Thursday, December 13, 2018

కాల కవనం

వరి దరిజేర్చి జనవరి..!
తేవాలి జనజీవనాన తరగని సిరి..!!

శివ పరవశ  ఫిబ్రవరి..!
చిగురించనీ ఎదల మానవీయ గురి..!!

పరీక్షల సెగల మార్చి..!
చెమరించనీ హృదయమును దయగమార్చి..!!

చైత్ర చిత్రాల ఏప్రిలు
కుసుమించ'నీ'కు'ముదము పంచనీ సుధలు..!!

దాహమేమనజాల'మే..!
తరించనీ తమకాల., గ్రోల ఆమ్రరసమే..!!

తొలకరి చినుకుల జూన్..!
తడిపి, నేల అక్షర బీజం మొలకెత్త..!!

ఉద్యమించనీ కృషి జూలై..!
తలపించగ నదులూ చెర్లూ  గర్భిణులై..!!

పచ్చదనం పరచు ఆగస్టు..!
ప్రకృతి పరవశించి ప్రజల దీవించేట్టు..!!

రైతు మురియ సెప్టెంబరు..!
శరత్తుకు ఆయత్తమవగ కలువరేడు..!!

అలై బలైలతొ అక్టోబరు..!
 బతుకమ్మ దసరా సరదాలు తయారు..!!

చీకటి  చిదిమే నవంబర్..!
వెలుగుల దీపావళి కాలవాలమై..!!

చలి పులి చెలి డిసెంబరు..!
మార్గళి దీక్షకు జడిసి,తోకముడిచీ..!!

Friday, September 14, 2018

"గతజల సేతు బంధనం"

ఉద్ధరించాల్సిందే
మరొకరిని ముంచకుండా
ఆచరించాల్సిందే
వక్ర మార్గాలు తొక్కకుండా..

కాలుష్య నియంత్రణ మంచిదే
కల్తీ డిజిల్ పెట్రోల్ నరికడితేనో
పాథిలీన్ నివారణ ఆవశ్యకమే
ఉత్పాదకత నడ్డుకుంటే చాలదూ..

భారీతనం భక్తిని తొక్కేస్తూన్న తరుణంలో
చిట్టి మట్టి గణపతి పూజ శ్రేష్ఠమే
వికృత వింత రూపాల నేపథ్యంలో
ప్లాస్టరాపారిస్ ప్రతిమల
తయారీనే నిర్జిస్తే అదృష్టమే

హానికర కలర్లు ప్రచార ఫ్లెక్సీ వనర్లు
వాడకాలు నిలిపేస్తేనో మూలాలే పెకలిస్తేనో
కళాకారులకు ప్రత్యామ్నాయ భృతి కల్పిస్తేనో..

తాగి నడపడం ప్రాణాంతకమే
పట్టికేసులు పెట్టడం
అడుసులోతోసి., నీళ్ళనమ్ముకోవడమే
బార్లు మూసి., తాగడం ఇంటికే పరిమితం చేస్తేనో
మొత్తంగా మద్యపానమే నిషేధిస్తేనో..

మొసలి కన్నీళ్ళు కంటి తుడుపు ఓదార్పులు
ఎంత ప్రకటిస్తేనేం ఎక్స్ గ్రేషియాలు
కోలుకోగలవా కుటుంబాలు
తిరిగి తేగలమా పోయిన ప్రాణాలు
రోడ్డు రవాణా వ్యవస్థలు ఆధునీకరిస్తేనో
పర్యవేక్షణలో నిబద్ధత కనబరిస్తేనో..

నొప్పింపక తానొవ్వని ప్రణాళికలు రచించాలి
ఉభయతారకమయ్యే నవ్యరీతులు శోధించాలి
విచ్చలవిడి అవకాశాలనిడి
నిర్లక్ష్యపు కైపుల బడి
విపత్తుల ముందుచూపు విస్మరించనేల..!
ఆపత్తుల ఆకళింపులేక విలపించనేల..!!
రాఖీ  "ఋణం"

ఆమెని చూణ్ణే లేదు.,
ఓ ఫెంటో ఐ పలకరించిది.,
అదేంటో తెలీని రోజుల్లో,
అక్షరాల లక్షణాలను బట్టి,
కాసింత కవిత్వాన్ని ఆపోషన పట్టింది.

మనసు పలికే మౌనగీత మై
స్నేహాన్ని నింపింది.

ఆమె ఎంతో అందంగా కనిపించేది,
అదీ ఊహల్లోనే
కవిత్వం అలంకరించుకుందేమో.,

ఉన్నట్టుండి ఒక సాయంకాలాన్ని
కాసింత ఆప్యాతనంజుకుంటూతిన్నాం,
ఆమె కలిసీకలవగనే
కలం బంధం
మరింత అందాన్ని సంతరించుకుంది.,

అనుభూతులను నెమరేసుకోడానికి
అప్పుడప్పుడూ
మాటల్ని గాల్లోకి విసిరేవాళ్ళం,
గాయాలకు అనునయాల్ని మలాంగా పూసి
 భయాల్ని దూరంగా నెట్టేవాళ్ళం,.

కలుసుకున్న కలల పొదరిల్లు తగులబడినా..
కలవడం మాత్రం అలాగే ఉంది,
అప్పుడప్పుడో.,ఎప్పుడెప్పుడో ..

గుర్తించి,గుర్తుంచుకొని
తన కలం అందానికి
దేశం సలాం చేసింది.,
ఇప్పుడు తానో ప్రముఖి.,
నేను మాత్రం ఎప్పటికీ..,రాఖీ

"ఓ మనసా..!"

పెరేదైతేనేం                
పెద్ద హృదయముండాలి
ఊరేదైతేనేం
ఎండని ఏరుండాలి

బాటల్లో...నాటాలి...
ఔదార్యపు మావిళ్ళని

పెదవుల్లో...పూయించాలి
చిరునవ్వుల మల్లెలని

మాటల్లో...కూయించాలి
మార్ధవాల కోయిలని

చూపుల్లో వర్షించాలి
తెరిపిలేని వెన్నెలని

మనసు చేసే మహేంద్రజాలం..
సుఖదుఃఖాల ఆలవాలం
మర్మమెరిగితే...మహర్జాతకం..
మరిచామా మనుగడ కృతకం...!!

Thursday, July 19, 2018


"(ని)వేదన"

నీ ప్రేమ కొరకె బ్రతికేస్తున్నా
కాదంటే వెంటనె ఛస్తా
మరోజన్మ  ఎత్తైనాసరె
నీ కడుపున కొడుకై పుడతా
అప్పుడెలా దూరం చేస్తావ్
వద్దన్నా నను ముద్దాడేస్తావ్
ఓ వనితా
జగన్మాతా
విశ్వవిజేతా
నీ చనుబాల గ్రోల
హరిహర బ్రహ్మలూ
అయినారమ్మా నీ ఒడిలో
పసిపాపలు..
ఇకనే నెంత ?
నీ ప్రేమ ఘన సాగరమంత
అందుకే ఈమోహం అంటా
అందుకే సోహం అంటా
దాసోహం అంటా
సదా సోహం అంటా
నీ దాస దాసోహం అంటా..!!

Monday, July 16, 2018



"స్వయంభువు"

భావుకత పెల్లుబికితే ,
జలపాతం 
కొండనుండి దూకినట్టు,

గడ్డి పరక 
తొలిచినుకుకు 
పుడమిచీల్చుకపుట్టినట్టు ,

రాలిపడే చినుకులని 
ఒడిసి పట్టుకున్న 
సంధ్యా కిరణం 
నింగి ఫలకం పై 
సింగిడిని 
చిత్రంగా వేసినట్టు, 

ఉత్తుంగ సాగర కెరటం 
తీరాన్ని చేరుకొనేే ఆరాటంలో 
నురగలు కక్కినట్టు,

నదీ దర్పణంలో 
బాల సూరీడు 
ముచ్చటగా 
అందాన్ని తిలకించే క్రమంలో 
బిడియంతో 
ముఖబింబం 
అరుణ కాంతులు చిమ్మినట్టు.....

ప్రకృతి వల్ల 
రమణీయత ఏర్పడినట్లు 

హృదయగతమైన అనుభూతి 
అక్షరావిష్కృతమైతే 

సహజ సిద్ధమైన 
భావనాసౌందర్యం 
పాఠక మనో సీమలను 
కవితగా ..
సాహితీ సంజాతగా 
సుసంపన్నం చేయదూ!!

Friday, July 13, 2018

"బహుకృత వేషం"-రాఖీ

దారి తప్పిన పిచ్చి పిచ్చుక
ఎండిన పొలంలో గింజలేరుకొంటోది ఓటీఅరా..


ఎండ్రిన్ డబ్బా,ఉరిత్రాడూ
పందెం వేసుకుంటున్నాయి 'రైతు విముక్తి 'పథకానికి తానే చైర్మన్ అని..,


రకరకాల సమీకరణాలలో
కులపు నిటారు అక్షంపై మతపు సమాంతర అక్షంపై ఏమాత్రం వికాసం తగ్గకుండా
అన్ని వర్గాల్ని వినయంగా అనునయిస్తూ
తాత్కాలిక తాయిలాలు ఊరుఊరంతా ఊరటనివ్వాలని ఆరాట పడుతున్నాయి.

పసితనాన్ని చిదిమిన వికృత కృత్యంలో మసీదూ మందిరము ఒకదానిపై ఒకటి
దుమ్మెత్తి పోసుకుంటున్నాయి

సందిట్లో పడేమాయ గా నగ్నత్వం పాతివ్రత్యం కాకుండా ఎలాపోతుందని వాదనల రొదపెడుతోంది..
కత్తి ఖర్మకాలడం తొమ్మిది గ్రహవీక్షణలో  షరా మామూలైంది..
సేనల దావానలంలో ఏదైనా మసై సమసి పోతూనే ఉంటుంది.

గాలికి కొట్టుకొచ్చిన శ్వేత పత్రం శ్వేతసౌధానికి వధ్య శిలైంది.
పొట్టోడు గట్టోడి ముక్కులో వేలెట్టి తుమ్ముతెప్పించే ప్రయత్నంలో ఉన్నాడు..

చాపక్రింది నీరులా డ్రాగన్ మార్గ సుగమం చేసుకొంటోంది త్రివిక్రముడవ్వాలని..!

నరమాంస భక్షక జిహాద్ లు పెట్రేగి తుపాకులను ఫోర్క్ లుగా మలచుకొని విందారగిస్తున్నాయి

ఇంటర్నెట్టు ఈ-వాలెట్లు ఎంతగా తమవంతు పాత్ర పోషిస్తున్నా ఏటియం లు నోట్లకోసం పడరాని పాట్లుపడుతున్నాయి..

ఊరందరిదో దారి..
ఓదార్పు గోదారి దారి వంశపారంపర్యంగా మారి..
ఇక పాదచారి.,గెలుపు కోరి.,

హోదా మైదానం లో ఎవరౌతారో మల్లయుధ్ధ యోధులు.,

ఏదో కావాలి కానీ ఏదో తెలియని అయోమయంలో
జన భవిత గాలివాటు పథకాలు రచిస్తోంది.

నిజమైన ఏకత్వంలో భిన్నత్వం.,ఇజమైన భిన్నత్వంలో ఏకత్వం గజ ఈత ఈదడానికి మురికి కాల్వలో సాధన చేస్తోంది..

బెడిసికొట్టిన విశ్వాసం మనోరథాల దెబ్బకొట్టినా చెవిలో పూవెట్టే బాటలో ఉంది

కొత్తకూటములు దైవ కూటములై లోకోధ్ధరణ రణతంత్రాలు రచిస్తున్నాయి.,

ప్రతి'సారీ' గతిలేని పరిస్థితే
ఎన్నికలలో కన్న సామాన్యనికి
పళ్ళూడకా తప్పదు.,కొట్టకోకాతప్పదు ఈ సారీ ఏదో ఓ రాయితో..!!

Sunday, June 10, 2018


“పిన్నీసు” 

కొన్ని కొన్ని అంతే...
చిన్న చిన్న పాత్రలే
ఎంతో ప్రభావితం చేస్తాయి
కీలకమైన మలుపులు తిప్పుతాయి
నాయకుడికి దిక్సూచీలౌతాయి
కథా రథ చక్రపు సీలలౌతాయి...
ఆయువుపట్టు ఔతాయి
రామాయణం లో జటాయువులా
భారతంలో పాచికలా

గుండీ తెగిపోయి
జారిపోతున్న లాగు(నిక్కర్)కి
రక్షణ గా నిలబడ్డ వైనం
మరపురానిది

చిరుగును మరుగు పరుస్తూ
బిచ్చగత్తె మానం కాచిన విధం
శ్రీ క్రిష్ణుడికి తీసిపోనిది

తెగిన స్లిప్పర్ నాడాకు
చేయూత నందించి ఆదుకొన్నక్షణం
అపురూపమైనది

కాల్లో గుచ్చుకున్న ముల్లును
లాఘవంగా పెరికిన సందర్భం
ప్రశంసార్హమైంది

చెవిలో గులను దూరం చేసీ,
గుబిలిని తీసీ చేసే సేవ
గురుతరమైనది

పచ్చడిలో
మామిడి ముక్క కొరికినప్పుడు
పళ్ళ సందులో ఇరుక్కున్న పీచు
పీచమణచిన నైపుణ్యం కొనియాడదగ్గది

చిన్న పనిముట్టే
ఎంతో పని చేసి పెట్టు
అల్ప సాధనమే
ఎన్నో సాధించి పెట్టు

మగ పిల్లల మొల తాడుకు
ఆడపిల్లల చేతి గాజుకు
అలనాడు ...

‘అని’నాడు సిద్ధమైన యోధుడి
ఆయుధంలా..
సర్వదా కంటికి రెప్పలా కాచే
అంగ రక్షకుడిలా..

వన్నె తరగక
విలువ మారక
పెన్నిధిగా 'కాంటా'(పిన్నీసు)
పేదవాడి బ్రతుకు దారంటా...

చెప్పడానికి లెక్క దొరకని
తెలపడానికి భాష చాలని
పలువిధ ప్రయోజనకారి
ఎన్నెన్నో అవసరాలకు
తానంటూ ముందుకురికే
బహుముఖ ప్రజ్ఞాశాలి
త్యాగశీలి "పిన్నీసు"...!!

Friday, April 27, 2018


"మైత్రి వనం"

కొందరు నేస్తాలు హరివిల్లులు..
అన్నీ కుదిరినప్పుడే అరుదెంచి అలరిస్తారు,

కొందరు నేస్తాలు ఒయాసిస్సులు..
ప్రాణంపోతున్న సమయంలో ఆర్తి తీరుస్తారు..

కొందరు నేస్తాలు చిరుజల్లులు..
అలా అలవోకగా వచ్చి ఎంతోకొంత ఎద తడిసేలా ఒలక బోస్తారు

కొందరు నేస్తాలు పున్నమి వెన్నెలలు..
క్రమంతప్పక కలుస్తూ కాసింత హాయిని వెదజల్లిపోతారు

కొందరు నేస్తాలు నదులు..
వరదల్లా ముంచేస్తారు కొండొకచో గుక్కెడు నీళ్ళైనా ఇవ్వలేక ఎండి పోతారు

కొందరు నేస్తాలు మలయ సమీరాలు..
అలా స్పృశించి తేరుకునే లోగా ఇలా మాయమౌతారు..

కొందరు నేస్తాలు ఊసరవెల్లులు
ఏక్షణం ఎలాప్రవర్తిస్తారో
వ్యక్తిత్వాన్ని వక్రీకరిస్తారో

కొందరు నేస్తాలు గుంటనక్కలు
స్నేహం ముసుగులేస్తారు
అవకాశం కోసం కాచుకొని నిండా ముంచేస్తారు

ఇందరు నేస్తాల్లో ఏఒక్కరో
ప్రాణసములు..
ఊపిరిలో ఊపిరిగా
హృదయ లయగా
పగలు నీడగా
రేయి కలగా..!!

Tuesday, April 3, 2018

"యాది మనాది"

బాల్యం అమూల్యం
బాల్యం చిరస్మరణీయం
నీదినాది

బాల్యం వైకల్యం
బాల్యం మరణతుల్యం
వీధిబాలలది

వణికించే చలిలో
వర్షించే వేకువలో
పాలపాకెట్లు వేయడం కోసం
డొక్కు సైకిల్ పై
పరుగులు పెడుతుంది ఒక బాల్యం
దినపత్రికలు రువ్వుతుంది
మరో బాల్యం

మబ్బు తెరతీయకముందే
మంచుపొర కరుగక ముందే
నాలుగు కూడళ్ళ మధ్య
అల్లంమొరబ్బా అమ్ముతుంటుంది ఇంకోబాల్యం

కుప్పతొట్టి విలాసమై
చెత్తకుండీల్లో
చిత్తుకాగితాలు
ప్లాస్టిక్ బాటిళ్ళూ
క్యారీబ్యాగ్ లు పోగుచేసుకుని
అమ్మిపొట్టపోసుకుంది
ఇదోబాల్యం

రోడ్డు పక్క కొలిమిలో మోయలేని సుత్తితో
గునపాలకు,గొడ్డళ్ళకు
సాటేస్తూ తండ్రికి సాయంగా
బాధ్యత భరిస్తూ
బంగారు బాల్యం

హోంవర్క్ చేసుకునే సమయంలో
నాలుగిళ్ళలో
కళ్ళాపి చల్లి బోళ్ళు తోమే
పనిలో మరో పగడార బాల్యం

పరికించిచూడు నేస్తం
ఆటపాటల్లో తేలియాడుతూ
సమాంతరంగా చదువుకుంటూ
గడిపేవేళ
కార్పొరేట్ కార్ఖానాల్లో ముడి సరుకై పుట్టకముందే లక్షలు పెట్టుబడి పెట్టి క్రష్ లలో క్రష్ చేయబడే బాల్యం కనబడుతుంది.

బాల్యం నేటి సమాజ వైకల్యం..!
బాల్యం వత్తిడిలో చిక్కిశల్యం..!!

"ఋతుసంహిత"

శిశిరానికి వణికిన తరులకు
దనివారగ కప్పిన  ఆకుల దుప్పటి ఆమని..!!

గ్రీష్మంలో కాలిన పుడమికి
లేపనమై కురిసిన నవనీతం శ్రావణి..!!

వలపులు  రేపిన శరశ్చంద్రిక
తమకపు తపనల తీర్చిన మదన మంత్రం హేమంతం..!!

Wednesday, March 28, 2018

“ఏమి., రాయనూ..!” –రాఖీ,ధర్మపురి-9849693324
(విలంబి ఉగాది శుభాకాంక్షలతో)

ఉగాది వస్తుందంటే ఉత్సాహమే..
కోకిలకీ, కవికీ..
లేమావి చివుర్లతో గొంతు సవరి౦చుకోవచ్చనీ..
ఉరకలెత్తే భావాలతో కలం ఝళిపించ వచ్చనీ
ఆరు ఋతువులు..కాలమానాలు
ఆరు రుచులూ ..పంచాంగ శ్రవణాలు
హేవలంబికి శాపనార్థాలూ
విలంబికి ప్రార్థనాయుత వినతి పత్రాలు..

ఎప్పుడూ ఉండేదేగా ..పాత చింతకాయ పచ్చడి
ఏం రాయనూ పదేపదే,నవ్యత చూపాలిగా... చచ్చీ చెడి

విజయ్ మాల్యా,నీరవ్ మోడీ ల్లాంటి ఘరానా మోసగాళ్ళ గురించి
అడుగడుగునా ఎదురయ్యే..రాజకీయ పగటి వేషగాళ్ళ గురించి
పండగ పూట దండగమారి మనుషుల గురించి
ఏమనుకొన్నా చర్విత చరణమే..!

నోట్ల రద్దు ఓట్లకు చేటైనట్లు...
ఆర్ధిక నిర్భందంలో సామాన్యుడు సతమతమౌ తున్నట్లు
రె౦డెక్స్ ల “జీ యస్ టీ” లతో ఇండెక్స్ లు అతలాకుతల మైనట్లు...
పీల్చి పిప్పిచేసిన మీడియా..కాల్చి మసి చేసిన పాడిగా
రాజకీయాలు ,రక్త పాతాలూ..భ్రూణ హత్యలు..నర బలులు
బ్యాంక్ స్కా౦ల బాగోతాలు..దొంగ స్వాముల దురాగతాలూ
స్త్రీ ల పట్ల అత్యాచారాలు,విచ్చల విడిగా సాక్షాత్కరించిన లంచావతారాలూ..
హోదా ప్రాతిపదిక గా జరుగుతున్న ఉదంతాలు,రాద్ధాంతాలూ..
షరా మామూలుగా రాయడానికి..వార్తా విశేషాలా కవితలు..?
సంచలనాత్మక కథనాలా...కవి భావుకతలు..?! ఏం రాయనూ...!

మరిచిపోతున్న మానవీయ విలువల్ని గుర్తుకు తెస్తా..
మనిషి ఏకాకిగా మిగిలిపోతున్న సంగతి విశద పరుస్తా..
మెదడు హృదయాన్ని ఎలా కరుడుగట్టిస్తున్నదో ఎరుకపరుస్తా
చిన్ననాటి అనుభవాల అనుభూతుల్ని తేనెల ముంచేస్తా..

వృద్ధాశ్రమాలు మూతబడేలా..
నిరాదరణకు గురైన తల్లిదండ్రుల అనురాగం
వారి సంతానానికి గుర్తుకు తెస్తా..

విద్యా, వైద్యం కార్పోరేట్ కబంధ హస్తాల్లో..
ఎలా నలిగి పోతున్నదో..కనువిప్పు కలిగిస్తా
బాల్యం సహజ ప్రతిభను కోల్పోయి.,
ఎలా హ్యూమనాయిడ్ అయ్యిందో
మమ్మీ డాడిల కళ్ళు తెరిపిస్తా...

హెల్మెట్లు సీట్ బెల్ట్ ల పట్ల నిర్లక్ష్యం
యువత పాలిట ఎలా యమ పాశమౌతుందో
తెలియ పరుస్తా..

మద్యం మత్తు.,అతివేగపు గమ్మత్తు
బ్రతుకునెలా బలితీసుకు౦టాయో తెలుసుకునేలా
ప్రకటిస్తా..

ప్రపంచ తెలుగు మాహా సభల విజయ గర్వంతో
తెలుగు భాషను తెలుగింటింటి తోరణం చేస్తా..
మహారాష్ట్ర కర్షకుల పాదయాత్ర స్ఫూర్తిగా..
ఆదివాసీల అకు౦ఠిత దీక్ష సాక్షిగా...
బంగారు తెలంగాణా మీదుగా..
భవ్య భారత్ వైపు.. అడుగులేస్తా..!!

Tuesday, March 20, 2018


మన్మధ జననం

కలం ఉలికి పడింది...ఉగాది వచ్చేసింది ఆనవాయితీగా కవిత రాయాలి కదా అని,
వెదుకులాట మొదలైంది వస్తువు కోసమని..
ఆరాటం సారథి అయ్యంది మనోరథానికి,

లౌక్యం యుక్తి సూక్ష్మం బోధించింది,ఎన్నాళ్ళుగా నో రాస్తున్నావ్ ఆ మాత్రం తెలీదా అని,
ఆరు రుచుల జీవితం,
ఆరు ఋతువుల కాలం
ఇదే కదా ఉగాది మర్మం
ఇదే కదా ఉగాది కవితా వస్తు ధర్మం!

మధు మాస మకరందం,కోయిల గానం- తీయ దనం
గ్రీష్మ ఋతు మండే తాపం ,భానుడి ప్రతాపం-కార గుణం
వర్షాకాల పుడమి ప్రసవం,జల ధారల గగనం -ఉప్పుకి తార్కాణం
యువ జంటల కలల వలపు పంటల శరత్కాలం-
వగరుకు చిహ్నం
కౌగిలింతల వింతల చింతల హేమంతం -పులుపుకు ఆలవాలం
అహరహర విరహ అనురాగ శిశిరం-చేదుకు ఆలంబనం

 జీవన వనంలో ప్రతి ఉదయం ఉగాది ఆగమనం!
తీపి చేదూ కలయికలో ప్రతి క్షణం "మన్మధ "జననం మరణం!!

Friday, March 2, 2018


"కవి(కో)కిలా..?!"

కాలం జారిపోతోంది..
వేళ్ళ సందుల్లోంచి..
కవిత కోసం ఆగలేక

దృక్పథం మారిపోతోంది...
నా చిన్ని బొజ్జకు ...
శ్రీరామ రక్షగా

పలకరించే పాఠకులకోసం...
అక్షరాలు నిరీక్షిస్తూనే ఉంటాయి

ఎదురొడ్డే ధైర్యానికి ...
కొత్తగా సైబర్ బెదిరింపులు ..
తోడేళ్ళయ్యాయి,

లబ్దప్రతిష్టులకే...
ఉపలబ్దమౌతోంది ...
ఏ మాధ్యమమైనా

కర్ణుడి చావుక్కారణాలెన్నో...
కవిత మనుగడలో
ద్యోతకమౌతాయి,

కవులు
కవిత
గెలవడానికి..
నేస్తం..

కనీసం ఒకరైన
స్పందించి
అందించాలిగా
 స్నేహ హస్తం...!!

Saturday, February 17, 2018


"కవిజాలం"- రాఖీ

ప్రేమ ,స్నేహం
జ్ఞాపకం ,జీవితం
కళలు కన్నీళ్లు
మనసు...హృదయం
బాధ ,బంధం
గెలుపు ఓటమి 
చెలి చలి
ఋతువు..వెన్నెల
జాబిలి...రాతిరి
కల ఊహ
ఉదయం ,ఊపిరి.....ఇలా

పరిమిత  పదాల మధ్యన
బావి లో నీరు బోలు 
భావన ల చుట్టూ
ఎవరికీ వారు గీసుకున్న 
పరిధులకు లోబడి
పరిభ్రమిస్తోంది....
అంతర్జాల
తెలుగు కవిత..!

పఠనాను రక్తిని ..అభివ్యక్తిని 
పుణికి పుచ్చుకుంటే...
అది అజరామరమై...
తరాలను తడుముతుంది..
తెలుగు మధురిమ...!

"వికలలాస్యం"

ఎందుకు చూస్తోంది 
ప్రపంచమంతా 
గుడ్లప్పగించి 
ఈ దారుణాన్ని..

ఎందుకు సహిస్తోంది 
మానవాళి 
ఈ మానహననాన్ని..

ఎందుకు మిన్నకుంది 
ప్రభుత 
చేష్టలుడిగిన దానిలా..

మొదలైందిలా 
ఒక కలం 
కత్తై 
ఉన్మత్తుల కుత్తుకపై..

చెలరేగిందిలా 
కాళికలా 
ఒక కామదహన 
జ్వాలికలా..

నగ్నసత్యాల 
విశృంఖలతను 
బుగ్గజేయ
గుప్పిటిగుంభనాల 
అందాలకు 
రక్షనీయ..!!

Sunday, January 21, 2018


"తెలుగింటి ఇంతి -వెలుగుల సంక్రాంతి"

కళ్ళాపి జల్లిన లోగిళ్ళు
ముత్యాలముగ్గుల ముంగిళ్ళు
గోమయపు తీరైన గొబ్బిళ్ళు
సంక్రాంతి శోభతో తెలుగిళ్ళు

పంటసిరులతో నిండిన గాదెలు
గంగిరెద్దుల ఆటల వీధులు
హరిదాసు పాడే తత్వగాథలు
సంక్రాంతి సంబురాల తెలుగిళ్ళు

కోనసీమ పచ్చని అందాలు
కోరికోరి ఆడే కోడిపందాలు
పల్లెపడుచు పరికిణీ ప్రబంధాలు
సంక్రాంతి సంతసాల తెలుగిళ్ళు

ఉత్తరాయణ శుభ పర్వదినాలు
పితరులకిల తిలతర్పణాలు
నోములు వ్రతముల భక్తిభావనలు
సంక్రాంతి వైభవాల తెలుగిళ్ళు

చిటపట చిటపట భోగిమంటలు
సకినాలర్సెల పిండివంటలు
పండగ నిండగు కొత్త జంటలు
సంక్రాంతి సరదాల తెలుగిళ్ళు

చిన్నారులపై భోగిపళ్ళు
నింగిలొ ఎగిరే పతంగులు
బంధుమిత్రుల సందళ్ళు
సంక్రాంతి లక్ష్మి తో వెలుగిళ్ళు మన తెలుగిళ్ళు