Friday, July 9, 2021

 మది అనంత సంద్రమైంది…

                               

అక్షరాశ్రువులు ఆనందభాష్పాలుగా

పదాల పాదాలు క్షారాన్నీ క్షీరంగా..

కరడుగట్టిన లవణాంబుధి

క్షీరసాగరంగా 

మార్చిన విధి విలాసం..

అది అవధెరుగని మనోల్లాసం…


కాలకూటం సంజనితమౌతుందని

వెరిస్తే..

అమృతమెలా ఆవిర్భవిస్తుంది..?

హాలాహలధారియైన

కాలకాలుడుది ఆ విషమ విష విషయం..

ఆ సమయం అధిగమిస్తే

అంతా రసమయం..


అగాధ జలనిధిలో..

అపై నవనిధులూ సులభసాధ్యమే

మేధో మథనంలో

హృదయ కలమే మంథరం

అంతుపట్టని అంతరంగ మర్మం

అది ఆదికూర్మం..


దేవదానవ సంఘర్షణ సంఘానిది..

ఐతేనేం కవనమోహిని కనికరిస్తుంది..

సాహితీ హితుల మతులకు

కృతుల,సత్కృతుల 

సారస్వతామృతాన్ని ధారపోయుటకు…,


విమర్శనాగ్రేసర రాహుకేతుల గ్రహణాలకు..

సూర్య రాకేందులూ అతీతులవరు..


మంజుల మధుకర గీతాలను

సంజె పాడుతుంటే..

జన్మదాటిన బంధాలు

తామూ నేస్తాల చెలిమికి వంతపాడవూ..!!

No comments:

Post a Comment