"మాకూ మనసుంది"
సాటి ఎక్స్ క్రోమోజోమ్ తో
నన్ని కలపకు ప్రభూ ...- తన ప్రార్థన
అరణ్య రోదనగా -"ఎక్స్ క్రోమోజోమ్"
ఆ పిండం ఆడపిల్లే అన్న నిజాన్ని
దాచలేని అసహాయురాలు...
గుడ్లనీరు కుక్కుకుంటూ...
-"అల్ట్రా సౌండ్ మిషన్"
తాను మోసుకొచ్చే వాస్తవం
ఆదంపతులకు
ఆనందం చేకూరుస్తుందో లేదోనని
అతృత పడుతూ చెవిలో దూరింది -'వార్త'
బయటికి సంతోషం
లోపల ఆదుర్దాతో
చిత్రంగా ప్రకటితమైంది
ఆ తండ్రి "ఎక్స్ ప్రెషన్ "
ఎవరైతేనేం పుట్టింది ,
పోనీలే పాపం
తల్లికి గండం గడిచింది అంటూ
చూడవచ్చిన ప్రతివాళ్ళ సానుభూతితో
పుట్టిన ఆపాప నోటిపై వికసించింది"బోసినవ్వు"
ముందు పుట్టినా వెనక పుట్టినా
సోదరుడివల్ల వెలికి వచ్చి,
నిన్ను జీవితాంతం వీడనంటూ
ఆడపిల్లకు తొలినెచ్చెలి "వివక్ష"
విధికి ఎంతగా ఎదురీది
ఆకాశంలో సగమంటూ
ఎన్ని రంగాల్లో ఎదుగుతున్నా ,
ఎంతగా రాణిస్తున్నా
ఎదురు దెబ్బలు తింటూనే ఉంది
ప్రకృతి సిద్ధమైన "ఆడతనం"
సాటివాళ్ళూ శత్రువులై అసూయతో చేసే
అప్రకటిత యుధ్ధంతో మ్రాన్పడి పోయింది "స్త్రీత్వం"
జెండా పండగ జరుపుకున్నప్పుడల్లా దేశానికి తప్ప
మనుషులకు,అందునా మానవతులకు
తను గగన కుసుమమేగా
అంటూ వగచింది "స్వాతంత్ర్యం"
ఇరుమనసుల కలయిక లో
చిరకాలం బ్రతుకు పంచుకోవడానికి
వింత ఆచారాలు,కట్టుబాట్లతో
చెమటోడ్చి ఒక్కోరూపాయి పోగుచేసి
దాచికున్న సంపద నంతా
ఊడ్చుకపోయే దోపిడిదారుగా
రూపాంతరం చెందింది"పెళ్ళి"
ఇంటిపేరు మార నీకు
కంటనీరు కారనీకు...
అందం,శీలం,విద్య,బలం
ఇలా నీకున్న ప్రతి సొత్తు ఒక విపత్తు.,
పురుషుడికోసం,పురుషుడి చేత,పురుషుడికి..
అంకితమయ్యే
ఓ మానినీ.,
అమ్మగా,ఆలిగా సోదరిగా ,సోపతిగా
ఎంతటి ఔదార్యం చూపినా
ఇంటాబయటా అనుమానాలు
ఊరూ వాడా అవమానాలు
ఇవేగానీకు బహుమానాలు,
ఇకనైనా తెలుసుకో
ఇలనికపై ఏలుకో
అంటూ మేలుకొలిపింది
"కవనం"!!
No comments:
Post a Comment