Sunday, July 18, 2021

 "వరదగోదారి"


చేజారిన మణిపూసవి నువ్వు…

అనవరతం  నాలో జ్వలించే ధ్యాసవి నువ్వు

నవ్వుల జలతారు ముసుగేసుకుంటావ్

మనం ఒకరికొకరం తారస పడినప్పుడల్లా

కన్నులగుండా కరిగిన కలలని 

వెన్నెలగా మార్చి వెదజల్లే ప్రయత్నం చేస్తావ్…

ఎర్రని జీర ఏదో ఆ కన్నుల్లో జీరాడుతూనే ఉంటుంది

అసహాయ అయిన నీ హృదయానికి ప్రతినిధిగా

ఎక్కడో నీలో అంతర్లీనమైన విషాదరేఖ

నా మనసుకు మాత్రమే ద్యోతకమౌతుంది…


కప్పిపుచ్చే ప్రయత్నాలన్నీ పేలవంగా తయారౌతయ్,

కట్టుబాట్ల బంధనాలు

కప్పుకున్న షాలువా వెనుక

తారాడుతూనే ఉంటాయి,నిన్ను హెచ్చరిస్తూ…

సమాజం అడుగడునా పహారా కాస్తూనే ఉంది

మన మధ్య దూరాన్ని గుర్తుచేస్తూ…


కొలిమిలో కాలి కమిలిపోతున్న నా ఆరాటం

నిన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తూనేఉంది..

మాటల మలాం పూస్తూ 

నువు ఊరట కలిగిస్తూ చేసే ప్రయత్నాలు

ఒకింత నవ్వు మరింత బాధ తెప్పిస్తుంటాయి


వెతలను కవితలుగా వ్యక్తపరచడం మినహా

మన దుస్థితికి ఈ దుఃఖాన్ని ఆర్పడం సాధ్యమా

ఎడబాటును జన్మలుదాటించేలా

ఎదిరిచూడడమే మన ప్రణయానికి పరాకాష్ట…


మన బాసలకు సాక్షమైన గోదావరి..

వరదలౌతోంది..మన కన్నీరు తనలోకి చేరినప్పుడల్లా…!!

No comments:

Post a Comment