“అశ్రుగాథ”-రాఖీ
కన్నీటికీ ఓ మనసుంది...
పాపం జాలి గుండె..ఇట్టే కరిగి
ప్రవహిస్తుంది హిమానీనదం లా
కన్నీటికి ఎంతో ఘన చరిత్ర ఉంది
తర తరాల
పర పీడనలో
నరజాతి కార్చిన కన్నీరే
ఈ సప్త సముద్రాలుగ మారె..
ఉప్పుగా ఉండడం చూస్తే తెలుస్తోందిగా
కన్నీరే
కడలి నీరని..
కన్నీటికి సంగీతమూ తెల్సు...
కడుపు చించుకొనే తల్లీ
బొడ్డూడిన బిడ్డా
ఆక్రందనల రాగాలే ఆలపిస్తారు
మౌనంగా మొదలైన రోదన
వెక్కుతూ వెక్కుతూ
బావురు మని తోసుకోచ్చే
బాధనంత మోసుకొచ్చి
వెళ్ళగక్కి ఉపశమనమిచ్చే
ఓషధులు కన్నీళ్లు..
ఎద తీవ్రత తగ్గించే వైద్యమూ...
వ్యధ ఆకలి తీర్చే నైవేద్యమూ..కన్నీళ్ళే..
వేదన మాత్రమే కాదు
ఊహించని విజయాన్ని
వేడుక చేసుకొనే వైనమూ..తెల్సు కన్నీటికి..
వెతలను పంచుకొనే స్నేహమూ..తెల్సు కన్నీటికి
ఎక్కడో మరుగున పడ్డ
మానవత
తాదాత్మ్యం చెందినందులకు
ఆశ్రు నివాళి అర్పించడమూ తెలుసు కన్నీటికి..
కన్నీళ్లు బానిసలు కావు.
రెప్పలు కబంధ హస్తాలతో
కన్నీటి గొంతు ఎంతగా నొక్కినా
సంకెళ్ళు త్రెంచు కొనే యోధుడిలా
చెలియలి కట్టలు అధిగమించే
ఉగ్ర సాగర కెరటాలు కన్నీళ్లు
విషాదాలు మోదాలు అనుభవాల వాసుకితో..
హృదయ సాగర మధనం చేస్తే
ఉద్భవించే గరళామృతాలు..కన్నీళ్లు
తరతమ భేదాలకి
కులమత వాదాలకీ
అతీతమైనవి కన్నీళ్లు
కలికి అలకలొలికించు
దివ్యాస్త్రాలు కన్నీళ్లు
నేత్రాల కేమాత్రం
నలక వాలనీయని అంగ రక్షకులు
కన్నీళ్లు
దుమ్ము కొట్టబడిన కళ్ళు
ప్రక్షాళన మొనరించె
అభంగ మృదంగ తరంగ గంగా తరంగాలు
కన్నీళ్లు
ఆనందపు అంచులు తాకే చిరునామాలు
శోకాల అగాధాలు చూసే ఆనవాళ్ళు
కన్నీళ్లు
అ౦పకాలలో
వీడ్కోలులో
పెత్తనం మీద వేసుకొనే
పెద్ద ముత్తైదువ పేరంటాళ్ళు
కన్నీళ్లు
కన్నీటి గురించి ఎంత రాసినా
కన్నీరు మున్నీరు కావడమే గాని
కన్నీటి కథ ఎప్పటికీ ..సశేషమే..!!
No comments:
Post a Comment