Sunday, December 1, 2019

"గుండెలో గులాబి ముల్లు"-డా.రాఖీ

ప్రేమా నిజాయితీ
కవలపిల్లలు.,
నమ్మిక నుండే కదా అవి పుట్టేది..

నువ్వున్నావ్ చూడూ..
ప్రేమ నీకో నవ్వులాట
ప్రేమించుకోవడం ఓ బొమ్మలాట..

అశలు రగిలిస్తావ్. ..
వలపులు రంగరిస్తావ్
వెర్రివాడిలా నీవెంటబడితే
కన్నెరజేస్తావ్...,
నేను మ్రాన్పడిపోయి
తప్పుకునేంతలో
నీ చిరు నవ్వులనెరవేసి
మచ్చిక చేసుకొంటావ్..

నిజమెరిగే తరుణాన
జీవితమే కనుమరుగవదూ..
నాగతి చితైతేనేం
నా మృతి నిను
అనుక్షణం వెంటాడే
స్మృతిఅవడం ఖాయం..

ఇకనైనా మనసుకు
మలాం పూయవూ
చెలీ..
గాయాన్నిపుడైనా
నయం చేయవూ..!!

Friday, October 18, 2019

"పరువం-మరువం"

నిన్నే..,
వలపువాకిట్లో
ఏన్నాళ్ళని
ఎదిరి చూడను..?!
జ్ఞాపకాలు
కాలుకాలిన
పిల్లులై
మనసును
చిందరవందర చేస్తుంటే
ఎన్ని మురిపాలని
తాపను..!

విరహంతో
ఒళ్ళు సలసల
కాగిపోతుంటే
పట్టించుకోవేం..

ఓయ్..
వింటున్నావా
మంట బెట్టడమేనా
మంచి గంధం
పూయడమేమన్నా ఉందా..

నేను చితిచేరినా
నీ సమ్మతి దొరకదేమో
చెలీ
నీ పాదాలక్రింద
నను పారిజాత పువ్వై
నలిగిపోనీ

గోదారి తీరాల
వెన్నెల
రేయిలో
వేగుచుక్క(?)నై
వెలిగిపోని

నీదిండునై
నన్నుండిపోనీ
సెలవిక నేస్తమా

ఎప్పటికీ
ఇలా ఊహల్లోనే
కాపురముందాం
మనసు
మనసుతోనైనా
ఊసులాడుకుందాం..!

(ఇప్పటి భావకవిత్వం శైలిలో రాసాను.,
ఇలాగైనా పాఠకులకు చేరువౌతానేమో చూడాలి..
అలవోకగా రోజూ ఓ పదికి తగ్గకుండారాయొచ్చు కాస్త అటూఇటూ గా ...)

Wednesday, September 18, 2019

ప్రియా నీకిది న్యాయమా..!
కలిసిఉన్న కాలాన్ని మరిచి పోయి
నా తలపులు తెలిపినప్పుడల్లా
నిరాసక్తంగా నిర్లిప్తంగా..

చెలీ వలపు వలలో బడి
పరువానికి లోబడి
నిన్ను అనుక్షణం
తలచి తలచి ,వగచివగచి
నిలువునా నీరైపోతున్నానే,
గోదారైపోతున్నానే
గమనించవా
కనికరించవా...

నీ ప్రేమ జ్వాలలో
నన్ను నేను దహించుకుంటూ
విరహాన్ని సహించుకుంటూ
ఎన్నాళ్ళిలా ఎన్నేళ్ళిలా..

నేను శిలనై శిథిలమై
కాలగర్భంలో కలిసిపోతేనేం.,
నీ కనుకొలుకుల్లో ఎనాడైనా
కన్నీరు చిప్పిల్లినపుడు..
నీ గుండె అట్టడుగు పొరల్లో
ఆర్ద్రత చెమ్మగిల్లినప్పుడు
ఆ ప్రతి కన్నీటి చుక్కా
నీ ద్వారా నేను కార్చేదేనని
మరువకు నేస్తమా..!!

"కన్నీటి గోదారి"

ముందు నీమీద ప్రేమే మొదలైందో
కవిత్వమే తొలుత ఉదయించిందో
నేను కవినయ్యానంటే కారణం నువ్వే
నా ప్రతికవితకూ ఆభరణం నువ్వే
నీ పాదాలు సైతం కందకూడదని
ఏకంగా నా ఎదనే పరిచానే.,
నీ చరణమంజీరమై నిన్నల్లుకున్నానే

మనం తిరుగాడిన ఇసుకతిన్నెలు
మనం కలలసౌధం నిర్మించుకున్న గులకరాళ్ళు
వెరసి గోదారి వన్నెలు ఎన్నని ఎన్నెన్నని..

నేడు వెన్నెల కూడ వెలవెలబోతోంది
మన జంటని కనక
ఏరు సైతం ఆచూకి తీస్తోంది
మన జాడ తెలవక
గలగలరావాలు సైతం
సంగీతం పలకడం మాని మౌనులైనాయి

ఏంచేయను విధిఆడిన వింతనాటకంలో
మనం చెరోవైపు విసిరివేయబడ్డాం
ఎలా చెప్పను దురదృష్టం నాకంటే
ఒక అడుగు ముందుగానే ఉంటోందని

ఇలా కవనంలో వ్యక్తపర్చడం మినహా
ఎదురుపడ్డా పలకరించలేని దుస్థితి
నన్నర్థం చేసుకొనే ఏకైక నేస్తం
నువ్వు మినహా ఎవరు ప్రియతమా..!

Friday, September 13, 2019

"కవి"

అందరూ కవులే
నాలుగు ముక్కలు
ఏ సిగరెట్ పెట్టె పైననో
ఏ బస్ టికెట్ వెనకాలో
తామూ కవిత్వం రాయాలనే
తహతహలో
తపనలో

ఆర్భాటపు సభలు
ముందస్తు ఒప్పందాలతో
అవార్డులు పురస్కారాలు
షాలువలు షీల్డులు
పత్రికల్లో వార్తలు
ఫోటోలు

మందీ మార్బలం ఉంటేసరి
కులం మతం ప్రాతం
ఏదో ఒక ఆధారం
అస్మదీయుడైతేచాలు
అంతంత మాత్రమున్నాచాలు
వేదికలు
పత్రికలు
అన్నీ మనవే

పరస్పరం వీపుగోక్కోవడాలు
పరస్పరం ఆకాశానికెత్తేయడాలు
నోరు గల దేవుళ్ళు
చొరవగల్గిన మారాజులు
లౌక్యమెరిగిన చాణక్యులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో
ముందువరుసలో వాళ్ళే
ఆహ్వానాలు ఆతిథ్యాలు
అందుకున్నదీ వాళ్ళే
పారితోషకాలు
బహుమతులు
పొందింది వాళ్ళే

మహామహులు
ఘనకవులు
సాహితీ దురంధరులు
సారస్వత సేవా తత్పరులు
నిత్య కవన హవన దీక్షాదక్షులు
నిరంతర సాధకులు
కవితా క్షేత్రహాలికులూ
అందరిలో తామూ
వారి చిరు దరహాస మోమూ..

ఎందరో వారికై
వారి ఆత్మ సంతృప్తికై
రాయడమే యజ్ఞంగా
భారతీ పుత్రులు
సరస్వతీ ప్రేమపాత్రులు..

ప్రఖ్యాతే ప్రాతిపదికగా
ప్రాచుర్యమే కొలతబద్దగా
ఎంచే లోకంలో
మౌనంగా
ధ్యానంగా..

(నిజమైన కవులకు, మరుగున పడిన మహానుభావులకు సదా శిరసా వందనాలు)

Tuesday, May 7, 2019

"ఆనంద నాంది-వికారి ఉగాది"

కాలగర్భాన అరవై మంది కవలలు 
ఏకరూప కవలలు ఈ ఉగాదులు!
పేరేదైతేనేం తీరుమాత్రం మారదు
దారేదైతేనేం ఊరుమాత్రం చేర్చదు!!

అదే ఆరంభం అదే శుభం ప్రతి ఉగాదిది
అదే ఆశావహం,అదే విషాద భరితం ప్రతి ఏడాదిది
దుర్భిక్షం రాటుదేలినా అవే ఆరు రుచులు
దౌర్భాగ్యం రాజ్యమేలినా అవే ఆరు ఋతువులు
కొన ఊపిరి ఆశల సంజీవినీలు పంచాంగాలు
ఉరుకుల పరుగుల వికాసానికి 
ఉసూరుమనిపించే గ్రహచారాలు

శ్రుతి తప్పిన పికాలు ఎప్పుడూ బకరాలు
వంధ్యత్వం తో ఫలాలు కాదుకదా 
చివురులు సైతం నోచని మావి మోడు జీవితాలు
కవుల కవితల్లో మాత్రమే కాపురముండే 
మల్లెల వెన్నెల హాయిదనాలు

పీడా పోయిన విళంబి-చొరబడిన వికారి
కత్తిపోయి డోలువచ్చె-ఢాంఢాంఢాం కదా తంబి
ఉగాది జీవితానికి ఎప్పుడూ మంచిఉదాహరణం
చేదు వగరు కారం అలవాటేగ బ్రతుకున ప్రతి క్షణం

నిన్న ఎన్నడూ తిరిగిరాని సత్యం 
రేపు ఎప్పుడూ చేరుకోని స్వర్గం
నేడు పిడికిట చిక్కిన స్వప్నం
చేజార్చకు ఏమరుపాటుగా గుప్పిటి ఆణిముత్యం!
నీ అడుగడుగూ కావాలి ఒక ఆనంద నృత్యం!!
"విరి కారులు"

పువ్వు నా కవిత్వం..!
అది రకరకాల రూపాల్లో
మల్లెలా చిన్నదిగా 
ఆనక పోవచ్చు
గులాబిలా సొంతం చేసుకోబోతే 
రాలిపోవచ్చు
మొగలి రేకులా ఆకళింపు చేసుకోలేకపోతే 
గుచ్చుకోవచ్చు..!!
ఐతేనేం దారంటి వెళ్ళే బాటసారుల చిత్తాన్ని 
ఆక్రమించక తప్పదు తావిలా.,ఇలా...
శిశిరానికి వణికిన తరులకు
దనివారగ కప్పిన  ఆకుల దుప్పటి 
ఆమని..!!
గ్రీష్మంలో కాలిన పుడమికి
లేపనమై కురిసిన నవనీతం 
శ్రావణి..!!
వలపుల రేపిన వెన్నెల
తమకపు తపనల తీర్చిన మదన మంత్రం 
హేమంతం..!!


"స్వప్నిక"

వివరం కనుక్కో మన్న 
విలాసినీ..
ఏదీ నీ విలాసం...!

మాటల్లో మకరందం 
జాలువారుతోంది..
తెలుగమ్మాయివే..

ఎప్పుడో విన్న పాటలా ఉంది..
బహుశా కోకిల కాదుగా 
కొంపదీసి..

గులాబివే సుమా 
చెప్పాగా 
గుభాళింపు చూసి

చల్లదనం 
తెల్లగా కురుస్తోందటే..
వెన్నెలవేమో మరి

నవ్వుల జల్లు చూస్తుంటే 
సందేహం 
మల్లికవా ఏంటి..?!

మొత్తానికి 
నా చిత్తానికి
వెన్నెల్లో ఆడపిల్ల వన్న మాట...!!
"విళంబి ఇక గతం-వికారికి స్వాగతం"

మూడుకాలాలు-ఆరు ఋతువులు
తొమ్మిది గ్రహాలు-పన్నెండు రాశులు
ఇదే కాల గడియారం-ఇదే ఏడాది గమనం

మూడు గుణాలు -ఆరు రుచులు 
నవ రసాలు-*పన్నెండు అనుభూతులు
ఇదే నిత్య సత్య మననం-ఇదే మానవ జీవనం

ప్రకృతి సహజాలే వెలుతురు చీకట్లు
బ్రతుకున మామూలే సంతసాలు ఇక్కట్లు
మార్చలేము కాలగమనం
మార్చుకోవాలి మననిమనం
నిర్విరామంగా కొనసాగుతూ సమయం
చేసుకోవాలి జీవితాన్ని అనుక్షణం రసమయం!

ప్రతి ఉగాది మనని మనకు చూపేదర్పణం
ప్రతి ఉగాది గతము భవితల సంతులనం

వివిధనామాలతో వింతమార్గదర్శనం
బహుళ అర్థాలతో చైతన్యోద్ధీపనం
వికారి శార్వరి హెచ్చరిస్తూ...
ప్లవ శుభకృతు స్ఫూర్తినిస్తూ..
శిశిరం వెనకే వసంతం సంయమనం
గ్రీష్మ తాపానికి వర్షం ఉపశమనం

విళంబి ఇక గతం..!
వికారికి వికాసానికి మనసా స్వాగతం..!!

*(శబ్దస్పర్శరూపరసగంధాలు+అరిషడ్వర్గము+నిరామయం)
"ఆరో భూతం"

నోర్లు తెరచుకొని
ఆవురావురంటుంటాయి బోర్లు
చిన్నారి కూనల్ని మ్రింగడానికి
ఎంతకూ వాటికి ఆకలి తీరదు

స్విమ్మంగ్ పూల్స్ అంతే 
వేసవి సెలవుల సాక్ష్యంగా
పసివారి ఊపిరితీయడానికి 
ఉవ్విళ్ళూరుతుంటాయి

ఆటస్థలాల్లో నిర్లక్ష్యానికి గురైన
సిమెంట్ బెంచీలూ
తమ ఉనికి చాటుకోవడానికి
బాల ప్రాణాలు బలిగొంటాయి

నరాలుతెగిపోయే వత్తిడిలో బ్రతుకుతూ
దివారాత్రాలు చదువునే పీల్చి చదువునే తిని
దేశాన్నుద్ధరించ బోయే
భావి తరాలను ఉరిత్రాళ్ళకు వ్రేలాడదీసి 
పొట్టనబెట్టుకునే అస్తవ్యస్త వ్యవస్థ 
వికటాట్టహాసం చేస్తూనే ఉంటుంది.

ఆసిడ్ దాడులతో, పెట్రో ఆహుతులతో
తొందరపాటు ప్రేమ(ఆకర్షణ)
తొలి యవ్వనాన్ని మట్టుబెట్టడంలో
తనవంతు కృషిచేస్తోంది.

పంచభూతాలూ శక్తివంచన లేక
పసితనాన్ని చిదిమేస్తూనే ఉన్నాయి

ప్రకృతి వైపరీత్యాల్లా మానవ తప్పిదాలు
మనుగడకు ప్రశ్నార్థకాలౌతుంటే
అరచేతి స్మార్ట్ ఫోన్ కబంద హస్తంలో
అన్ని వయసుల జనం
సాలీడు గూటి ఈగలౌతూంటే
వాట్సప్పుతో ఉదయిస్తూ సూర్యుడూ
ఫేస్ బుక్ తో జోలపాడుతూ చంద్రుడూ..!

నిర్లిప్తంగా నిర్వీర్యంగా..
తల్లిదండ్రులూ.,ప్రభుత రీతులూ..!!

Saturday, April 27, 2019

'రంగుల అంతరంగం'

పైకప్పు లేక ఇల్లు
మేకప్పు లేక ఒళ్ళు ఊహించలేం..!
అందరికీ తెలిసినవే ఐనా
నగ్నసత్యాలని భరించలేం..!

ఎండా వానలకి గొడుగులు
మకిలి ముఖాలకు తొడుగులు అవసరమే..
కవిత్వానికీ ఈవిషయంలో మినహాయింపులేదు..
భావాలు బట్టబయలు చేస్తేనే కవిత్వ మవదుగా,
అలంకారాలతో అందంగామలచడం
అనాదిగా ఉన్నదేగా..
తారు మొహాలకు
జలతారు మేలి ముసుగులు అవసరమే..
నిర్లప్త పెదాలకు నగవుల నగలు ఒక వరమే..
రంగుల ప్రపంచంలో రంగేసుకోక తప్పదు
ఊసరవెల్లిలా ఒదిగిపోవడానికి..
అది జుట్టుకైనా మోవికైనా మోముకైనా
తెగక తప్పని దాన్ని తెగేదాకా లాగితే తప్పేంటి..?!
సాగేదాకా సాగడమేగా జీవితమంటే..

రేపు చావుతప్పదని
ఇవ్వాళే ఆత్మహత్యలెందుకు..
ముస్తాబులు ముసుగులు
ఎంతోకొంత (మే)కప్పుతాయిగా లొసుగులు..
మనకి సహజంగా లేదుసరే.,
అది మన పూర్వజన్మ కర్మ
అందుబాట్లో ఉన్నంతలో
బ్రతుకు అందంగా మలచుకోలేకపోతే ఖర్మ,..
శిశిరాలు ఆమనినాశ్రయిస్తాయి
ప్రకృతి రమణీయకతకు
వేషం వేస్తే దోషమేంటి .,
నిత్యం సత్యం శివం సుందరంగా మనడానికి..!!

Sunday, February 24, 2019

 జీవిత సత్యం 


ఉగాదీ! నీవే నా విరోధి!! నీకెలా స్వాగతం పలికేది?
నువ్వు ఇప్పుడే కొత్తగా - మా జీవితాల్లోకి వస్తేగా-?
అంతర్లీనంగా-మమేకంగా 
మనుషుల మధ్య,మనసుల మధ్య
తిష్టవేసుకోలేదని నీ వంటే అది మిథ్య
నువ్వుంటే ఇంకెక్కడి సయోధ్య-అయోధ్య?

మిగతా నీ మిత్రులంతా అరవయ్యేళ్ళకోసారి దర్శనమిస్తారు
కానీ నీ వల్లనే మాలో ప్రతి ఒక్కరూ రోజూ కొట్టుక ఛస్తారు
ఏదో ఓ సందర్భంలో-ఎపుడో ఆవేశంలో
అవకాశం దొరికితే చాలు
అన్నదమ్ముల మధ్య-అక్కాచెల్లెళ్ళ మధ్య
భార్యా భర్తల మధ్య- ప్రేమికుల మధ్య
స్నేహితుల మధ్య –అపరిచితుల మధ్య
కులాల మధ్య- మతాల మధ్య
ప్రాంతాల మధ్య- దేశాలమధ్య
నువు చొరబడందెక్కడ?
సర్వాంతర్యామివి కదా నువు లేందెక్కడ!


ఐతే మేమేం తక్కువ తినలేదు- మేమేం అల్లాటప్పా కాదు
నిన్ను ఎలాగైనా మంచి చేసుకొంటాం-మాయచేసైనా మావైపు తిప్పు కొంటాం!

వీలైతే టీవీలైతే కొనిపెడతాం – 
నువు కష్ట పడకుండా మేమే నమిలి నీనోట్లో పేడతాం!
మాకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య
అరాచకాలు మేమే నేర్చుకున్న విద్య
ఐనా నీ తప్పేం లేదులే
నువ్వు సిసిలైన యదార్థవాది
అందుకే నువ్వు లోక ” విరోధి ”
నిన్ను కత్తిలా ఉపయోగించుకొంటాం
దీపపు వత్తిలా వాడుకొంటాం
మాలోని ద్వేషం పైనే నిన్ను ప్రయోగిస్తాం
మా అరిషడ్వర్గాల పైనే నిన్ను సంధిస్తాం
ముల్లుని ముల్లు తోనే తీస్తాం-మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సని మళ్ళీ నిరూపిస్తాం
మా పంథా ఎప్పుడూ ధనాత్మకమే- మా శైలి సదా ప్రయోగాత్మకమే!
మాలోంచి నిన్ను బైటకు తీసి నీకు పెద్ద పీట వేస్తాం
నిన్ను సక్రమంగా సాగనంపేందుకు ఎర్ర తివాచీ పరుస్తాం
ఇది నీకు ఏడాది పాటు చేసే వీడ్కోలు సభ
ఇది నీ పరమ పదానికి సంతాప సభ
వచ్చేసావుగా సంతోషం- వచ్చిన వాళ్ళు వెళ్లక తప్పదనేది నిత్య సత్యం
అదే అక్షర సత్యం-అదే జీవిత సత్యం!!
గత ఉగాదుల స్వగతాలు

మా ఇంటి పేరు భారతదేశం

విభవా! నీకు విజయీభవ!!
ఇదిగో వీరతిలకం-ఇదిగో మంగళ నీరాజనం!!!
ఎందుకైనా మంచిదీ-ముందుగా ఎడంకాలు మోపిరా
ఇదివరలోవచ్చిన నీ తోడి కోడళ్ళు కుడికాలు మోపినందుకే
మమ్మల్ని ముండమోపిరా! మా దుంపతెంచిరా!!
అవును పోయినేడు మీ పెద్దక్క’ప్రభవ’ ను కూడా
ఇలాగే ఇదే వేదిక మీద బొట్టుపెట్టి హారతిచ్చి మరీ ఆహ్వానించాం!
అయినా ఏంలాభం?చేసే భీభత్సమంతా చేసి
చేయకూడని కష్టనష్ట అరిష్టాలు చేసేసి మరీ వెళ్ళిపోయింది
అందుకే ఇప్పుడిలా తూలనాడుతున్నాం
నిన్నూ మర్యాదకేం లోటు రాకుండా మంచి చేసుకుంటాం
తప్పటడుగువేస్తే తప్పుచేస్తే నిన్నూ తప్పకుండా తిట్టుకుంటాం
అందుకేముందుగా గుర్తుచేస్తున్నాం-హెచ్చరిస్తున్నాం
అయినా ఎప్పుడూ ఇది మాకలవాటే!
అదేం చిత్రమో మీ వల్ల మాకెప్పుడూ గ్రహపాటే!!
అంత్యనిష్ఠూరం కంటె ఆది నిష్ఠూరం మేలు అన్నది నా సూత్రం
అందుకే నేనందరితోటి చెడ్డ అన్నది నగ్నసత్యం!!!

మే< మున్సిపాలిటి చెత్తకుండీలో బ్రతుకుతున్నాం
మేమందరం చిందరవందర గందర గోళంలో తిరుగుతున్నాం
మమ్మల్నంతా ఒక్కతాటి క్రిందకు చేర్చాలి
మా కందరికీ సమైక్యతా గొడుగు పట్టాలి
మా ఇంటిని నందన వనం చేయాలి
మా మనసుల్ని నవనీతం చేయాలి
అందుకు నువ్వు ’సంసారం ఒక చదరంగం’సినీమా లో
“ఉమ” పాత్రను ఆదర్శంగా తీసుకోవాలి
అయితే ముందుగానీకు మాగురించి మాఇంటి గురించీ
ఇంకా ఇంకా ఇంకా చెప్పాల్సిఉంది
మేం ఇప్పటికే రెండు డజన్లకు పై చిలుకు మందిగల కుటుంబం
ఇంకా కొత్తగా పుట్టగొడుగుల్లా ,కుక్కమూతి పిందెలు పుట్టుకొస్తూనే ఉన్నాయి
ఎందుకో తెలీదు?
పోనీ ఉన్నవాళ్ళమైనా ఆరోగ్యంగా ,ఉల్లాసంగా ఉన్నామా అంటే అదీ లేదు
మా పంజాబ్ కి కేన్సర్ ముదిరి పోయింది
మా కాశ్మీర్ ఎప్పటికీ రావణ కాష్ఠమే!
మా వైమూల వాళ్లకి కుష్ఠు వ్యాధి
మా బెంగాల్ కి ఎప్పుడూ విరోచనాలే
మా తెలుగు అన్నకి వేపకాయంత వెర్రి-
దానికి తోడు ఆరంభ శూరత్వంలా హై బీపీ
ఈ రోగాయణం గూర్చి చెబితే అదో రామాయణం అవుతుందిలే!
వీటికి తోడు కాందీశీకుల్లా ముష్టినయాళ్ళు
కనుమరుగౌతే చాలు కబళించే ఇరుగుపొరుగు దొంగ నాయాళ్ళు
చాలీ చాలని అదాయం
అందరూ దున్నపోతులు-పనికి మాలిన అడ్డగాడిదలు
రోత బూతులు పేలే వదరుబోతు శునకాలు
పెద్దాడి కడుపు కొట్టి నడిపివాడికి
నాలుగోవాడి కంచంలోంచి అరిచేవాడికిపెట్టి
అణాకాణీపెట్టి ఆఖరివాడికి ఐస్ ఫ్రూట్ తో సరిపెట్టి ఏదోలా నెట్టుకొస్తున్నాం
కరువులో వాంతిలా-వరదలో వానలా
రాబందుల్లాంటి బంధువులు
అతీగతీ అంతూపొంతూ లేని అతిథి దేవుళ్లు
వినోదాలు వేడుకలు-పండగలు పబ్బాలు
వీటికేం కొదవలేదు!!
మొలకు గోచీలేదు కాని తలకు టోపీకావాలన్నట్టు
వీళ్ళకు వీళ్ల పెళ్లాలకు పిల్లలకు అంతా ప్రత్యేకంగా కావాలి
అంతా విడివిడిగా స్వేఛ్ఛగా సాగాలి
అంతా ఇప్పుడే చెప్పడం ఎందుకులే?
బెదిరి గుండాగి ఛస్తావేమో
జడిసి తోకముడుస్తావేమో
ముందుగా లోపలికైతేరా
ముందుందిగా ముసళ్లపండగ!
చెప్పాల్సింది చెప్పాను-చేయాల్సింది నీ ముందుంచాను
నీటముంచినా పన్నీట తేల్చినా నీవే
తుఫాన్లు వరదల్లొ ముంచనా –సుభిక్షంగా గట్టెక్కించనా నీవే
నిజంగా నీవే కాల స్వరూపిణివైతే
నీవే విభవించే యుగాదివైతే
ధర్మ సంస్థాపనార్థాయా సంభవామి యుగే యుగే
అన్న మా గీతా వాక్యం నిజంచెయ్యి
మా చీకటి చేదు బ్రతుకు మీద 
చిరు రుచిని కలుగజెయ్యి
విభవా! నీకు విజయీభవ!!

Thursday, February 7, 2019

"దొంగ బతుకు"

కుక్కలవలె నక్కలవలె
సందులలో పందులవలె
దొంగలదీ ఒక బ్రతుకేనా..

ఈగలవలె దోమలవలె
పెంటబొంద పురుగులవలె
దొంగలదీ ఒక బ్రతుకేనా..

పరులమీద పడిదోచుక
అర్భకులను బెదిరించుక
ఆడా మగ తేడా లేక
వయసు ముసలి యని ఎంచక
తాళిబొట్టునూ వదలక
బీదలనూ సాదలనూ
వేధించుక నగ గుంజుక
తిను తిండీ తిండేనా
మలసమ మవ్వక
తాగేదీ మధువేనా
మహిషి మూత్రమవ్వక
దొంగలదీ బ్రతుకేనా

చాటుమాటు మనుగడతో
పూటపూట గండముతో
అనుక్షణం దాక్కుంటూ
చట్టానికి చిక్కక తప్పించుకొంటు
పట్టుబడీ ఏళ్ళకేళ్ళు
జైళ్ళలోన కుళ్ళికుళ్ళి
సమాజంలో హీనంగా
కొండొకచో దీనంగా
కుటుంబమే అవమాన పడి
సంతానం మూలబడి
దొంగలదీ ఒక బ్రతుకేనా

యాచన కన్న హేయమై
పరాన్నబుక్కుల వైనమై
బాధితుల శాపాలతొ
వంచితుల దూషణలతొ
సిగ్గు లజ్జ వదిలివేసి
రాదారి దారితప్పి
సామాన్యుల  చెమట త్రాగె
సంపన్నుల సంకనాకె
దొంగలదీ ఒక బ్రతుకేనా...