Sunday, January 21, 2018


"తెలుగింటి ఇంతి -వెలుగుల సంక్రాంతి"

కళ్ళాపి జల్లిన లోగిళ్ళు
ముత్యాలముగ్గుల ముంగిళ్ళు
గోమయపు తీరైన గొబ్బిళ్ళు
సంక్రాంతి శోభతో తెలుగిళ్ళు

పంటసిరులతో నిండిన గాదెలు
గంగిరెద్దుల ఆటల వీధులు
హరిదాసు పాడే తత్వగాథలు
సంక్రాంతి సంబురాల తెలుగిళ్ళు

కోనసీమ పచ్చని అందాలు
కోరికోరి ఆడే కోడిపందాలు
పల్లెపడుచు పరికిణీ ప్రబంధాలు
సంక్రాంతి సంతసాల తెలుగిళ్ళు

ఉత్తరాయణ శుభ పర్వదినాలు
పితరులకిల తిలతర్పణాలు
నోములు వ్రతముల భక్తిభావనలు
సంక్రాంతి వైభవాల తెలుగిళ్ళు

చిటపట చిటపట భోగిమంటలు
సకినాలర్సెల పిండివంటలు
పండగ నిండగు కొత్త జంటలు
సంక్రాంతి సరదాల తెలుగిళ్ళు

చిన్నారులపై భోగిపళ్ళు
నింగిలొ ఎగిరే పతంగులు
బంధుమిత్రుల సందళ్ళు
సంక్రాంతి లక్ష్మి తో వెలుగిళ్ళు మన తెలుగిళ్ళు