Wednesday, September 18, 2019

ప్రియా నీకిది న్యాయమా..!
కలిసిఉన్న కాలాన్ని మరిచి పోయి
నా తలపులు తెలిపినప్పుడల్లా
నిరాసక్తంగా నిర్లిప్తంగా..

చెలీ వలపు వలలో బడి
పరువానికి లోబడి
నిన్ను అనుక్షణం
తలచి తలచి ,వగచివగచి
నిలువునా నీరైపోతున్నానే,
గోదారైపోతున్నానే
గమనించవా
కనికరించవా...

నీ ప్రేమ జ్వాలలో
నన్ను నేను దహించుకుంటూ
విరహాన్ని సహించుకుంటూ
ఎన్నాళ్ళిలా ఎన్నేళ్ళిలా..

నేను శిలనై శిథిలమై
కాలగర్భంలో కలిసిపోతేనేం.,
నీ కనుకొలుకుల్లో ఎనాడైనా
కన్నీరు చిప్పిల్లినపుడు..
నీ గుండె అట్టడుగు పొరల్లో
ఆర్ద్రత చెమ్మగిల్లినప్పుడు
ఆ ప్రతి కన్నీటి చుక్కా
నీ ద్వారా నేను కార్చేదేనని
మరువకు నేస్తమా..!!

"కన్నీటి గోదారి"

ముందు నీమీద ప్రేమే మొదలైందో
కవిత్వమే తొలుత ఉదయించిందో
నేను కవినయ్యానంటే కారణం నువ్వే
నా ప్రతికవితకూ ఆభరణం నువ్వే
నీ పాదాలు సైతం కందకూడదని
ఏకంగా నా ఎదనే పరిచానే.,
నీ చరణమంజీరమై నిన్నల్లుకున్నానే

మనం తిరుగాడిన ఇసుకతిన్నెలు
మనం కలలసౌధం నిర్మించుకున్న గులకరాళ్ళు
వెరసి గోదారి వన్నెలు ఎన్నని ఎన్నెన్నని..

నేడు వెన్నెల కూడ వెలవెలబోతోంది
మన జంటని కనక
ఏరు సైతం ఆచూకి తీస్తోంది
మన జాడ తెలవక
గలగలరావాలు సైతం
సంగీతం పలకడం మాని మౌనులైనాయి

ఏంచేయను విధిఆడిన వింతనాటకంలో
మనం చెరోవైపు విసిరివేయబడ్డాం
ఎలా చెప్పను దురదృష్టం నాకంటే
ఒక అడుగు ముందుగానే ఉంటోందని

ఇలా కవనంలో వ్యక్తపర్చడం మినహా
ఎదురుపడ్డా పలకరించలేని దుస్థితి
నన్నర్థం చేసుకొనే ఏకైక నేస్తం
నువ్వు మినహా ఎవరు ప్రియతమా..!

Friday, September 13, 2019

"కవి"

అందరూ కవులే
నాలుగు ముక్కలు
ఏ సిగరెట్ పెట్టె పైననో
ఏ బస్ టికెట్ వెనకాలో
తామూ కవిత్వం రాయాలనే
తహతహలో
తపనలో

ఆర్భాటపు సభలు
ముందస్తు ఒప్పందాలతో
అవార్డులు పురస్కారాలు
షాలువలు షీల్డులు
పత్రికల్లో వార్తలు
ఫోటోలు

మందీ మార్బలం ఉంటేసరి
కులం మతం ప్రాతం
ఏదో ఒక ఆధారం
అస్మదీయుడైతేచాలు
అంతంత మాత్రమున్నాచాలు
వేదికలు
పత్రికలు
అన్నీ మనవే

పరస్పరం వీపుగోక్కోవడాలు
పరస్పరం ఆకాశానికెత్తేయడాలు
నోరు గల దేవుళ్ళు
చొరవగల్గిన మారాజులు
లౌక్యమెరిగిన చాణక్యులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో
ముందువరుసలో వాళ్ళే
ఆహ్వానాలు ఆతిథ్యాలు
అందుకున్నదీ వాళ్ళే
పారితోషకాలు
బహుమతులు
పొందింది వాళ్ళే

మహామహులు
ఘనకవులు
సాహితీ దురంధరులు
సారస్వత సేవా తత్పరులు
నిత్య కవన హవన దీక్షాదక్షులు
నిరంతర సాధకులు
కవితా క్షేత్రహాలికులూ
అందరిలో తామూ
వారి చిరు దరహాస మోమూ..

ఎందరో వారికై
వారి ఆత్మ సంతృప్తికై
రాయడమే యజ్ఞంగా
భారతీ పుత్రులు
సరస్వతీ ప్రేమపాత్రులు..

ప్రఖ్యాతే ప్రాతిపదికగా
ప్రాచుర్యమే కొలతబద్దగా
ఎంచే లోకంలో
మౌనంగా
ధ్యానంగా..

(నిజమైన కవులకు, మరుగున పడిన మహానుభావులకు సదా శిరసా వందనాలు)