Thursday, October 1, 2020

 "ముట్టుడెలా..?!"


నెలసరి నెలతకు ఓ నలత
అదో ప్రకృతి సహజ రుగ్మత
పగలంతా యంత్రంగా
రేయంతా రతికేళి మాత్రంగా
నలిగే మహిళకు 
ఆ మూడురోజులూ ఆటవిడుపు
అత్యవసరమైతే మినహా 
తానో పొడసూపని పొద్దుపొడుపు

ఆచారం ఆసరాగా ..పవిత్రత పారిశుద్యంగా
అంటరాకపోవడం ఓ వెసులుబాటు

విధిలేక చేసే విధినిర్వహణం
మది మాత్రం అతలాకుతలపు ఆక్రమణం
ఆ తరుణాన తరుణికి శారీరక మానసిక రణం

చాదస్తమో దుష్ట సాంప్రదాయమో ఐతే అవని
దూరంగా ఉంచడం,ముట్టనీకపోవడమే సరైనపని
మహిళావాదులూ మరచిన వాస్తవం ఇది
అభ్యుదయం పేరిట నేడూ స్త్రీ హక్కులకు సమాధి

 "కాళ్ళ క్రింది నేల"



ఏ ఎండ మావో.,
దాహం తీర్చదు,
జీవగంగకు

ఏ సుత్తీ కత్తీ కొడవలీ 
పరిమార్చదు ఆకలి 
కరుణించనిదే నేలతల్లి.,

అస్థిత్వం ఋణాత్మకమై,
వ్యక్తుల ఆపాదనతో 
జాతీయత
శత్రువుకి తాకట్టు పెట్టబడదు.

నేస్తం!
ఉక్రోషం,ఆక్రోషం 
మనకడుపునింపేవి కావాలి ,
చించేవిగా కాకుండా 
ఆలోచించేవిగా కావాలి!! 

 


"ఆకలే కులం యాచనే మతం"

బతకడానికి బహుముఖ వేషాలు
కడుపు చేత పట్టుకుంటె చేయలేరు మోసాలు
శుక్రవారం వచ్చిందంటే తయారు ఊదు సాయెబు
చిన్నపాటి అట్టముక్కతో .,ఊదుపాత్రలో పొగరాజేస్తూ...

ఆ కూడలిలో రెడ్ సిగ్నల్ పడీపడగానే 
పరుగుపరుగున వచ్చి,ప్రతికార్లోకీ ధూపం ఎగదోస్తూ..
లక్ష్యం యాచనే ఐనా ,చేయిసాచి అడగడు
రూపాయి ఇచ్చినా ఇవ్వకున్నా ,పొగవేయడం మానడు

ఇవ్వడం సంగతి అటుంచి
కారు దొరల రకరకాల వ్యాఖ్యలు, ఈసడింపులు
"నమ్మరాదు బై టెర్రరిస్టులు వీళ్ళు",ఒక భద్రతాధికారి తానే ఐనట్లు
"అరె జావ్ జావ్ ఔర్ కోయీ కామ్ నహీ",ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లా కామెంటు
"హిందువులని అడగడమేంటో",ఒక మతప్రవక్త ఉవాచ
"టోటల్ సిటీ ఆల్ బెగ్గర్స్. హౌ పిటీ",ఒక సంస్కర్త ఆవేదన
"సారీ బాస్ చుట్టా నహీ,ఓన్లీ టూథౌసండ్ నోట్",దానకర్ణుడి నిస్సహాయత..,

అనాధలకేదీ  కులం మతం..
ఆకలికేదీ అభిమానం,అభిమతం
అన్నీటికీ సాయబుదొకటే సమాధానం
"అల్లా ఆప్కో భలా కరేఁ "...!

 


"అవలోకన"

గరిక పోచ
అణదొక్కబడితేనేం
చినుకు పలకరిస్తేనే
చివ్వున తల ఎత్తుకోద

గొంగళి పురుగు
విదిలించ బడితేనేం
యోగసమాధిలో
రంగులు సంతరించుకోద

పడ్డవాడెప్పటికీ
కాబోడు చెడ్డవాడు
జనతకు జగతికి
గారాల బిడ్డవాడు

వగచుటమానితేనె
చేరగలుగు తీరాల
దిగజారని పట్టుదల
ఎక్కించును అందలాల!!

 


"కలల తీరం"

ఓయ్..!
నీది నీలోకం నాది నాలోకం
మన మనసులు మాత్రం మమేకం..
మొత్తానికి లోకానికి
మనమో పిచ్చిమాలోకాలం

కాలం లోలకం..
మన వాలకమెరుగదు
ఎంత ఆగమన్నా ఆగదు
ఐతేనేం యుగాలు మారినా 
మన దాహంతీరదు మోహం ఆరదు
 
దూరంతో మనకెందుకు వైరం
నా మదిలో నీవు నీమదిలో నేను దూరాక
కనులు మూస్తే నువ్వు కలల్లోనూ నువ్వే
కానీ నీ తలపులతో నిదుర కాస్తా పరార్
వెతలతో కలతలతో
ఎలా కలవను రాని కలలో

రా వచ్చేసెయ్
బంధాలు బంధనాలు త్రెంచుకొని
సాగిపోదాం చేతిలో చెయ్యుంచుకొని

 


"భాష్ప కలం"

కవులంతా సిరాతో రాస్తారు
కొందరు నెత్తురుతోను రాస్తారు
నేనైతే కన్నీటితోనే కైతలు వెలయిస్తాను

ఆపాదమస్తకం
నువ్వే నా కవితావస్తువు
దేహం ప్రాణం ప్రణయం అన్నీ నువ్వే
శిల్పం శైలి కథనం సర్వం నువ్వే
చెలీ ఇంతటి నిర్దయనా
ఇంతటి నిరాదరణా

నిన్ను తలచి తలచి
అలకతో నిను మరవాలని ఎంచి
రోజూ గుర్తుంచుకొని
మరీ  మరచిపోతున్నాను

అది ఎన్నటికైనా నీకు తెలపాలని
దాన్ని నిరంతరం లిఖిస్తున్నా..

చెలీ
నీతో చెలిమి
నా కంటి చెలమె
నిరంతరం ప్రవహిస్తూనే ఉంటాయి
మరో జన్మకై వేచి చూస్తుంటాయి

ఈ ప్రతీక్షలో ప్రతీక్షణం
స్రవించే అశ్రుధారల్లో
లోకమంతా మునిగి
జలప్రళయం రానీ
మన ప్రేమ సాక్షిగా
మరుజన్మలోనైనా
మనమొకటవనీ..!!

 



"షరా మామూలే"

మానవ జీవన విధానంలో
కనివిని ఎరుగని కుదుపు కరోనా
మనవాళిని కట్టడి చేసిన నియంత కరోనా

కరోనాతో గడప ఒక లక్ష్మణ రేఖగా
కరోనా భయం వల్ల మాస్క్, ఇతర 'వైరస్'లకూ రక్షణ కవచంగా
కరోనా క్రమశిక్షణ నేర్పిస్తూ శిక్షించే శిక్షకునిగా-

రానే వస్తుంది ఒక శుభోదయం
కరోనా మహమ్మారికి టీకా ఆవిష్కరిస్తూ 
మట్టుబెట్టే మందులను అందిస్తూ-

అంతే అ తర్వాత షరా మామూలే
ఎప్పటిలా కుక్కతోక వంకరే
విచ్చలవిడి విర్రవీగుడే,తిరుగుడే-

దొంగతనాలు దోపిడీలు
మహిళల మానభంగాలు
పాపాలు తాపాలు నైచ్యాలు అన్ని యథాప్రకారంగా

అనంతకోటి అవతారాలెత్తుతూనే ఉంటాడు
సృష్టిని సంతులనం చేస్తూ జగన్నాథుడు
'యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత'  అన్న గీతా శ్లోకంగా

మేలుకొని మేలుగలిగి ఉందాం
నా సాటి ప్రపంచ జనులారా
మరి మరి మరో మరో కరోనాలు గుణపాఠం నేర్పకుండా..

Sunday, June 7, 2020

"వదన ప్రబంధం"   -డా.గొల్లపెల్లి రాంకిషన్ రాఖీ

ఎడారి బాటసారికి ఎదురైన ఒయాసిస్సు
అంధకార మార్గాన పొడిచిన తొలి ఉషస్సు
ప్రేమరాహిత్య అరణ్య పథాన అందమైన సరస్సు
సామాజిక మాధ్యమ వేదిక ఒంటరి మనస్సులకు రుచస్సు..

వేగవంతమైన జీవన పయనాన ఊరట నిచ్చే మజిలీ
మండుటెండలో దప్పికతీర్చే చలివేంద్రం
మాటకు ఎదురుచెప్పని ప్రియనేస్తం
మనసు విప్పుకుని మనకుమనం చెప్పుకునే
మనదైన అరచేతి దర్పణం..
మన జ్ఞాపకాలని నిలువ పరుచుకునే భోషాణం
అపురూప సంఘటన చిత్రాల,స్వీయ ఛాయాచిత్రాల ఆల్బమ్
నచ్చిన చిత్రాలను తిలకించే..
మనం నిర్మించి చిత్రాలను ప్రదర్శించే
చలన చిత్రశాల
మనవైన భావాలను రాసికొనే డైరీ.
మన మస్తకానికి వాస్తవ చిత్రం ముఖపుస్తకం..

గుర్తింపుకై తహతహలాడేవారిని కీర్తించే మిత్రసమూహం..
మన ప్రతిభా పాటవాలకు ప్రదర్శనశాల..
అమాయకత నటించడానికి ,మసిపూసి మారేడుకాయ చేయడానికి
అద్భుత రంగస్థలం
టక్కుటమార ఇంద్రజాల మహేంద్రజాల విద్యలకు ఆలవాలం
బురిడీకొట్టించడానికి మాయలో పడడానికి విచిత్ర మిథ్యాప్రపంచం
జీవితాలను బుగ్గిపాలు చేసేందుకు వేసే అంతర్జాలం

అత్యంత వేగవంతమైన వార్తా ప్రసార వ్యాప్తి సాధనం
పుకార్లకు ఫకీర్లకు షికార్లకు రచ్చబండ
ప్రభావవంతమైన సాహితీ కళారంగాలనిలయం
పేపర్ వాడకాన్ని నిషేధించే పర్యావరణ సంస్కర్త
మనోరంజకానికి మనో వికాసానికి మనోవైకల్యానికీ ఆటపట్టు
వివిధ రాజకీయ పక్ష పక్షపాతులకు అంతరంగాలకు రంగాలకు సిద్ధాంతాలకు వాదోపవాదాలకు నిత్యకురుక్షేత్రం
క్షీరనీరదన్యాయం లో హంసలకు ,పరమహంసలకూ గీతా గ్రంథం
వ్యాపార శ్రేణులకు ప్రచార సాధకం
రెండువైపులా పదునున్న కరవాలం
బహుళార్థ ప్రయోజన జన సమూహం
నిరంతర కాల ప్రవాహం
అవ్యాజ్య మోహం
వింతచిత్తం
మోరపొత్తం..

ఫేస్ బుక్ బ్రౌసింగ్ మేధోమథనంలో
అమృతమూ హాలహలమూ లభ్యమే
గ్రోలగలిగిన వారికి కోరినది గ్రోలగ సాధ్యమే..!!

Wednesday, April 22, 2020



"చరమ గీతం"
పారిపో కరోనా మా భూమండలంనుండి
మారిపో కరోనా మానవాళికి హానిచేయని విధంగా
నీకేం తెలుసు ప్రాణం విలువ
నీకేమెరుక బాంధవ్య మూల్యం

ఉండీలేని జీవమున్న ప్రాణివి నువ్వు
నిర్జీవ జీవ శిఖండివి నువ్వు
విచిత్రమైన పరాన్నబుక్కువి నువ్వు
జీవాణుబాంబువి నువ్వు
నరజాతిని కడతేర్చేందుకే పుట్టునట్టున్నావు
మనిషిని మాయచేసే గుట్టేదో పెట్టుకున్నావు

మేమిప్పుడే గ్రహిస్తున్నాం నీ పుట్టుక మూలం
మేమిప్పుడే సంగ్రహిస్తున్నాం
మేమిప్పుడే కళ్ళుతెరిచి సంశోధిస్తున్నాం
నీ జన్మ మూలాలను మూలకారణాలను
మేం చేసిన దారుణాలా ,జీవాయుధ రణాలా అన్నవాస్తవాలను

నీ తాటాకు చప్పుళ్ళకు బెదిరే కుందేళ్ళం కాము మేము
నీ సంకుల సమరానికి వెఱచే బీరువులం కాబోము
మాకు ఎనలేని ఆయుధాలున్నాయి
మా ప్రణాళికలు అంచనాలు మాకున్నాయి
జాగృతానికి జాగైందేమోకాని
సమాయత్తమైనామిక
మిగిలింది నీ సంహారమే

కాచుకో ఇక మా ఇల్లే మాకు స్వర్గం
నీ వ్యాప్తికి అది మా దుర్గమ దుర్గం
అత్యవసరాల్లో బయటికి వెళ్ళినా
సామాజిక దూరం మా యుద్ధవ్యూహం
మూతి ముక్కులు మూస్తూ మూసిక(మాస్క్)కట్టుకోవడం
అదే మాకు రక్షణ కవచం
మా చేతుల్ని పదేపదే కడగడానికి వాడే
సానిటైజర్లు సబ్బులు మాస్క్ లు మా అస్త్రశస్త్రాలు
అవే నీకు మరణ శాసనాలు

చరిత్ర తెలుసుకో
సంయమనం వీడకుండా నీ పూర్వీకులను
టీకాలతో మందులతో తుదముట్టించాం
నామరూపాలు లేకుండా నాశనం చేసాం
మా మానవులతో పెట్టుకుంటే మట్టగొట్టుకపోతారు
నువు తోకముడవడమే తరువాయి
ఇదే నీ చరమగీతం కడసారిగా వినరోయి..!!

Tuesday, April 21, 2020

" పదకొండో అవతారం"  -డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

నిజం చెప్పొద్దూ.,చాలా రకాలుగా మంచిదే కరోనా/
గురువై పాఠాలు చెపుతోంది/
అనుభవైకవేద్యమైన గుణపాఠాలు నేర్పుతోంది/
ప్రవక్తగా బ్రతుకు పరమార్థం  బోధపరుస్తోంది/
మరుగున పడ్డ మానవత్వాన్ని మరల మేలుకొల్పుతోంది/

త్సునామిలా ఒక్క ఉదుటన తీరాలకు తీరాలు మట్టుబెట్టడం లేదు/
తుఫానులా ఏ అర్ధరాత్రో ఊళ్ళకూళ్ళు తుడిచిపెట్టడం లేదు/
కేదార్ నాథ్ వరదల్లా శవాల ఆచూకైన తెలియనట్టు విరుచుక పడడం లేదు/
ఏ టర్నొడోనోలానో ఏభూకంపంలోనో నగరాలను ధ్వంసం చేయడం లేదు/
తన ఉనికి చాటి మరీ కయ్యానికి కాలుదువ్వుతోంది/
మన దుర్బుద్ధిలోనే పుట్టి ,మన వికృత చేష్టలతోనే రూపుదిద్దుకొని/
మన పైశాచిక హింసాత్మక ఆహార విహారాలనే/
ఆలంబన చేసుకొని వేళ్ళూనుకొంది/
మన నిర్లక్ష్యాన్నే ఊతంగా మలచుకొని పెట్రేగుతోంది/

ఐనా తను పట్టుబడటానికి తనని కట్టడి చేయడానికి/
విస్తృత విశేష అవకాశాలను కలుగజేస్తోంది/

పర్యావరణ హాని అని ప్రపంచం మొత్తుకుంటున్నవేళ/
కాలుష్యం కోఱల చిక్కి విలవిలలాడే విపత్కర సమయాన/
దానవత్వం దారుణంగా చెలరేగుతున్న తరుణాన/
పరిసరాల పరిశుభ్రత విలువ నెరుక పరుస్తూ/
పచ్చదనం స్వఛ్ఛదనం నేర్పిస్తూ/
కోల్పోతున్న మానవీయ దృక్కోణాలని, దృక్పథాలని పునఃప్రతిష్ఠిస్తూ/
దిగజారిన కుటుంబ బాంధవ్యాలని మళ్ళీ పెనవేసేలా చేస్తూ/
మానవ జీవితంలోని విలువలను గురుతుచేస్తూ/
సంప్రదాయాలు ఆచారాలని పునర్జీవింప జేస్తూ/
ప్రపంచ మానవాళిని సంఘటిత పరుస్తూ/
వైరి దేశాలనూ ఐక్య పరుస్తూ,వసుధైక కుటుంబ భావనకు జీవం పోస్తూ/
తరతమ భేదాలు తొలగిస్తూ ,వ్యక్తులకు హద్దులు నిర్దేశిస్తూ/
సంభవామి యుగే యుగే అన్నట్లు/
పదకొండో అవతారంగా ఆవిర్భవించింది కరోనావతారం!

మాంత్రికుడి ప్రాణం మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్నట్టు/
కరోనాకు ఆయువుపట్టు దాని వ్యాప్తి నరికట్టడంలోనేఉంది.!/
తెలిసి తెలిసి వచ్చేదాన్ని తెలివిగా మట్టుబెట్టొచ్చు/
అవతార ప్రయోజనం నెరవేరిందన్నట్టు కరోనాను కాటికంపవచ్చు/

గడప దాటితేనే గండం-ఇంటిపట్టునుంటే బ్రహ్మాండం/
కనులు ముక్కు నోరే కరోనా ప్రవేశ సింహద్వారం/
చేతులు కడగడమే ఏకైక బ్రహ్మాస్త్రం/
సామాజిక దూరమే కరవాలం/
అంతా మనమంచికే -/
ఇక ప్రభుత్వ నిర్దేశాల ఆచరణతో కరోనా కథ కంచికే..!!

Sunday, January 19, 2020

రాఖీ  ॥  'ఐ"

ఏం కావాలో తెలీదు,
నిజానికి ఏమీ ఆశించం కూడ,

కొన్ని అలా
చూస్తూండిపోవాలనిపిస్తుంది,
వెన్నెల్లా,తాజ్మహల్లా,
వెన్నెల్లో తాజ్మహల్లా

కొన్ని మ్రింగి
జీర్ణం చేసుకోవాలని పిస్తుంది
పువ్వులా,నవ్వులా
పువ్వులాంటి  నవ్వులా

కొన్నింటిని
చెవుల నింపుకోవాలనిపిస్తుంది
తేనెలా  తెలుగులా
తేనెవంటి తెలుగులా

కొన్ని మరుజన్మకైనా
సొంతంచేసుకోవాలని పిస్తుంది
నీ అందమైన దేహంలా
అందులోని ప్రాణంలా
ఏకమొత్తంగా
నిన్నే సాంతంగా
అమాంతంగా

శాశ్వతంగా
కరిగి పోవాలనుంటుంది
నీ మనసులో మనసునై
మనిషిలో మనిషినై

నేనే నీవై
అంతానీవై
నీవే(నీవు మాత్రమే) ఐ..!!

Monday, January 13, 2020

"స్నేహితమా! స్నేహితమా?"

ముఖ పరిచయముంటేనో
ఇంటిపక్కనుంటేనో
స్నేహితుడంటే ఎలా ..

మైత్రీవనంలో చెట్లన్నీ
సుగంధాలు చిమ్మవు
మంచి గంధపు వృక్షంలా..
బ్రహ్మజెముళ్ళూ ఉంటాయి
గుచ్చడమే ధ్యేయంగా

కలిసి చదువుకుంటేనో
ఒకే ఊరు అంటేనో
స్నేహితుడంటే ఎలా..

మైత్రీవనంలో మృగాలన్నీ
రాజసం ఒలుకవు
సరిలేని కేసరిలా..
గుంటనక్కలూ ఉంటాయి
వంచించడమే లక్ష్యంగా

సహోద్యోగి ఐతేనో
వ్యాపకమొకటైతేనో
స్నేహితుడంటే ఎలా..

మైత్రీవనంలో మూలికలన్నీ
గాయం మాన్పవు
 ప్రాణం నిలుపవు సంజీవనిలా
వికటించేవీ ఉంటాయి
నిర్వీర్య పర్చడమే తత్వంగా

పదిమందిలొ  కించపరచి
పగలబడి నవ్వడం
పరువుని పలుచన జేసి
ఛలోక్తులే రువ్వడం
మనతలపై తొక్కుతూ
తనుపైకి పాకడం
మంచితనం ముసుగులో
గోతులు తవ్వడం
లోయలోకి జారుతుంటే
రాళ్ళను తోసెయ్యడం
తనగుర్తింపు కొరకు
మనని బలిచెయ్యడం

స్నేహితుడని చెప్పుకుంటె
చెప్పరాని సిగ్గుచేటు
మిత్రునిగా ఒప్పుకుంటె
బ్రతుకంతా నగుబాటు..!!