Sunday, June 7, 2020

"వదన ప్రబంధం"   -డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఎడారి బాటసారికి ఎదురైన ఒయాసిస్సు
అంధకార మార్గాన పొడిచిన తొలి ఉషస్సు
ప్రేమరాహిత్య అరణ్య పథాన అందమైన సరస్సు
సామాజిక మాధ్యమ వేదిక ఒంటరి మనస్సులకు రుచస్సు..

వేగవంతమైన జీవన పయనాన ఊరట నిచ్చే మజిలీ
మండుటెండలో దప్పికతీర్చే చలివేంద్రం
మాటకు ఎదురుచెప్పని ప్రియనేస్తం
మనసు విప్పుకుని మనకుమనం చెప్పుకునే
మనదైన అరచేతి దర్పణం..
మన జ్ఞాపకాలని నిలువ పరుచుకునే భోషాణం
అపురూప సంఘటన చిత్రాల,స్వీయ ఛాయాచిత్రాల ఆల్బమ్
నచ్చిన చిత్రాలను తిలకించే..
మనం నిర్మించి చిత్రాలను ప్రదర్శించే
చలన చిత్రశాల
మనవైన భావాలను రాసికొనే డైరీ.
మన మస్తకానికి వాస్తవ చిత్రం ముఖపుస్తకం..

గుర్తింపుకై తహతహలాడేవారిని కీర్తించే మిత్రసమూహం..
మన ప్రతిభా పాటవాలకు ప్రదర్శనశాల..
అమాయకత నటించడానికి ,మసిపూసి మారేడుకాయ చేయడానికి
అద్భుత రంగస్థలం
టక్కుటమార ఇంద్రజాల మహేంద్రజాల విద్యలకు ఆలవాలం
బురిడీకొట్టించడానికి మాయలో పడడానికి విచిత్ర మిథ్యాప్రపంచం
జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు వేసే అంతర్జాలం

అత్యంత వేగవంతమైన వార్తా ప్రసార వ్యాప్తి సాధనం
పుకార్లకు ఫకీర్లకు షికార్లకు రచ్చబండ
ప్రభావవంతమైన సాహితీ కళారంగాలనిలయం
పేపర్ వాడకాన్ని నిషేధించే పర్యావరణ సంస్కర్త
మనోరంజకానికి మనో వికాసానికి మనోవైకల్యానికీ ఆటపట్టు
వివిధ రాజకీయ పక్ష పక్షపాతులకు అంతరంగాలకు రంగాలకు సిద్ధాంతాలకు వాదోపవాదాలకు నిత్యకురుక్షేత్రం
క్షీరనీరదన్యాయం లో హంసలకు ,పరమహంసలకూ గీతా గ్రంథం
వ్యాపార శ్రేణులకు ప్రచార సాధకం
రెండువైపులా పదునున్న కరవాలం
బహుళార్థ ప్రయోజన జన సమూహం
నిరంతర కాల ప్రవాహం
అవ్యాజ్య మోహం
వింతచిత్తం
మోరపొత్తం..

ఫేస్ బుక్ బ్రౌసింగ్ మేధోమథనంలో
అమృతమూ హాలహలమూ లభ్యమే
గ్రోలగలిగిన వారికి కోరినది గ్రోలగ సాధ్యమే..!!