Saturday, December 23, 2017

"కేశ పాశం"


చిన్నప్పుడు ...
ఒక చేత్తో 
అమ్మ  
నీ తల 
నిమురుతూ 
నీ మారాం  ని గారాం చేస్తూ..
మరో చేత్తో 
నన్ను ఒడుపుగా పట్టుకొని 
నిన్ను కుదురుగా ఉంచటానికి 
తను ఆపసోపాలు పడుతూ
నిను బుజ్జగిస్తూ 
బుదురగిస్తూ ...
ప్రేమగా 
నీ తల దువ్వుతున్నప్పుడు..
అంతే ఆప్యాయంగా 
నీతో నే స్నేహం కలిపా..!

నీకు ఊహ తెలిసాక 
అమ్మని విదిలించుకొని 
అన్నీ నీకు నువ్వే 
సొంతంగా చేసుకోవాలనుకొని
తెలిసీ తెలియని తనంతో..
నన్ను అడ్డదిడ్డంగా 
ఎడా పెడా వాడి 
ఏటో విసిరేస్తే..
కుర్రతనమని ముచ్చట పడ్డా...!

నూనూగు మీసాల 
నూత్న యవ్వనం లో
విసిరేసిన నన్నే 
వెదుక్కొని మరీ
విపరీతంగా అభిమానించి
పాంటు వెనక పాకెట్లో
పదిలంగా పొదువుకొని
రోజుకి పదిసార్లు
పదేపదే వాడుకుంటుంటే
వంకీల నీ జుట్టుకి 
మరిన్ని వన్నెలు తెచ్చా...!

అమ్మ చేతి నుండి
నీ ఇల్లాలి చేతిలోకి మారాక 
మీ ప్రేమానురాగాలకు 
వారధి నైనా..
మీ సరస సల్లాపాలకు 
సాక్షీభూతమైనా..!

అక్కడక్కడ 
వెంట్రుకలు నెరవడం తో..
నువ్వు వాడే 
రంగుల రసాయనాలతో
ఉక్కిరి బిక్కిరైనా కూడా
నీ మీది మమకారంతో..భరించా..!

ఏనాడైనా నీ కేశాల 
మలినాలు తొలగించా..
నిన్ను మరింత అందంగా
తీర్చిదిద్దా..!

ఏం చేస్తాం ..
అంతలోనే రానే వచ్చింది ..
ఓ దుర్దినం..
క్రమేపీ జుట్టు రాలుతుంటే..
ఆకోపం 
నాపై చూపిస్తూ..నీ ప్రతాపం..
మళ్ళీ విసిరేయగా 
ఏ మూలకో  నా స్థానం ..
ఒకటో రెండో రాలిపోయే స్థితి నుండి
ఒకటో రెండో మిగిలే దిశగా 
సాగింది
నీ వెంట్రుకల ప్రస్థానం..!!

పాపం ఇప్పుడిక 
నీకు నా అవసరం 
బొత్తిగా లేకుండా  పోయింది..
విధి వింత నాటకం లో
మన బంధం తెగిపోయింది..
ఈ ‘దువ్వెన’  నీ దృష్టి లో
నవ్వుల పాలైంది..
నిరర్థక ఆస్తిగా మారింది..
మౌనంగా 
నా విచారం ప్రకటించడం మినహా..
నేనేం చేయగలను నేస్తమా..!
నీది ఇప్పుడు 
పూర్తిగా 
బట్టతల కదా..!!

No comments:

Post a Comment