Friday, September 13, 2019

"కవి"

అందరూ కవులే
నాలుగు ముక్కలు
ఏ సిగరెట్ పెట్టె పైననో
ఏ బస్ టికెట్ వెనకాలో
తామూ కవిత్వం రాయాలనే
తహతహలో
తపనలో

ఆర్భాటపు సభలు
ముందస్తు ఒప్పందాలతో
అవార్డులు పురస్కారాలు
షాలువలు షీల్డులు
పత్రికల్లో వార్తలు
ఫోటోలు

మందీ మార్బలం ఉంటేసరి
కులం మతం ప్రాతం
ఏదో ఒక ఆధారం
అస్మదీయుడైతేచాలు
అంతంత మాత్రమున్నాచాలు
వేదికలు
పత్రికలు
అన్నీ మనవే

పరస్పరం వీపుగోక్కోవడాలు
పరస్పరం ఆకాశానికెత్తేయడాలు
నోరు గల దేవుళ్ళు
చొరవగల్గిన మారాజులు
లౌక్యమెరిగిన చాణక్యులు
ప్రపంచ తెలుగు మహాసభల్లో
ముందువరుసలో వాళ్ళే
ఆహ్వానాలు ఆతిథ్యాలు
అందుకున్నదీ వాళ్ళే
పారితోషకాలు
బహుమతులు
పొందింది వాళ్ళే

మహామహులు
ఘనకవులు
సాహితీ దురంధరులు
సారస్వత సేవా తత్పరులు
నిత్య కవన హవన దీక్షాదక్షులు
నిరంతర సాధకులు
కవితా క్షేత్రహాలికులూ
అందరిలో తామూ
వారి చిరు దరహాస మోమూ..

ఎందరో వారికై
వారి ఆత్మ సంతృప్తికై
రాయడమే యజ్ఞంగా
భారతీ పుత్రులు
సరస్వతీ ప్రేమపాత్రులు..

ప్రఖ్యాతే ప్రాతిపదికగా
ప్రాచుర్యమే కొలతబద్దగా
ఎంచే లోకంలో
మౌనంగా
ధ్యానంగా..

(నిజమైన కవులకు, మరుగున పడిన మహానుభావులకు సదా శిరసా వందనాలు)

No comments:

Post a Comment