Thursday, July 19, 2018


"(ని)వేదన"

నీ ప్రేమ కొరకె బ్రతికేస్తున్నా
కాదంటే వెంటనె ఛస్తా
మరోజన్మ  ఎత్తైనాసరె
నీ కడుపున కొడుకై పుడతా
అప్పుడెలా దూరం చేస్తావ్
వద్దన్నా నను ముద్దాడేస్తావ్
ఓ వనితా
జగన్మాతా
విశ్వవిజేతా
నీ చనుబాల గ్రోల
హరిహర బ్రహ్మలూ
అయినారమ్మా నీ ఒడిలో
పసిపాపలు..
ఇకనే నెంత ?
నీ ప్రేమ ఘన సాగరమంత
అందుకే ఈమోహం అంటా
అందుకే సోహం అంటా
దాసోహం అంటా
సదా సోహం అంటా
నీ దాస దాసోహం అంటా..!!

Monday, July 16, 2018



"స్వయంభువు"

భావుకత పెల్లుబికితే ,
జలపాతం 
కొండనుండి దూకినట్టు,

గడ్డి పరక 
తొలిచినుకుకు 
పుడమిచీల్చుకపుట్టినట్టు ,

రాలిపడే చినుకులని 
ఒడిసి పట్టుకున్న 
సంధ్యా కిరణం 
నింగి ఫలకం పై 
సింగిడిని 
చిత్రంగా వేసినట్టు, 

ఉత్తుంగ సాగర కెరటం 
తీరాన్ని చేరుకొనేే ఆరాటంలో 
నురగలు కక్కినట్టు,

నదీ దర్పణంలో 
బాల సూరీడు 
ముచ్చటగా 
అందాన్ని తిలకించే క్రమంలో 
బిడియంతో 
ముఖబింబం 
అరుణ కాంతులు చిమ్మినట్టు.....

ప్రకృతి వల్ల 
రమణీయత ఏర్పడినట్లు 

హృదయగతమైన అనుభూతి 
అక్షరావిష్కృతమైతే 

సహజ సిద్ధమైన 
భావనాసౌందర్యం 
పాఠక మనో సీమలను 
కవితగా ..
సాహితీ సంజాతగా 
సుసంపన్నం చేయదూ!!

Friday, July 13, 2018

"బహుకృత వేషం"-రాఖీ

దారి తప్పిన పిచ్చి పిచ్చుక
ఎండిన పొలంలో గింజలేరుకొంటోది ఓటీఅరా..


ఎండ్రిన్ డబ్బా,ఉరిత్రాడూ
పందెం వేసుకుంటున్నాయి 'రైతు విముక్తి 'పథకానికి తానే చైర్మన్ అని..,


రకరకాల సమీకరణాలలో
కులపు నిటారు అక్షంపై మతపు సమాంతర అక్షంపై ఏమాత్రం వికాసం తగ్గకుండా
అన్ని వర్గాల్ని వినయంగా అనునయిస్తూ
తాత్కాలిక తాయిలాలు ఊరుఊరంతా ఊరటనివ్వాలని ఆరాట పడుతున్నాయి.

పసితనాన్ని చిదిమిన వికృత కృత్యంలో మసీదూ మందిరము ఒకదానిపై ఒకటి
దుమ్మెత్తి పోసుకుంటున్నాయి

సందిట్లో పడేమాయ గా నగ్నత్వం పాతివ్రత్యం కాకుండా ఎలాపోతుందని వాదనల రొదపెడుతోంది..
కత్తి ఖర్మకాలడం తొమ్మిది గ్రహవీక్షణలో  షరా మామూలైంది..
సేనల దావానలంలో ఏదైనా మసై సమసి పోతూనే ఉంటుంది.

గాలికి కొట్టుకొచ్చిన శ్వేత పత్రం శ్వేతసౌధానికి వధ్య శిలైంది.
పొట్టోడు గట్టోడి ముక్కులో వేలెట్టి తుమ్ముతెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు..

చాపక్రింది నీరులా డ్రాగన్ మార్గ సుగమం చేసుకొంటోంది త్రివిక్రముడవ్వాలని..!

నరమాంస భక్షక జిహాద్ లు పెట్రేగి తుపాకులను ఫోర్క్ లుగా మలచుకొని విందారగిస్తున్నాయి

ఇంటర్నెట్టు ఈ-వాలెట్లు ఎంతగా తమవంతు పాత్ర పోషిస్తున్నా ఏటియం లు నోట్లకోసం పడరాని పాట్లుపడుతున్నాయి..

ఊరందరిదో దారి..
ఓదార్పు గోదారి దారి వంశపారంపర్యంగా మారి..
ఇక పాదచారి.,గెలుపు కోరి.,

హోదా మైదానం లో ఎవరౌతారో మల్లయుధ్ధ యోధులు.,

ఏదో కావాలి కానీ ఏదో తెలియని అయోమయంలో
జన భవిత గాలివాటు పథకాలు రచిస్తోంది.

నిజమైన ఏకత్వంలో భిన్నత్వం.,ఇజమైన భిన్నత్వంలో ఏకత్వం గజ ఈత ఈదడానికి మురికి కాల్వలో సాధన చేస్తోంది..

బెడిసికొట్టిన విశ్వాసం మనోరథాల దెబ్బకొట్టినా చెవిలో పూవెట్టే బాటలో ఉంది

కొత్తకూటములు దైవ కూటములై లోకోధ్ధరణ రణతంత్రాలు రచిస్తున్నాయి.,

ప్రతి'సారీ' గతిలేని పరిస్థితే
ఎన్నికలలో కన్న సామాన్యనికి
పళ్ళూడకా తప్పదు.,కొట్టకోకాతప్పదు ఈ సారీ ఏదో ఓ రాయితో..!!