"బతుకు గానుగ"-రాఖీ
ప్రతి పొద్దు ఓ ముద్ద దొరికితే చాలు
పొద్దుపొద్దున్నే చేతినిండా పనిదొరికితే చాలు
చెమటని ఎట్ల పైసలుగ మార్చుకొవాల్నో మాకు
కడుపు నేర్పింది
మాపనేదో మేం చేస్కుంటు ఎట్ల బతకాల్నో మాకు జిందగీ నేర్పింది
పెద్దపెద్ద పదాలు మా సెవులల్లొ పడవు
పార్టీల రంకులు నాయకుల బొంకులు మమ్మల్ని అంటుకోవు
మద్దెమద్దెలొ సెల్లని రూపా(యి)ల నోట్ల బాగోతం
పెబుత్వాలు బాదే పన్నుల రామాయణం ఇవ్వన్నీ మకంతుబట్టని వింతలు
దేశం కట్టుకున్న బట్టకన్నీ కంతలు
అడుగు దీసి అడుగెయ్యలేని గుంతలు
అలిసిన పానానికి ఇంత సుక్కగొంతు దిగితే చాలు
ఆకలి తీర్చే ఆలి పక్క'నుంటే పదివేలు
అట్టట్టిగనే పుట్టుకొచ్చే బొట్టెగాళ్ళకి పట్టెడు బువ్వపెట్టగలిగితె చాలు
పండుగనాడైనా నిండైన బట్ట కట్టగలిగితే చాలు
కుదిర్తే సర్కారు బడి ,లేకుంటే షేక్ మియా హోటల్ల చాయకప్పులు కడిగే పని
మా అయ్య ఆళ్ళయ్య ఆళ్ళయ్యఅయ్య అందర్దీ
గిదేతీరు
మారమని సెప్పే మాటల్దప్ప మార్గం సూపెడ్ది లేదు
గిట్లగే పాన్సాల్కోసారి ఓట్లు గుద్దుతం ,
మూన్నాళ్ళ కూలీ పైసలకి
రంగెలిసే మూడొందల సీరలకి
గుక్కెడు పుక్కట్ సారా పొట్లాలకి
తుమ్మితె ఊడే ముక్కు పుడకల్కి
బతుకులు దిద్దిటోడే లేనప్పుడు
దొరికిందే బరుక్కొనుడు
రాతలు మార్చెటోడె దొర్కనప్పుడు
ఇచ్చిందాంతోనే తుర్తివడుడు
కాయకట్టంతో బాటు బాధలు కన్నీళ్ళు అల్వాటై రాటుదేల్నం
అటు ఆశవెట్టెటోళ్ళు
ఇటు మోసం జేసెటోళ్ళు
రాజ్జెం అందరిదే
బోజ్జెం మాత్రం కొందరిదే!!
No comments:
Post a Comment