Friday, November 19, 2021

 దాంపత్యపు ఆధిపత్యం


ఒకే కలుగులో కాపురంచేసే పిల్లి ఎలుకలం

ఒకే చెట్టుపై వాసముంటున్న పామూ ముంగిసలం

నీ కష్టాన్నీ నా ఇష్టాన్నీ ఏ నాడైనా 

పరస్పరం అర్థం చేసుకున్నామా

మతమొకటైతేనేం అభిమతాలు వేరై

కులమొకటైతేనేం వ్యాకులాల నీడై

చిన్న చిన్నత్యాగాలైనా చేయక

కాస్తైనా పట్టూ విడుపూ లేక..


నీకుండే చిరుచిరు సరదాలు

పొందికగా ఇంటినుంచుకోవడం

ఒద్దికగా ఒంటినుంచుకోవడం

చొరవగా నీ పనుల్లో పాలుపంచుకోవడం

ఎదెరైన ప్రతివారినీ ప్రేమగా నవ్వుతూ పలకరించడం

ఏసాయానికైనా వెనకాడకుండా 

ఆదుకోవడం

నన్ను నీలా ఉండమంటే ఎలా,?

కొన్ని సుగుణాలు జన్మతః రావల్సిందే

ప్రత్యేకించి చేస్తే కృతకంగా ఉండవూ..

నీభావాలను నేనెప్పుడు అడ్డుకున్నానని


చిక్కల్లా నన్ను నీలా ఉండమంటేనే

నాకు ఇల్లు జైలుగా మలిస్తేనే..

ఒకరికొకరంలా కదా ఉండాల్సింది..

నీకోసం మాత్రమే నేను అంటేనో..

ఇచ్చిపుచ్చుకుంటే గౌరవం

ఇరువురమూ సర్దుకుంటేనే కాపురం..!!

No comments:

Post a Comment