Wednesday, November 24, 2021

 "నా కవన గోదావరి"


నిన్నే పిల్లా

నీవే నా వెన్నెల్లో ఆడపిల్ల..

నిన్ను చూసినప్పుడల్లా

నువు దక్కలేదని మెదిలి

కన్నులు చిప్పిల్లి

కనుకొసల మంచు ముత్యాలై

ఆగని అశ్రుధారలుగా

ఓ కంట ప్రాణహిత..ఓ కంట గోదావరి. .


నీ తడి పాదాలు 

నా కన్నీతో కడిగిమరీ

ముద్దెట్టకోవాలని నా స్వఛ్ఛమైన ఆశ

నిజమైన స్ఫటిక నీటి గోదావరి


పొగడపూలనందుకోవాలని 

అందక నువ్ పైకెగరుతూంటే

నిను నేను పైకెత్తినట్టు ఊహించుకుంటేనే

ఎదలో గలగలా గోదావరి


నీ చూపులు మిలమిలగోదావరి

నీ నవ్వులు నురగల గోదావరి

నీ వంపులు మెలికల గోదావరి

నీ నడుము పరుగుల గోదావరి

నీ నాభి సుడిగలగోదావరి

నీ పయ్యెద ఇసుక తిన్నెల గోదావరి

ఇలా నిన్ను పవిత్రంగా ఆరాధిస్తుంటే

నా వొళ్ళంతా దివ్య వరదగోదావరి


నీ జ్ఞాపకాలు రగిలినప్పుడల్లా

గుండెలో జ్వలిత గోదావరి

భవిష్యత్తు గుర్తొచ్చినప్పుడల్లా

బ్రతుకు ఎడారిలా ఎండిన గోదావరి


నువులేని జీవితం వల్లకాటి గోదావరి

నా బ్రతుకు కొడిగట్టే మరణగోదావరి

మరుజన్మకైనా నినుకోరే 

నా చిరుఆశ మౌనగోదావరి...!!

Friday, November 19, 2021

 దాంపత్యపు ఆధిపత్యం


ఒకే కలుగులో కాపురంచేసే పిల్లి ఎలుకలం

ఒకే చెట్టుపై వాసముంటున్న పామూ ముంగిసలం

నీ కష్టాన్నీ నా ఇష్టాన్నీ ఏ నాడైనా 

పరస్పరం అర్థం చేసుకున్నామా

మతమొకటైతేనేం అభిమతాలు వేరై

కులమొకటైతేనేం వ్యాకులాల నీడై

చిన్న చిన్నత్యాగాలైనా చేయక

కాస్తైనా పట్టూ విడుపూ లేక..


నీకుండే చిరుచిరు సరదాలు

పొందికగా ఇంటినుంచుకోవడం

ఒద్దికగా ఒంటినుంచుకోవడం

చొరవగా నీ పనుల్లో పాలుపంచుకోవడం

ఎదెరైన ప్రతివారినీ ప్రేమగా నవ్వుతూ పలకరించడం

ఏసాయానికైనా వెనకాడకుండా 

ఆదుకోవడం

నన్ను నీలా ఉండమంటే ఎలా,?

కొన్ని సుగుణాలు జన్మతః రావల్సిందే

ప్రత్యేకించి చేస్తే కృతకంగా ఉండవూ..

నీభావాలను నేనెప్పుడు అడ్డుకున్నానని


చిక్కల్లా నన్ను నీలా ఉండమంటేనే

నాకు ఇల్లు జైలుగా మలిస్తేనే..

ఒకరికొకరంలా కదా ఉండాల్సింది..

నీకోసం మాత్రమే నేను అంటేనో..

ఇచ్చిపుచ్చుకుంటే గౌరవం

ఇరువురమూ సర్దుకుంటేనే కాపురం..!!

Friday, November 5, 2021

 


"పుణ్యభూమి నాదేశం నమోనమామి"


ఇది విలువలకు విలువిచ్చే పుణ్యభూమి
ఇది కర్మలను ధర్మంగా నిర్వర్తించే కర్మభూమి

ఇక్కడ అన్యాయం అక్రమాలకు ఆచూకే దొరకదు
ధర్మం అన్నియుగాల్లోనూ నాలుగు పాదాలమీదనే నడుస్తుంది
ఇక్కడ ఒక్క అనాథ పిల్లవాడు,బాలకార్మికుడూ దొరకడు
కూడళ్ళలో బిచ్చమెత్తుకోవడం అనేది అసలే కనిపించదు

మర్డర్లు మాన భంగాలకు ఇక్కడ తావేలేదు
కోర్టుల్లో పెండింగ్ కేసులే ఉండవు..
నిజానికి కేసంటూ ఉంటేనే కదా పెండింగు
రహదార్లు పూదార్లని తలపిస్తాయి
ట్రాఫిక్ జాంల ఫికరే ఉండదు
పన్నులు జరిమానాల బెడదే కరువు
ఆఫీసుల్లో అవినీతికి లంచాలకు అవకాశమే ఉండదు

జనావాసాల మధ్య మద్యపు దుకాణాలు బెల్ట్ షాపులు పర్మిట్ రూంలు ఉండనేఉండవు
ఐనా మద్యనిషేధం అంత పకడ్బంధీగా అమలౌతుంటే జనావాసాల అతీగతి అప్రస్తుతం
ఇప్పటి నేతలు అభినవ గాంధీ తాతలు
ఈనాటి  నాయకులు అపర అంబేడ్కర్ లు
రాజకీయల్లో అరాచకీయమే ఉండదు
అధికారులు అమాత్యులు నిజాయితీకి మారు పేరు
ఓట్ల అమ్మకాలు,కులమత ప్రలోభాలు ప్రసక్తిలేక
అత్యంత సజావుగా పాలకులను ఎన్నుకుంటారు
పార్టీలు సిద్ధాంతాలకు కట్టుబడి,ఫిరాయింపులకు తావీయవు
నిజమైన కార్యకర్తలకే తప్ప ద్రోహులకు పదవులు పంచనేరవు

కార్మికులు కర్షకులు సుఖసంతోషాలతోవిలసిల్లుతుంటారు
సమ్మెలు దొమ్మీలు దోపిడి దొంగతనాలు ఒక వింతైన విషయం
ఫేస్ బుక్కులు వాట్సప్పుల స్మార్ట్ ఫోన్ మాయాజాలంలో
ఎవరూ చిక్కుకోరు..తమతమ పనుల్లో బిజీగా ఉంటూ..

సోషల్ మీడియా రియల్ మీడియాలు వాస్తవాలనే
 ప్రసారం చేస్తాయి ప్రచారం చేస్తాయి..
ఇరుగు పొరుగు దేశాలు స్నేహంతో మెలుగుతూ 
ఉగ్రవాదం అన్న శబ్దానికే దూరంగా ఉంటాయి
దేశభక్తి పరిఢవిల్లుతుంది
హిందువులు వారి పండుగలు అధికమైనా
మైనార్టీల పండుగలకే సెలవులు మెండు
ఇఫ్తార్ విందుల సందడితోబాటు 
అన్యమతస్తులు నిర్భయంగా 
దేవాలయాలలో శిలువలు పాతుతారు
అన్ని మతాల్లోనూ ఒక్క దొంగబాబా కనరాడు
మేధస్సుకే తప్ప కులమతాల ప్రాతిపదికలతో
ప్రత్యేక నెత్తికెక్కించుకోడాలు ఉండనేఉండవు
ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా విజ్ఞాన రంగాలలో
అందరు పౌరులకీ సమానావకాశాలే..
ఎంత రాసినా ఈ రామాయణం ఒడువదు
నర్మగర్భంగా చెప్పినా ఈ భారతం ఎక్కదు
 జై తెలంగాణ ..!జై హింద్..!!

Sunday, October 17, 2021

 "ప్రణయ ప్రబంధం"


ఆమె అంది..

ప్రేమ, జ్ఞాపకం

విరహం, దుఃఖం..

అతనన్నాడు-

మనసు,కన్నీళ్ళు

మౌనాలు,పంచప్రాణాలు...


ఆమె ఆర్తి-

గుండె,గాయం

పదహారు,ప్రాయం...

అతని యుక్తి...

నీవు నేను

అద్దం ప్రతిబింబం..


అమెకనుమానం-

పాతిక,పదాలు

కవితలు,కావ్యాలు..

అతనికి కర్తవ్యం-

కొట్టు,చంపు

నరుకు,సరుకులు


ఇరువురి గెలుపు

సాహిత్యం,వికాసం

ఆనుభూతి,ఆకాశం..!!


వింత లెక్కలు


మనసు ప్లస్ మనసు

ఈజీక్వల్టు మనసు


మనసు మైనస్  మనసు

ఈజీక్వల్టు మనసు


మనసు ఇంటూ మనసు

ఈజీక్వల్టు మనసు


మనసు  డివైడెడ్ బై మనసు

ఈజీక్వల్టు మనసు


మనసు టుది పవరాఫ్ మనసు

ఈజీక్వల్టు మనసు


మనసు డాట్. మనసు

ఈజీక్వల్టు మనసు


మనసేమందిరం

మనసే అంధకార బంధురం


మనసు మాట వినదు

మనసు లేక కవిత మనదు..!

Monday, September 20, 2021

 " కూడలి"


చల్లని సాయంకాలం చౌరస్తా ఒక ఆటవిడుపు
సరదాలకు కబుర్లకు అది పొద్దుపొడుపు
కలుసుకోవడానికి అదో అడ్డా
చిరకాలమిత్రులు ఆప్యాయంగా పలకరించుకుంటూ,
వ్యవహారాలు లావాదేవీలు ఉన్న వ్యక్తులు తెంచుకొంటూ
ఆ గోలలో గొడవలో మజానే వేరు ఎంత చెడ్డా....

ఆ పక్క చాయ్ వాలా  ,ఇటు వేపు పానీపూరీవాలా
పిల్లలు పెద్దలు భేదమే  లేక గప్ చుప్ ల గుటకలా
దాని వెనక పాన్ టేలా

మందు షాపు,మందుల షాపు రెండూ రష్ గానే ఉంటూ
ఎదురెదురే మరి.,
మిర్చీబజ్జీల బండి సరేసరి
పక్కపక్కనే కిరాణాకొట్టు ఫిష్ మార్కెట్టూ
 పిజ్జా బర్గర్ల బేకరీ .,
కాలేజి ఫ్రండ్సంతా చేరి

ఆ మూల పాదరక్షలు రిపేర్ చేస్తూ మోచీ
జాతీయ జీవన వికాస సూచీ
స్వీట్ షాపూ సెలూనూ స్టేషనరీ
ఎన్నరకాల వ్యాపారాలో ఆ దరి

వచ్చీ పోయే వాహనాల ట్రాఫిక్ జామ్ సదా
ఆగకుండా హారన్ల రొద
మల్లెపూల మూర తో సరసుడు
మందులు కొంటూ తనయుడు
మందుకొట్టి సేదతీరుతూ కష్టజీవి

రోజలు మారినా మారని ముఖచిత్రం
ప్రభుత్వాలు మారినా మారని 
బడుగుల బ్రతుకులు బహు చిత్రం..!

Monday, September 13, 2021

 "తెగబడితే  "


మహాకవి మాటలు అక్షరసత్యాలు

మూడురోజుల ముట్టుబట్ట బట్టబయలు సాక్షిగా

కాదేదీ కవితకనర్హం అంటూ

స్త్రీ మూర్తులే మూడురాత్రుల మర్మాన్ని

మర్మాంగాల అనుభూతుల్నీ

కాస్తో కూస్తో ఫ్రస్ట్రేషన్ ప్రభావంతో...


పడక గది రహస్యాలని బోధించే

సైన్స్ పాఠాలైనాయి కవితలు నేడు

ఓ వైపు ఫెమినిజం పెల్లుబికిపోతుంటే

అత్యాచారాలు మిన్నంటుతూంటే

అంగాంగ నగ్నత్వాన్ని అంగట్లో పెడుతున్నారు

ఐతే తప్పేంటి?

తప్పంటున్నవాళ్ళ గొప్పేంటి 

అని వాదించే వర్గం విస్తరిస్తోంది.


తమ విరహబాధను ఒలక బోసే వారుకొందరు

దేనికైనా రెడీ అంటూ రెచ్చగొడుతూ కొందరు

హద్దులెందుకంటూ అరుస్తూ మరికొందరు

పర్యవసానం ఏదైతే మీకేం అంటూ

నేనెప్పడూ వాడని పలుచని పదాలలో

విచ్చల విడిగా ఎగదోస్తూ

ఎవరి మీది కసినో సమాజం మీదికి తోస్తూ

మగవాడి బలహీతనలను సరిగ్గా బేరీజు వేస్తూ

ఒక ఆట వస్తువుగా ఆడుకొంటున్నారు

వాడుకొంటున్నారు

ఒకే వస్తువు చుట్టూ గిరికీలు కొడుతూ

రెండువైపులా పదనున్న కత్తుల్లా వ్యవహరిస్తున్నారు

చొరవనిచ్చి చంకనెక్కేలా ఎగదోస్తూ

అది అలుసుగా తీసుకొన్న వారిని ఆట పట్టిస్తూ

బ్లాక్ మెయిల్ చేస్తూ 

బ్లాక్ చేస్తూ

 బద్నామ్ చేస్తూ

వికృతానందం పొందుతారు

నోటి ముందు స్వీట్లు పెట్టి

మూతికి బట్టకట్టిన విధంగా

అసలే అర్భకులు

అవకాశం కోసం అర్రులు సాచి

ఆవురావురనే మగజాతి

మునులకు సైతం మినహాయింపు లేని

మృగజాతి...

సిగ్గునొదిలి ముగ్గులోకి లాగకండి,..!

స్త్రీ పురుష పవిత్ర బంధాలకి కళంకం తేకండి..!!


(ఇది జనరలైజ్ చేసి రాసింది కాదు.,

ఎవరికి అన్వయించబడుతుందో

వారికే తెలుస్తుంది.వింతపోకడల వివరణే గాని

మహిళలను మా అమ్మలను అక్కచెల్లెళ్ళను

 కించపరిచే ఉద్దేశ్యము ఎంతమాత్రమూ లేదు

మహిళలంతా మన్నింప ప్రార్థన..!

Sunday, July 18, 2021

 "వరదగోదారి"


చేజారిన మణిపూసవి నువ్వు…

అనవరతం  నాలో జ్వలించే ధ్యాసవి నువ్వు

నవ్వుల జలతారు ముసుగేసుకుంటావ్

మనం ఒకరికొకరం తారస పడినప్పుడల్లా

కన్నులగుండా కరిగిన కలలని 

వెన్నెలగా మార్చి వెదజల్లే ప్రయత్నం చేస్తావ్…

ఎర్రని జీర ఏదో ఆ కన్నుల్లో జీరాడుతూనే ఉంటుంది

అసహాయ అయిన నీ హృదయానికి ప్రతినిధిగా

ఎక్కడో నీలో అంతర్లీనమైన విషాదరేఖ

నా మనసుకు మాత్రమే ద్యోతకమౌతుంది…


కప్పిపుచ్చే ప్రయత్నాలన్నీ పేలవంగా తయారౌతయ్,

కట్టుబాట్ల బంధనాలు

కప్పుకున్న షాలువా వెనుక

తారాడుతూనే ఉంటాయి,నిన్ను హెచ్చరిస్తూ…

సమాజం అడుగడునా పహారా కాస్తూనే ఉంది

మన మధ్య దూరాన్ని గుర్తుచేస్తూ…


కొలిమిలో కాలి కమిలిపోతున్న నా ఆరాటం

నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనేఉంది..

మాటల మలాం పూస్తూ 

నువు ఊరట కలిగిస్తూ చేసే ప్రయత్నాలు

ఒకింత నవ్వు మరింత బాధ తెప్పిస్తుంటాయి


వెతలను కవితలుగా వ్యక్తపరచడం మినహా

మన దుస్థితికి ఈ దుఃఖాన్ని ఆర్పడం సాధ్యమా

ఎడబాటును జన్మలుదాటించేలా

ఎదిరిచూడడమే మన ప్రణయానికి పరాకాష్ట…


మన బాసలకు సాక్షమైన గోదావరి..

వరదలౌతోంది..మన కన్నీరు తనలోకి చేరినప్పుడల్లా…!!

Friday, July 9, 2021

 మది అనంత సంద్రమైంది…

                               

అక్షరాశ్రువులు ఆనందభాష్పాలుగా

పదాల పాదాలు క్షారాన్నీ క్షీరంగా..

కరడుగట్టిన లవణాంబుధి

క్షీరసాగరంగా 

మార్చిన విధి విలాసం..

అది అవధెరుగని మనోల్లాసం…


కాలకూటం సంజనితమౌతుందని

వెరిస్తే..

అమృతమెలా ఆవిర్భవిస్తుంది..?

హాలాహలధారియైన

కాలకాలుడుది ఆ విషమ విష విషయం..

ఆ సమయం అధిగమిస్తే

అంతా రసమయం..


అగాధ జలనిధిలో..

అపై నవనిధులూ సులభసాధ్యమే

మేధో మథనంలో

హృదయ కలమే మంథరం

అంతుపట్టని అంతరంగ మర్మం

అది ఆదికూర్మం..


దేవదానవ సంఘర్షణ సంఘానిది..

ఐతేనేం కవనమోహిని కనికరిస్తుంది..

సాహితీ హితుల మతులకు

కృతుల,సత్కృతుల 

సారస్వతామృతాన్ని ధారపోయుటకు…,


విమర్శనాగ్రేసర రాహుకేతుల గ్రహణాలకు..

సూర్య రాకేందులూ అతీతులవరు..


మంజుల మధుకర గీతాలను

సంజె పాడుతుంటే..

జన్మదాటిన బంధాలు

తామూ నేస్తాల చెలిమికి వంతపాడవూ..!!

Saturday, June 19, 2021

 "కవితా…భావాలంకృతా"


కవితకేం ...విషయం ఉంటుంది

విషయమే ఉంటుంది,ముచ్చటలా

కవిత్వం మాత్రం మృగ్యం

సుందరికి తన అందపు కేంద్రం తెలియనట్లు..


కవితకేం..కవిత్వం పుష్కలంగా ఉంటుంది

విషయమన్నది శూన్యం..

ఆకర్షణీయంగా అలంకరించుకొని

సౌందర్యంగా అగుపించే అతివలాగ...


పదాలను వాక్యాలను ఎగ్గొట్టి దిగ్గొటి

విరిచేసి కరిచేసి వచన కవిత అనిపించేలా చేసి

అంగన తన ఆస్తులన్నీ చూపిస్తూ

వడ్డించి విస్తరిలా పరిచేస్తూన్నట్లుగా


షోకేస్ బొమ్మలుకాదు కవితలు,

కవితల ఆత్మ సౌందర్యం కదా 

ఎదుటివారి ఎదలను హత్తుకోవాలి

రెచ్చగొట్టేవో,చిచ్చుపెట్టేవో కాదు

గుండెలో నొచ్చుకోకుండా గుచ్చుకోవాలి..


ఊహలకు ఆలంబనగా 

కవితా చిత్రాలు ఆకట్టుకోవాలి

మనసులను మరోలోకాలకు

తీసుకవెళ్ళే గీతాలకు

సంగీతం చేయూతనీయాలి..


పాఠకుడిని అది తనకవితే

అది తన చరితే అన్నంతగా

గుప్పిట బంధించగలగాలి,


తొలి పదం తొలి వాక్యమే

కవిత పాఠకుణ్ణి వదలక

తన వెంట లాక్కెళ్ళగలగాలి


మధ్యలో విషయంలో ముంచివేసే

శైలి శిల్పం గుక్కతిప్పుకోనీయకుండాలి


కొసమెరుపుతో

ఎదభారంతో చదువరి

గాఢనిట్టూర్పునొదలాలి..

కవి తనూ కలవరించి

పలవరించి తరించినపుడు

కవిత కవితగా సఫలీకృతమై

సుకృతమవదూ...!!