"స్వయంభువు"
భావుకత పెల్లుబికితే ,
జలపాతం
కొండనుండి దూకినట్టు,
గడ్డి పరక
తొలిచినుకుకు
పుడమిచీల్చుకపుట్టినట్టు ,
రాలిపడే చినుకులని
ఒడిసి పట్టుకున్న
సంధ్యా కిరణం
నింగి ఫలకం పై
సింగిడిని
చిత్రంగా వేసినట్టు,
ఉత్తుంగ సాగర కెరటం
తీరాన్ని చేరుకొనేే ఆరాటంలో
నురగలు కక్కినట్టు,
నదీ దర్పణంలో
బాల సూరీడు
ముచ్చటగా
అందాన్ని తిలకించే క్రమంలో
బిడియంతో
ముఖబింబం
అరుణ కాంతులు చిమ్మినట్టు.....
ప్రకృతి వల్ల
రమణీయత ఏర్పడినట్లు
హృదయగతమైన అనుభూతి
అక్షరావిష్కృతమైతే
సహజ సిద్ధమైన
భావనాసౌందర్యం
పాఠక మనో సీమలను
కవితగా ..
సాహితీ సంజాతగా
సుసంపన్నం చేయదూ!!
No comments:
Post a Comment