Monday, March 15, 2010

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

కోయిలా కూయవేల?

రాయిలా మౌనమేల?

ఉగాది రాలేదనా? రాదేలనా!

మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా

చింత కాయకుంటే ఎందుకంత చింత?

మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !

మమకారాలు కరువయ్యాయనా!

నీ పాట జనం మరి’చేద’య్యిందనా!

పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!

ఎందుకు నేస్తం?ఈ బేలతనం

నేనున్నాను నీకోసం

నా షడ్రుచుల జీవితమూ ఉంది



తలపు(/తలుపు) “తీయని” మనసుంది

కాసింత మా’నవత’పై మమ’కార’ముంది

నచ్చక చిటపట లాడినా తప్పని సరియగు స్నేహిత(౦)ము(ఉ)ప్పుంది

కారణమేదైనా గాని మెచ్చేనేస్తాలను మరి”చేదు”౦ది

నొప్పించినా స’వరించి’ ఉల్లాస తీరాలకు పరుగులు తీసి(తీయించి) వగర్చేదుంది(వగరు+చేదు)

జీవిత మలుపు మలుపులో గెలిపించే వేలు’పులు పు’ష్కలంగా అందించే దీవెన ఉంది.

పాడవే కోయిలా..

పాడుకో యిలా....

ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...

Sunday, March 14, 2010

గత ఉగాదుల స్వగతాలు

గత ఉగాదుల స్వగతాలు

తెఱ పడని నాటకం
నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
అసలే నాది అంధుని పాత్ర
అందులోను అమావాస్య రేయిలో
లైటారిపోయినప్పటి సీను
నిజంగానే తడుము కోవాల్సిన పరిస్థితిలో
అప్పుడు నేను జీవిస్తున్నానని ఎరుగని ఆడియన్స్
నా నటన చూసి ఎన్నెన్ని కామెంట్స్
వాళ్ళకెలా చెప్పాలి అది నాటకమని
నా పాత్రే ఒక బూటకమని
నా నాటకానికి తెర తీసారే గాని
వేయడం మానేసారు
ఇదేం రక్తి కడుతుందని ఇంకా
ఇలాగే చూస్తున్నారు
నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
తెరవెనక్కి పారిపోతే పిరికి వాడని అంటారు
రంగాన్నంతాపీకి పోతే పిచ్చివాడని అంటారు
ఇంకా అలాగే నిలబడితే చచ్చిపోడేమని అంటారు
రావడమైతే రంగం మీదికొచ్చాను గాని
మధ్యలో డైలాగ్స్ అన్నీ మరచిపోయాను
నోటికొచ్చింది పేలుతున్నానే గాని
’అసలు యాక్షన్’ చేయడం మానేసాను
కప్పగంతులు వేస్తున్నాను
కుప్పిగెంతులు వేస్తున్నాను
నవ్వుతున్నారు లెమ్మని
ఇంకా నవ్వుకొమ్మని
నీతులు మాట్లాడ్డం మానేసి బూతులనే మాట్లాడుతున్నాను
కాళ్ళతో నడవడం వదిలేసి చేతులతో నడుస్తున్నాను
నువ్ బఫూన్ వి కావని డైరక్టర్ చెప్పడు
నువ్వే హీరోవని ప్రామ్టరూ చెప్పడు
వాళ్ళకు మాట పడిపోయింది కామోసు
మరి నాకే చెవుడొచ్చింది కావచ్చు
ప్చ్! నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
హుమ్!!ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
నాలోని మరోమనిషికి ఇవ్వేం పట్టవ్
ఆ’మరమనిషికి’ నావేం గిట్టవ్
“ ఒరే నువ్వున్నది అథః పాతాళం
చేరాలనుకునేది గగనాంతరాళం
ఎందుకురా ఎప్పుడూ అదే ధ్యాస
ఎందుకురా ఈ వృధా ప్రయాస
తెల్ల కాగితాన్ని పిచ్చిగీతలతో ఎందుకురా పాడుచేస్తావ్
ఎవరూ అర్థం చేసుకోని భాషలో ఎందుకురా నీ గోడు రాస్తావ్
నువ్వనుకుంటున్నావ్ అది కళాఖండమని
నువ్వనుకుంటున్నావ్ అది ఘనకార్యమని
అసలూ ఎందుకు నటిస్తావ్ “ అని నేనంటే
“అయినా ఏం సాధిస్తావ్ “అని నే అన్నది వింటే
నాలోని మరో వాడు పరమ కౄరుడు-
“నటించడం నా జన్మ హక్కు” అంటాడు
“అయినా నటిస్తే ఏం తప్పు” అంటాడు
“ నీతిగా బ్రతికితే గోతిలోకి తోస్తారా”
చిరు నవ్వు నవ్వితే ఉరిశిక్ష వేస్తారా “
అనేదే వాడి వాదన-ఆవేదన
“ నటించు కాకపోతే నగ్నంగా నర్తించు
ఇదే పాత్రలో ఇదే స్టేజీపై ఈ ప్రేక్షకులముందే ఎందుకు నటిస్తావ్
నీ నటనకి ఆస్కార్ అవార్డ్ రావాలని వెర్రిగా ఎందుకు ఆశిస్తావ్-“
నేనంటే పడని అసమర్థుడు నా మాటే వినని దరిద్రుడు అన్నాడూ-
“ ఏంచేస్తాం నా ఖర్మ ఇలాగే కాలిపోయింది
దొరక్కదొరక్క నాకిదే దాపురించింది
ఏది ఏమన్నా నా నటన దీనికే అంకితమైంది
ఐనా
“తప్పుని తప్పు “ అన్నవాడిని తప్పుగా అనడమేగాని”
’ఒప్పుని ఒప్పు’అని ఒప్పుకున్న వాడేడిరా “అని
వాడి మాటలూ కొంత సబబు అనిపించాయి
వాడి బాధలో కొత్త సత్యాలు తోచాయి
“ ఎవరి కోసం నటిస్తున్నావో గాని
చూడాల్సిన వాళ్ళు చూసి హర్షిస్తున్నారో లేదో గాని
గోటితో పోయేదానికి గొడ్దలి ఉపయోగించడం తో
మాటతో పోయేదానికి మనిషిని బలిచేయడం తో
నడమంత్రపువాళ్ళవల్ల నగుబాటు కావాల్సి వచ్చింది
చేయని నేరానికి శిక్షపొందల్సి వచ్చింది
అయినా ఎందుకురా అందని దానికోసం అర్రులు చాస్తావ్
ఎందుకురా ఆకాశానికి నిచ్చెన వేస్తావ్
ఇవతలి వాళ్ల ప్రణాలు అనవసరంగా ఎందుకు తీస్తావ్
అనుక్షణం అవమానంతో కుమిలి కుమిలి ఎందుకు ఛస్తావ్
అసలు ఎందుకీ అనర్థపు తపన
అవును ఎందుకీ అనవసరపు మదన
ఒరే ఎందుకీ అంతర్గత రోదన
ఇంకా ఎందుకీ అనంత కాల వేదన “”
అప్పుడన్నాడు ఏమి తెయని మా మూఢుడు
ఒప్పుకున్నాడు అన్ని తెలిసిన ఈ మూర్ఖుడు
“ ఎలా బయట పడాలిరా ఎరక్క వచ్చి ఇరుక్కున్నాను
ఏలా ఏడవాలిరా నే ఎక్కిన కొమ్మనే నరుక్కున్నాను
ఇప్పుడేంచేయాలిరా నా నాలుక నేనే కొరుక్కున్నాను
ఆడే వాణ్ణి ఓడి పోయాను
ఆడించేవాడూ వీడి పోయాడు
అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం
అవును పునాది కూలాక మేడలు కట్టుకోలేం
కాని ఈ ప్రేక్షకులకు
చక్షువు నోరుతో వీక్షణ కోరతో
దృశ్యాన్ని తాగుతూ పైశాచికానందం పొందే భక్షకులకు
ఇదంతా చూసి విసుగు రావడం లేదూ
ఇందులో ఏదో గందరగోళం జరిగిందని తోచడం లేదూ
అందుకా మాటల రాళ్ళు రువ్వుతున్నారు
అందుకే చూపుల బాకులు దువ్వుతున్నారు
నా నటన చూసి హా హా కారాలు
నన్ను చూసి హుంకారాలు ఛీత్కారాలు
నా నాటకం పేరే “ ఓటమి “ కదూ
దాని రచయిత మాత్రం రాముడో కృష్ణుడో కాదు
వాడు అసలైన అసమర్థుడు వ్యర్థుడు
ప్రియమైన ప్రేక్షకులారా ఇంత తెలిసాక
ఎందుకు మీరు వెళ్ళడం లేదు
నరమాంస భక్షకులారా వాన కురిసాక
ఎందుకు తెర వెయ్యడం లేదు
ఓ సూత్రధారీ ! నువ్వైనా చెప్పేడు
ఈ రంగానికి మలుపు ఎప్పుడు?
నా నాటకానికి ముగింపు ఎన్నడు???

ఈ ఉగాది ఆనందానికి సమాధి


రక్తాక్షి ఏం చూసింది రుధిరాన్ని తప్ప
రక్తాక్షి ఏం మిగిల్చింది నిట్టూర్పు తప్ప
రక్తం ఏరులై పారింది నిన్న
హాహా కారాలే ఏ నోట విన్నా
ఏముంది గతం వేపు తిరిగి చూస్తే
కాకులు గ్రద్దలు వాలే స్మశానం తప్ప
ఏముంది చరిత్ర పుటలు తిరగేస్తే
రక్తాక్షి లిఖిత రక్తాక్షరాలు తప్ప
ఏ వర్షం చూసినా ఏమున్నది హర్షం?
బాధల పెదవులు పులుముకున్నాయి చిరు వర్షం !
ఏ గానం విన్నా ఏమున్నది వినోదం?
జగమంతా ప్రతిధ్వనించు అన్నార్తుల ఆర్తనాదం!!
క్రోధన మాత్రం ఏంతెస్తుంది రోదన తప్ప
క్రోధన మాత్రం ఏం మిగులుస్తుంది ఆవేదన తప్ప
నిన్నకారిన రక్త ధారలు తుడుస్తుందా ?ఓదారుస్తుందా!
అమ్మ మానం అమ్మజూపిన
పరమ నీచుల మారుస్తుందా? తెగటారుస్తుందా!
అన్నదమ్ములు మతం పేరిట
కుమ్ములాడితె విడిపిస్తుందా? తీర్పిస్తుందా!
క్రోధన మాత్రం ఏం తెస్తుంది రోదన తప్ప
క్రోధన మాత్రం ఏం మిగులుస్తుంది ఆవేదన తప్ప
మీద ఉమ్మేసినా సహిస్తాం మేం
కాలదన్నేసినా క్షమిస్తాం మేం
ఓర్పు మా మారుపేరు-సహనం మాబ్రతుకు తీరు
అందుకే రా క్రోధనా! చేసిపో విలయ నర్తన!!

Saturday, March 13, 2010

అందమె ఆనందం-ఆనందమే జీవిత సుమ గంధం!!

అందమె ఆనందం
పిరుదులపై పారాడే నీలాల కురులదే అందము
హిమగిరులను తలదన్నే ఎదబిగువులదే అందము
తనివిదీర చూపుకైన నోచని లోభినాభిదే అందము
కేసరే విస్మయపడు సన్నని నడుమునదే అందము
హరిణులను మించిన చంచల నయనాలదే అందము
సంపెంగల మరిపించెడు చక్కనైన నాసికదే అందము
బూరెలవలె ఊరించెడు నిగ్గెక్కిన బుగ్గలదే అందము
దానిమ్మలె నమ్మలేని తళుకుల దంతాలదే అందము
హద్దుల సరిహద్దులు దాటించే ముద్దగు పెదవులదే అందము
జివ్వుమనేలా ఎదుటివారి ఎదలపై రువ్వే నవ్వులదే అందము
బాకులు కాకున్నా గుండెల్లో గుచ్చుకునే చూపులదే అందము
అందమే ఆనందం-ఆనందమే జీవిత సుమ గంధం!!

Friday, March 12, 2010

ప్రేమించు

నీకు తెలుసా వాలిపోతున్న కనురెప్పల బరువెంతో
నీకు తెలుసా రాలి పడుతున్న అశ్రువుల విలువెంతో
నీకు తెలుసా నిద్రలేమితో మండే కళ్ల మంటెంతో
గమనించావా!
తదేకంగా తెఱపై చూస్తుంటే కనుకొలను
కోల్పోయిన ఆర్ద్రత అనుభవాలను
నీకు తెలుసా భావ గంగా ప్రవాహాన్ని నీకందించడానికి
వేళ్ళునొక్కేకీల హేల గోల
నీకు తెలుసా ముంచుకొచ్చే మత్తు గమ్మత్తు మహత్తులు
నీకు తెలుసా అనుక్షణం నీ ఆలోచనల కుమ్మరిపురుగు మెదడునెలా తొలుస్తుందో
నీకుతెలుసా! పుడమి కడుపు చీల్చుకొంటూ వెలికి వచ్చే గడ్డి పఱక ప్రయాస
నీకు తెలుసా!గొంగళి పురుగు రంగుల సీతాకోక చిలుక లా మారడానికి పడే ప్రస్థాన యాతన
నీకు తెలుసా! ఒక్కో పుల్లను,ఎండు గడ్డి రెల్లునూ కూడగట్టుకొని
పిచ్చుక గూడు కట్టుకోడానికి పడే తపన
ఎందుకు నేస్తం ! తీసిపారేస్తావ్ !! నన్నూ నా ప్రేమను
ఎందుకు మిత్రమా!! అపనమ్మకంతో చూస్తావ్ నన్నూ నా అనురాగాన్నీ
నీకు చేదు అనుభవాలు ఉండొచ్చుగాక !
నీవు విషమ పరిస్థులనెదుర్కొనవచ్చుగాక!!
అందరినీ ఒకే గాటుకు కట్టేయడం ఎంతవరకు సమంజసం?
అందరినీ అదే చోటుకి నెట్టేయడం ఎంతవరకు సబబు?
ఎప్పుడూ మోసపోతామని భయపడడం ఎంత వరకు న్యాయం?
నమ్మకం ఎప్పుడూ నమ్మదగ్గదే!
విశ్వసనీయత ఎల్లప్పుడు విశ్వసించ దగ్గదే!!
నమ్మంది నిమిషమైనా మనలేమే!
నమ్మంది క్షణమైనా శ్వాసించలేమే!!
పుట్టుక ఒక విశ్వాసం ?!
మరణం జీర్ణించుకోలేని నిజం
ప్రేమ అవసరమైన నమ్మకం
స్నేహం శాశ్వతమైన ఆనందం!!
గ్రహించు
సంగ్రహించు
విశ్వసించు
ప్రేమించు
సదానందంగా
సచ్చిదానందంగా
జీవించు
అనుభవించు అనుభూతులు పంచు!!!!!

Thursday, March 11, 2010

నీకే ఈ నా సమస్తం!!

ఆనంతాల అంతుల నుండి
దిగంతాల అంచుల దాటి
పాలపుంతలేన్నో మీటి
చుక్కలు చిక్కులు తెగ త్రెంచుకొని
ఖగోళాలు కృష్ణబిలాలు తప్పించుకొని
నవగ్రహాల ఉపగ్రహాల పీడ వదిలించుకొని
సప్త సముద్రాలను ఈదీ
మేరు పర్వతాల నధిరోహించి
అరణ్యాలు ఎడారులన్నీ ఏదీ వదలక
కౄర మృగాలు విష సర్పాలు ఎదునారైనా నే బెదరక
మైదానాలు నదీ నదాలు
కొండలు కోనలు వాగులు వంకలు ఏవీ విడవక
ఎండమావులు ఇంద్ర ధనువులూ వేటి మాయలో అసలే చిక్కక
లోయలు గుహలూ మిద్దెలు మేడలు
రెక్కల శ్వేత తురంగంపై అంతటా సంచరించి
విశ్వమంతటా అన్వేషించీ
అణువణువున నిను శోధించీ
ఆఖరికి నాలోనే నీవైన నన్ను గ్రహించి సంగ్రహించీ
తరించి అవతరించానిట నేస్తం!
నీకే ఈ నా సమస్తం!!
కుశలమే నా ప్రస్తుతం ?!

Thursday, March 4, 2010

“యత్ర నార్యస్తు పూజ్యంతే”


“యత్ర నార్యస్తు పూజ్యంతే”

ఎవరు గుర్తించగలరు-స్త్రీ ఔన్నత్యాన్ని
ఎవరు కీర్తించగలరు-మహిళ మూర్తిమత్వాన్ని
ఎవరు తెలుసుకొనగలరు-పడతి ప్రేమ తత్వాన్ని
ఎవరు శ్లాఘించ గలరు-సుదతి సౌందర్యాన్ని
ఎవరు కొనియాడగలరు-తరుణి త్యాగనిరతిని
ఎవరు ఆరాధించగలరు- నాతి దైవత్వాన్ని
జననేంద్రియాలు-పాల సంద్రాలు
చర్మ వర్ణాలు-దేహ గణితాలు-అవయవ పరిమాణాలు
ఇంతేనా ఇంతి విలువ!
ఏనాడో వేసుకుంది నీకై- తనకు తానే శిలువ!!
మిత్రమా అప్పుడే మరచిపోయావా-పాలుతాగి రొమ్ము తన్నావుకదా!
నేస్తమా ఇంతలోనే కైపు తలకెక్కిందా –తిన్న ఇంటి వాసాలు లెక్కిస్తున్నావు మర్యాదా!!
నిన్ను నవమాసాలు మోసిందీ –నెలతే
తన రక్తమాంసాలు పంచిందీ –రమణే
నీకు స్తన్యమిచ్చి నీ ’కొవ్వు’ పెంచిందీ –ఒక సుందరే
నీ మలమూత్రాల నెత్తి పోసిందీ-ఒక ముదితే
నీకే రోగమొచ్చినా-నీకెలా నొచ్చినా
కనురెప్పలా కాచిందీ-గారంగా పెంచిందీ-ఒక కాంతయే
నేస్తమా!
నీ అసహాయ అసహన కోప ప్రదర్శన
కేవలం అది ఒక బూతో-నీ పుట్టుకకి కారణమయ్యే రీతో
నువ్వు నోరు తెరచి పేలితే -అది ఒక తల్లి గురించో-చెల్లి గురించో
మిత్రమా!!
నీవు పెదవి విప్పి వాగితే-అది ఒక శాపనార్థమో
ఒక అవయవ అవకర అవగుణగణమో
కించపరచడం మినహా నువ్వేం సాధించగలవ్
మనసు నొప్పించే తరహా మాత్రమే వాదించగలవ్
ఆమాత్రం అందరూ పేలగలరు-అంతకన్న ఎక్కువే
ఎదురు దాడి చేయగలరు
పరిధులు దాటని సంస్కారం వారికి వెన్నతో పెట్టిన విద్య
అవధులు మించని గాంభీర్యం-వారు నేర్చుకున్న విజ్ఞానం
దైవమిచ్చిన నాలుక-కాదుకదా అశుద్ధానికి ప్రతీక!
వరంగా దొరికిన వాక్కు-కాకూడదు కదా అసహ్యించుకోబడే కక్కు!!
పవిత్రమైన నీ హృదయం-ఎలా అయ్యింది మల నిలయం?
ఇప్పటికైనా నిన్ను నీవు తెలుసుకో
నీ తప్పులు నీవే దిద్దుకో
నీ బ్రతుకుని మంచిగా మలచుకో
నీ జన్మకి సార్థకత చేకూర్చుకో
నిను కన్న వాళ్ళు-కట్టుకున్నవాళ్ళు
నీ చుట్టూ ఉన్నవాళ్ళూ గర్వించేలా మసలుకో
అందిస్తున్నా నేస్తం –నీకే ఈ సమస్తం!!!!!!!