Sunday, February 24, 2019

 జీవిత సత్యం 


ఉగాదీ! నీవే నా విరోధి!! నీకెలా స్వాగతం పలికేది?
నువ్వు ఇప్పుడే కొత్తగా - మా జీవితాల్లోకి వస్తేగా-?
అంతర్లీనంగా-మమేకంగా 
మనుషుల మధ్య,మనసుల మధ్య
తిష్టవేసుకోలేదని నీ వంటే అది మిథ్య
నువ్వుంటే ఇంకెక్కడి సయోధ్య-అయోధ్య?

మిగతా నీ మిత్రులంతా అరవయ్యేళ్ళకోసారి దర్శనమిస్తారు
కానీ నీ వల్లనే మాలో ప్రతి ఒక్కరూ రోజూ కొట్టుక ఛస్తారు
ఏదో ఓ సందర్భంలో-ఎపుడో ఆవేశంలో
అవకాశం దొరికితే చాలు
అన్నదమ్ముల మధ్య-అక్కాచెల్లెళ్ళ మధ్య
భార్యా భర్తల మధ్య- ప్రేమికుల మధ్య
స్నేహితుల మధ్య –అపరిచితుల మధ్య
కులాల మధ్య- మతాల మధ్య
ప్రాంతాల మధ్య- దేశాలమధ్య
నువు చొరబడందెక్కడ?
సర్వాంతర్యామివి కదా నువు లేందెక్కడ!


ఐతే మేమేం తక్కువ తినలేదు- మేమేం అల్లాటప్పా కాదు
నిన్ను ఎలాగైనా మంచి చేసుకొంటాం-మాయచేసైనా మావైపు తిప్పు కొంటాం!

వీలైతే టీవీలైతే కొనిపెడతాం – 
నువు కష్ట పడకుండా మేమే నమిలి నీనోట్లో పేడతాం!
మాకు రాజకీయాలు వెన్నతో పెట్టిన విద్య
అరాచకాలు మేమే నేర్చుకున్న విద్య
ఐనా నీ తప్పేం లేదులే
నువ్వు సిసిలైన యదార్థవాది
అందుకే నువ్వు లోక ” విరోధి ”
నిన్ను కత్తిలా ఉపయోగించుకొంటాం
దీపపు వత్తిలా వాడుకొంటాం
మాలోని ద్వేషం పైనే నిన్ను ప్రయోగిస్తాం
మా అరిషడ్వర్గాల పైనే నిన్ను సంధిస్తాం
ముల్లుని ముల్లు తోనే తీస్తాం-మైనస్ ఇంటూ మైనస్ ప్లస్సని మళ్ళీ నిరూపిస్తాం
మా పంథా ఎప్పుడూ ధనాత్మకమే- మా శైలి సదా ప్రయోగాత్మకమే!
మాలోంచి నిన్ను బైటకు తీసి నీకు పెద్ద పీట వేస్తాం
నిన్ను సక్రమంగా సాగనంపేందుకు ఎర్ర తివాచీ పరుస్తాం
ఇది నీకు ఏడాది పాటు చేసే వీడ్కోలు సభ
ఇది నీ పరమ పదానికి సంతాప సభ
వచ్చేసావుగా సంతోషం- వచ్చిన వాళ్ళు వెళ్లక తప్పదనేది నిత్య సత్యం
అదే అక్షర సత్యం-అదే జీవిత సత్యం!!

No comments:

Post a Comment