Friday, November 5, 2021

 


"పుణ్యభూమి నాదేశం నమోనమామి"


ఇది విలువలకు విలువిచ్చే పుణ్యభూమి
ఇది కర్మలను ధర్మంగా నిర్వర్తించే కర్మభూమి

ఇక్కడ అన్యాయం అక్రమాలకు ఆచూకే దొరకదు
ధర్మం అన్నియుగాల్లోనూ నాలుగు పాదాలమీదనే నడుస్తుంది
ఇక్కడ ఒక్క అనాథ పిల్లవాడు,బాలకార్మికుడూ దొరకడు
కూడళ్ళలో బిచ్చమెత్తుకోవడం అనేది అసలే కనిపించదు

మర్డర్లు మాన భంగాలకు ఇక్కడ తావేలేదు
కోర్టుల్లో పెండింగ్ కేసులే ఉండవు..
నిజానికి కేసంటూ ఉంటేనే కదా పెండింగు
రహదార్లు పూదార్లని తలపిస్తాయి
ట్రాఫిక్ జాంల ఫికరే ఉండదు
పన్నులు జరిమానాల బెడదే కరువు
ఆఫీసుల్లో అవినీతికి లంచాలకు అవకాశమే ఉండదు

జనావాసాల మధ్య మద్యపు దుకాణాలు బెల్ట్ షాపులు పర్మిట్ రూంలు ఉండనేఉండవు
ఐనా మద్యనిషేధం అంత పకడ్బంధీగా అమలౌతుంటే జనావాసాల అతీగతి అప్రస్తుతం
ఇప్పటి నేతలు అభినవ గాంధీ తాతలు
ఈనాటి  నాయకులు అపర అంబేడ్కర్ లు
రాజకీయల్లో అరాచకీయమే ఉండదు
అధికారులు అమాత్యులు నిజాయితీకి మారు పేరు
ఓట్ల అమ్మకాలు,కులమత ప్రలోభాలు ప్రసక్తిలేక
అత్యంత సజావుగా పాలకులను ఎన్నుకుంటారు
పార్టీలు సిద్ధాంతాలకు కట్టుబడి,ఫిరాయింపులకు తావీయవు
నిజమైన కార్యకర్తలకే తప్ప ద్రోహులకు పదవులు పంచనేరవు

కార్మికులు కర్షకులు సుఖసంతోషాలతోవిలసిల్లుతుంటారు
సమ్మెలు దొమ్మీలు దోపిడి దొంగతనాలు ఒక వింతైన విషయం
ఫేస్ బుక్కులు వాట్సప్పుల స్మార్ట్ ఫోన్ మాయాజాలంలో
ఎవరూ చిక్కుకోరు..తమతమ పనుల్లో బిజీగా ఉంటూ..

సోషల్ మీడియా రియల్ మీడియాలు వాస్తవాలనే
 ప్రసారం చేస్తాయి ప్రచారం చేస్తాయి..
ఇరుగు పొరుగు దేశాలు స్నేహంతో మెలుగుతూ 
ఉగ్రవాదం అన్న శబ్దానికే దూరంగా ఉంటాయి
దేశభక్తి పరిఢవిల్లుతుంది
హిందువులు వారి పండుగలు అధికమైనా
మైనార్టీల పండుగలకే సెలవులు మెండు
ఇఫ్తార్ విందుల సందడితోబాటు 
అన్యమతస్తులు నిర్భయంగా 
దేవాలయాలలో శిలువలు పాతుతారు
అన్ని మతాల్లోనూ ఒక్క దొంగబాబా కనరాడు
మేధస్సుకే తప్ప కులమతాల ప్రాతిపదికలతో
ప్రత్యేక నెత్తికెక్కించుకోడాలు ఉండనేఉండవు
ఆర్థిక సామాజిక రాజకీయ విద్యా విజ్ఞాన రంగాలలో
అందరు పౌరులకీ సమానావకాశాలే..
ఎంత రాసినా ఈ రామాయణం ఒడువదు
నర్మగర్భంగా చెప్పినా ఈ భారతం ఎక్కదు
 జై తెలంగాణ ..!జై హింద్..!!

No comments:

Post a Comment