Sunday, March 14, 2010

ఈ ఉగాది ఆనందానికి సమాధి


రక్తాక్షి ఏం చూసింది రుధిరాన్ని తప్ప
రక్తాక్షి ఏం మిగిల్చింది నిట్టూర్పు తప్ప
రక్తం ఏరులై పారింది నిన్న
హాహా కారాలే ఏ నోట విన్నా
ఏముంది గతం వేపు తిరిగి చూస్తే
కాకులు గ్రద్దలు వాలే స్మశానం తప్ప
ఏముంది చరిత్ర పుటలు తిరగేస్తే
రక్తాక్షి లిఖిత రక్తాక్షరాలు తప్ప
ఏ వర్షం చూసినా ఏమున్నది హర్షం?
బాధల పెదవులు పులుముకున్నాయి చిరు వర్షం !
ఏ గానం విన్నా ఏమున్నది వినోదం?
జగమంతా ప్రతిధ్వనించు అన్నార్తుల ఆర్తనాదం!!
క్రోధన మాత్రం ఏంతెస్తుంది రోదన తప్ప
క్రోధన మాత్రం ఏం మిగులుస్తుంది ఆవేదన తప్ప
నిన్నకారిన రక్త ధారలు తుడుస్తుందా ?ఓదారుస్తుందా!
అమ్మ మానం అమ్మజూపిన
పరమ నీచుల మారుస్తుందా? తెగటారుస్తుందా!
అన్నదమ్ములు మతం పేరిట
కుమ్ములాడితె విడిపిస్తుందా? తీర్పిస్తుందా!
క్రోధన మాత్రం ఏం తెస్తుంది రోదన తప్ప
క్రోధన మాత్రం ఏం మిగులుస్తుంది ఆవేదన తప్ప
మీద ఉమ్మేసినా సహిస్తాం మేం
కాలదన్నేసినా క్షమిస్తాం మేం
ఓర్పు మా మారుపేరు-సహనం మాబ్రతుకు తీరు
అందుకే రా క్రోధనా! చేసిపో విలయ నర్తన!!

No comments:

Post a Comment