Thursday, March 4, 2010

“యత్ర నార్యస్తు పూజ్యంతే”


“యత్ర నార్యస్తు పూజ్యంతే”

ఎవరు గుర్తించగలరు-స్త్రీ ఔన్నత్యాన్ని
ఎవరు కీర్తించగలరు-మహిళ మూర్తిమత్వాన్ని
ఎవరు తెలుసుకొనగలరు-పడతి ప్రేమ తత్వాన్ని
ఎవరు శ్లాఘించ గలరు-సుదతి సౌందర్యాన్ని
ఎవరు కొనియాడగలరు-తరుణి త్యాగనిరతిని
ఎవరు ఆరాధించగలరు- నాతి దైవత్వాన్ని
జననేంద్రియాలు-పాల సంద్రాలు
చర్మ వర్ణాలు-దేహ గణితాలు-అవయవ పరిమాణాలు
ఇంతేనా ఇంతి విలువ!
ఏనాడో వేసుకుంది నీకై- తనకు తానే శిలువ!!
మిత్రమా అప్పుడే మరచిపోయావా-పాలుతాగి రొమ్ము తన్నావుకదా!
నేస్తమా ఇంతలోనే కైపు తలకెక్కిందా –తిన్న ఇంటి వాసాలు లెక్కిస్తున్నావు మర్యాదా!!
నిన్ను నవమాసాలు మోసిందీ –నెలతే
తన రక్తమాంసాలు పంచిందీ –రమణే
నీకు స్తన్యమిచ్చి నీ ’కొవ్వు’ పెంచిందీ –ఒక సుందరే
నీ మలమూత్రాల నెత్తి పోసిందీ-ఒక ముదితే
నీకే రోగమొచ్చినా-నీకెలా నొచ్చినా
కనురెప్పలా కాచిందీ-గారంగా పెంచిందీ-ఒక కాంతయే
నేస్తమా!
నీ అసహాయ అసహన కోప ప్రదర్శన
కేవలం అది ఒక బూతో-నీ పుట్టుకకి కారణమయ్యే రీతో
నువ్వు నోరు తెరచి పేలితే -అది ఒక తల్లి గురించో-చెల్లి గురించో
మిత్రమా!!
నీవు పెదవి విప్పి వాగితే-అది ఒక శాపనార్థమో
ఒక అవయవ అవకర అవగుణగణమో
కించపరచడం మినహా నువ్వేం సాధించగలవ్
మనసు నొప్పించే తరహా మాత్రమే వాదించగలవ్
ఆమాత్రం అందరూ పేలగలరు-అంతకన్న ఎక్కువే
ఎదురు దాడి చేయగలరు
పరిధులు దాటని సంస్కారం వారికి వెన్నతో పెట్టిన విద్య
అవధులు మించని గాంభీర్యం-వారు నేర్చుకున్న విజ్ఞానం
దైవమిచ్చిన నాలుక-కాదుకదా అశుద్ధానికి ప్రతీక!
వరంగా దొరికిన వాక్కు-కాకూడదు కదా అసహ్యించుకోబడే కక్కు!!
పవిత్రమైన నీ హృదయం-ఎలా అయ్యింది మల నిలయం?
ఇప్పటికైనా నిన్ను నీవు తెలుసుకో
నీ తప్పులు నీవే దిద్దుకో
నీ బ్రతుకుని మంచిగా మలచుకో
నీ జన్మకి సార్థకత చేకూర్చుకో
నిను కన్న వాళ్ళు-కట్టుకున్నవాళ్ళు
నీ చుట్టూ ఉన్నవాళ్ళూ గర్వించేలా మసలుకో
అందిస్తున్నా నేస్తం –నీకే ఈ సమస్తం!!!!!!!

No comments:

Post a Comment