Friday, March 16, 2012

“త్రివిక్రమ చక్రం”


త్రివిక్రమ చక్రం
రైతు చేతిలో వడిసెల చక్రం..రజకుడి ఉతుకున వైనం చక్రం
కమ్మరి కొలిమీకి ఊపిరి చక్రం, కుమ్మరి బతుకునకూతం చక్రం,
జాలరి పగ్గపు అవధే చక్రం, సాలెల మగ్గపు ఆదారపు ఆధారమె చక్రం
శరీరకష్టం హరింప జేసే సాధనాలకే ఆయువుపోసే
మీకోసమె ఉన్నానంటూ నోరు తెరిచే గేరే చక్రం
నోరూరించే గారేచక్రం
టర్బైన్ గమనం..మాగ్నెట్ క్షేత్రం...మోటారింజన్ భ్రమణం చక్రం
కొలనుఅలల చలనం చక్రం..కోవెల గంటల సవ్వడి చక్రం
సహస్ర వృత్తుల సాయం చక్రం..సమస్త నరులకు నేస్తం చక్రం
కాల చక్రం,జీవిత చక్రం
వేలికి రింగ్ చక్రం..కాలికి మెట్టె చక్రం
చేతికి గాజు చక్రం..చెవికి ఊగు చక్రం
అరచేతి గీతల్లో వేలి కొసల్లో గ్రహ గతుల్లో..
మనుగడ నుడివే జాతక చక్రం..
భానుడి రూపం చక్రం..ప్రతాపం చక్రం...
నింగికి నేలకు మధ్యన దిక్చక్రం
చక్రం లేని జగతి గతి ఎపుడూ వక్రం....
అణువు చక్రం..బిందువు చక్రం
శూన్యం చక్రం..బ్రహ్మాండమూ చక్రం..
సుదర్శన చక్రం లేకుండా మహా విష్ణువూ కాలేదు త్రివిక్రం..
మూలాధార,స్వాధిష్టాన,మణిపూరక, అనాహత,విశుద్ధ,ఆజ్ఞా,సహస్రార చక్రాల ఉద్దీపనే కదా..
మనిషిని మనీషిగా..ఋషిగా..మార్చేది...
ఏ యోగ సాధనకో..ఏ దైవ అర్చనకో..వివిధ చక్ర బంధనాలే..కదా..ఇంధనాలు..
ఒక్క శ్రీచక్రమే..సర్వం సహా సృష్టి స్థితి లయలకు మూలం కదా..
మిత్రమా..! “వీల్” వల్లనే బ్రతకడం నేడు వీలౌతుంది.
నేస్తమా!“వీల్” వల్లనే జగతికెపుడు మేలౌతుంది..