Wednesday, April 22, 2020



"చరమ గీతం"
పారిపో కరోనా మా భూమండలంనుండి
మారిపో కరోనా మానవాళికి హానిచేయని విధంగా
నీకేం తెలుసు ప్రాణం విలువ
నీకేమెరుక బాంధవ్య మూల్యం

ఉండీలేని జీవమున్న ప్రాణివి నువ్వు
నిర్జీవ జీవ శిఖండివి నువ్వు
విచిత్రమైన పరాన్నబుక్కువి నువ్వు
జీవాణుబాంబువి నువ్వు
నరజాతిని కడతేర్చేందుకే పుట్టునట్టున్నావు
మనిషిని మాయచేసే గుట్టేదో పెట్టుకున్నావు

మేమిప్పుడే గ్రహిస్తున్నాం నీ పుట్టుక మూలం
మేమిప్పుడే సంగ్రహిస్తున్నాం
మేమిప్పుడే కళ్ళుతెరిచి సంశోధిస్తున్నాం
నీ జన్మ మూలాలను మూలకారణాలను
మేం చేసిన దారుణాలా ,జీవాయుధ రణాలా అన్నవాస్తవాలను

నీ తాటాకు చప్పుళ్ళకు బెదిరే కుందేళ్ళం కాము మేము
నీ సంకుల సమరానికి వెఱచే బీరువులం కాబోము
మాకు ఎనలేని ఆయుధాలున్నాయి
మా ప్రణాళికలు అంచనాలు మాకున్నాయి
జాగృతానికి జాగైందేమోకాని
సమాయత్తమైనామిక
మిగిలింది నీ సంహారమే

కాచుకో ఇక మా ఇల్లే మాకు స్వర్గం
నీ వ్యాప్తికి అది మా దుర్గమ దుర్గం
అత్యవసరాల్లో బయటికి వెళ్ళినా
సామాజిక దూరం మా యుద్ధవ్యూహం
మూతి ముక్కులు మూస్తూ మూసిక(మాస్క్)కట్టుకోవడం
అదే మాకు రక్షణ కవచం
మా చేతుల్ని పదేపదే కడగడానికి వాడే
సానిటైజర్లు సబ్బులు మాస్క్ లు మా అస్త్రశస్త్రాలు
అవే నీకు మరణ శాసనాలు

చరిత్ర తెలుసుకో
సంయమనం వీడకుండా నీ పూర్వీకులను
టీకాలతో మందులతో తుదముట్టించాం
నామరూపాలు లేకుండా నాశనం చేసాం
మా మానవులతో పెట్టుకుంటే మట్టగొట్టుకపోతారు
నువు తోకముడవడమే తరువాయి
ఇదే నీ చరమగీతం కడసారిగా వినరోయి..!!

Tuesday, April 21, 2020

" పదకొండో అవతారం"  -డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)

నిజం చెప్పొద్దూ.,చాలా రకాలుగా మంచిదే కరోనా/
గురువై పాఠాలు చెపుతోంది/
అనుభవైకవేద్యమైన గుణపాఠాలు నేర్పుతోంది/
ప్రవక్తగా బ్రతుకు పరమార్థం  బోధపరుస్తోంది/
మరుగున పడ్డ మానవత్వాన్ని మరల మేలుకొల్పుతోంది/

త్సునామిలా ఒక్క ఉదుటన తీరాలకు తీరాలు మట్టుబెట్టడం లేదు/
తుఫానులా ఏ అర్ధరాత్రో ఊళ్ళకూళ్ళు తుడిచిపెట్టడం లేదు/
కేదార్ నాథ్ వరదల్లా శవాల ఆచూకైన తెలియనట్టు విరుచుక పడడం లేదు/
ఏ టర్నొడోనోలానో ఏభూకంపంలోనో నగరాలను ధ్వంసం చేయడం లేదు/
తన ఉనికి చాటి మరీ కయ్యానికి కాలుదువ్వుతోంది/
మన దుర్బుద్ధిలోనే పుట్టి ,మన వికృత చేష్టలతోనే రూపుదిద్దుకొని/
మన పైశాచిక హింసాత్మక ఆహార విహారాలనే/
ఆలంబన చేసుకొని వేళ్ళూనుకొంది/
మన నిర్లక్ష్యాన్నే ఊతంగా మలచుకొని పెట్రేగుతోంది/

ఐనా తను పట్టుబడటానికి తనని కట్టడి చేయడానికి/
విస్తృత విశేష అవకాశాలను కలుగజేస్తోంది/

పర్యావరణ హాని అని ప్రపంచం మొత్తుకుంటున్నవేళ/
కాలుష్యం కోఱల చిక్కి విలవిలలాడే విపత్కర సమయాన/
దానవత్వం దారుణంగా చెలరేగుతున్న తరుణాన/
పరిసరాల పరిశుభ్రత విలువ నెరుక పరుస్తూ/
పచ్చదనం స్వఛ్ఛదనం నేర్పిస్తూ/
కోల్పోతున్న మానవీయ దృక్కోణాలని, దృక్పథాలని పునఃప్రతిష్ఠిస్తూ/
దిగజారిన కుటుంబ బాంధవ్యాలని మళ్ళీ పెనవేసేలా చేస్తూ/
మానవ జీవితంలోని విలువలను గురుతుచేస్తూ/
సంప్రదాయాలు ఆచారాలని పునర్జీవింప జేస్తూ/
ప్రపంచ మానవాళిని సంఘటిత పరుస్తూ/
వైరి దేశాలనూ ఐక్య పరుస్తూ,వసుధైక కుటుంబ భావనకు జీవం పోస్తూ/
తరతమ భేదాలు తొలగిస్తూ ,వ్యక్తులకు హద్దులు నిర్దేశిస్తూ/
సంభవామి యుగే యుగే అన్నట్లు/
పదకొండో అవతారంగా ఆవిర్భవించింది కరోనావతారం!

మాంత్రికుడి ప్రాణం మఱ్ఱిచెట్టు తొర్రలో ఉన్నట్టు/
కరోనాకు ఆయువుపట్టు దాని వ్యాప్తి నరికట్టడంలోనేఉంది.!/
తెలిసి తెలిసి వచ్చేదాన్ని తెలివిగా మట్టుబెట్టొచ్చు/
అవతార ప్రయోజనం నెరవేరిందన్నట్టు కరోనాను కాటికంపవచ్చు/

గడప దాటితేనే గండం-ఇంటిపట్టునుంటే బ్రహ్మాండం/
కనులు ముక్కు నోరే కరోనా ప్రవేశ సింహద్వారం/
చేతులు కడగడమే ఏకైక బ్రహ్మాస్త్రం/
సామాజిక దూరమే కరవాలం/
అంతా మనమంచికే -/
ఇక ప్రభుత్వ నిర్దేశాల ఆచరణతో కరోనా కథ కంచికే..!!