మునిగి
జలప్రళయం రానీ
మన ప్రేమ సాక్షిగా
మరుజన్మలోనైనా
మనమొకటవనీ..!!

 



"షరా మామూలే"

మానవ జీవన విధానంలో
కనివిని ఎరుగని కుదుపు కరోనా
మనవాళిని కట్టడి చేసిన నియంత కరోనా

కరోనాతో గడప ఒక లక్ష్మణ రేఖగా
కరోనా భయం వల్ల మాస్క్, ఇతర 'వైరస్'లకూ రక్షణ కవచంగా
కరోనా క్రమశిక్షణ నేర్పిస్తూ శిక్షించే శిక్షకునిగా-

రానే వస్తుంది ఒక శుభోదయం
కరోనా మహమ్మారికి టీకా ఆవిష్కరిస్తూ 
మట్టుబెట్టే మందులను అందిస్తూ-

అంతే అ తర్వాత షరా మామూలే
ఎప్పటిలా కుక్కతోక వంకరే
విచ్చలవిడి విర్రవీగుడే,తిరుగుడే-

దొంగతనాలు దోపిడీలు
మహిళల మానభంగాలు
పాపాలు తాపాలు నైచ్యాలు అన్ని యథాప్రకారంగా

అనంతకోటి అవతారాలెత్తుతూనే ఉంటాడు
సృష్టిని సంతులనం చేస్తూ జగన్నాథుడు
'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత'  అన్న గీతా శ్లోకంగా

మేలుకొని మేలుగలిగి ఉందాం
నా సాటి ప్రపంచ జనులారా
మరి మరి మరో మరో కరోనాలు గుణపాఠం నేర్పకుండా..