Saturday, June 19, 2021

 "కవితా…భావాలంకృతా"


కవితకేం ...విషయం ఉంటుంది

విషయమే ఉంటుంది,ముచ్చటలా

కవిత్వం మాత్రం మృగ్యం

సుందరికి తన అందపు కేంద్రం తెలియనట్లు..


కవితకేం..కవిత్వం పుష్కలంగా ఉంటుంది

విషయమన్నది శూన్యం..

ఆకర్షణీయంగా అలంకరించుకొని

సౌందర్యంగా అగుపించే అతివలాగ...


పదాలను వాక్యాలను ఎగ్గొట్టి దిగ్గొటి

విరిచేసి కరిచేసి వచన కవిత అనిపించేలా చేసి

అంగన తన ఆస్తులన్నీ చూపిస్తూ

వడ్డించి విస్తరిలా పరిచేస్తూన్నట్లుగా


షోకేస్ బొమ్మలుకాదు కవితలు,

కవితల ఆత్మ సౌందర్యం కదా 

ఎదుటివారి ఎదలను హత్తుకోవాలి

రెచ్చగొట్టేవో,చిచ్చుపెట్టేవో కాదు

గుండెలో నొచ్చుకోకుండా గుచ్చుకోవాలి..


ఊహలకు ఆలంబనగా 

కవితా చిత్రాలు ఆకట్టుకోవాలి

మనసులను మరోలోకాలకు

తీసుకవెళ్ళే గీతాలకు

సంగీతం చేయూతనీయాలి..


పాఠకుడిని అది తనకవితే

అది తన చరితే అన్నంతగా

గుప్పిట బంధించగలగాలి,


తొలి పదం తొలి వాక్యమే

కవిత పాఠకుణ్ణి వదలక

తన వెంట లాక్కెళ్ళగలగాలి


మధ్యలో విషయంలో ముంచివేసే

శైలి శిల్పం గుక్కతిప్పుకోనీయకుండాలి


కొసమెరుపుతో

ఎదభారంతో చదువరి

గాఢనిట్టూర్పునొదలాలి..

కవి తనూ కలవరించి

పలవరించి తరించినపుడు

కవిత కవితగా సఫలీకృతమై

సుకృతమవదూ...!!

No comments:

Post a Comment