Monday, August 22, 2011

వర్ణ మాల-నీ మెడలో ఈ వేళ

వర్ణ మాల-నీ మెడలో ఈ వేళ

అక్షర మాల-నీ మెడలో ఈ వేళ
మిత్రమా నా మనోనేత్రమా
స్నేహమా నా తీరని దాహమా
నేస్తమా ఓ నా సమస్తమా
ప్రియతమా నా స్వగతమా
చెలియా ఓ నా గుండెలయా
సఖియా నా హృదయ వీణియా
నా అర్థము నీవే
నా ఆశవు నీవే
నా ఇఛ్ఛవు నీవే
నా ఈడేరని కోర్కెవు నీవే
నా ఉన్నతి నీవే
నా ఊపిరి నీవే
నా ఊహవు నీవే
నా ఊసులు నీవే
నాలో ఋష్యత్వము నీవే
నా ౠకవు నీవే
నా కలవు నీవే
నా కలము నీవే
నా ఖడ్గము నీవే
నా ఖేదము నీవే
నా గారాబము నీవే
నాలో ఘర్షణ నీవే
నా చిత్తము నీవే
నా ఛత్రము నీవే
నే చేసే జపము నీదే
నా జ్ఞానము నీవే
నా పాలిటి ఝషము నీవే
నాకెదురైన టక్కరి నీవే
నాకు గుణ పాఠము నీవే
నా డాబువు నీవే
నా ఢంబము నీవే
నా ప్రేరణ నీవే
నా తపన నీవే
నా మనోరథము నీవే
నాకు దగ్గర నీవే
నా ధార్మికత నీవే
నా నందము నీవే
నా పరవశమీవే
నా తపః ఫలము నీవే
నా బాధ నీవే
నా భయము నీవే
నా మంత్రము నీవే
నా యజ్ఞము నీవే
నా రాగము నీవే
నా లౌక్యము నీవే
నా వేదము నీవే
నా శస్త్రము నీవే
నా షడ్రుచులు నీవే
నా సహనము నీవే
నా మనోక్షేత్ర హలము నీవే
నాలోని లలిత కళలు నీవే
నా క్షమయా ధరిత్రి నీవే
నా కొఱక రాని కొయ్యవు నీవే
మిత్రమా నా మనోనేత్రమా
స్నేహమా నా తీరని దాహమా
నేస్తమా ఓ నా సమస్తమా
ప్రియతమా నా స్వగతమా
చెలియా ఓ నా గుండెలయా
సఖియా నా హృదయ వీణియా
ఓ ఉత్పల మాలా
ఓ చంపక మాలా
ఓ వైజయంతి మాలా
ఓ మణి మాలా
ఓ మేఘ మాలా
ఓ వన మాలా
ఓ మల్లె మాలా
ఓ గీత మాలా
ఓ జప మాలా
ఓ రత్న మాలా
ఓ పుష్ప మాలా
ఓ మధు మాలా
ఓ నక్షత్ర మాలా
ఈ వర్ణ మాల-నీ మెడలో ఈ వేళ !! !! !!

Thursday, August 18, 2011

క్షణం-లక్షణం

క్షణం-లక్షణం

నిన్న ఒక కల
రేపు అనేది ఒక ఆశల వల
నిజమెరుగకుంటే బ్రతుకే వలవల
మనసే విలవిల!

గతం ఒక అనుభూతి
భవిష్యత్తు ఊహా కృతి
తెలిసుకోకుంటే ఈ సంగతి
జీవితమే దుర్గతి
మనుగడయే అధోగతి!!

ఈ క్షణం
పట్ల వీక్షణం
ఉండడమే సులక్షణం
అపుడిక ఆనందమయమే క్షణక్షణం!!!

Saturday, August 13, 2011

రాఖీ పూర్ణిమ రక్షాబంధన దినోత్సవ శుభా కాంక్షలతో..రాఖీ.

నా చెల్లి - బంగారు తల్లి

నా చెల్లి
అందాల జాబిల్లి
చల్లని పాలవెల్లి
మమతా మధురిమల మల్లి
నా లాభం-క్షేమం కోరే కల్పవల్లి
నా సోదరికి రక్షనీవె సంతోషి తల్లి(మాత)
వేడెద సదా నీ పాదాలకు ప్రణమిల్లి !!

Friday, August 12, 2011

చుట్టూ చీకటిని తిట్టకు-నిన్ను నీవు తిట్టుకోకు
ప్రయత్నించి చిరు దీపం వెలిగించుకో
కనీసం కన్నులన్నా మూసుకో
అప్పుడు బయటా లోపల చీకటి
లోపలి చీకటిని తరిమేయడం
నీకు రెండు విధాలా సుసాధ్యం
ఆత్మజ్యోతి వెలిగించగలిగినా
స్వప్నలోకాల్లో విహరించ గలిగినా
ఎంతకు రాని గమ్యం గురించి చింత వీడు
పయనమే రమ్యమనే భావం తో చూడు
వేచి ఉండాల్సి వచ్చినపుడు విసుగు చెందకు
నీవు నీతో గడప గలిగినందుకు సంతసించు
కొత్తపరిసరాలతో ఇమడలేక బాధ పడకు
ఇసుకలో తైలం తీసి అభినందనలందు
అడవిలో కుందేలుని చూసి ఆనందం పొందు
అనుభవించ గలిగితే అంతా ఆనందం
భయపడితే బ్రతుకే విషాదం!!

Tuesday, August 9, 2011

ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు

ప్రేమసమరం

తూర్పున నేను
పశ్చిమాన నీవు
భూగోళానికి ఇరువురం చెరోవైపు
అందుకే అందదు మనకు మనవీపు
అయినా తీపులకై చేతులు చాపు
ధృవాలు వేరు ఉత్తర దక్షిణాలు
అందుకేనేమో ఈ ఆకర్శణాలు
దృక్పథాలు వేరు ఎడ్డెమంటె తెడ్డెమనడాలు
ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు
వాయింపుకు భిన్నంగా రెండురకాలుగా మ్రోగే డోలు
ఎప్పుడైనా పయనంలో మనచేతులు చెట్టపట్టాలు
కలిసిసాగుతున్నా కలుసుకోలేని రైలు పట్టాలు
భేషజాల భావజాలం –ఒకరులేక ఒకరం మనజాలం!
బ్రతుకే ఇంద్రజాలం-అంతర్జాలంలా మయాజాలం!!

Saturday, August 6, 2011

మిత్రులందరికీ మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు!!

నా మతం –స్నేహితం

స్నేహితమంటే-
ఎదుటివారి నుండి ఏదీ కోరుకోకుండా ఉండగలగాలి
ఎదుటివారికి ఏదైనా ఇవ్వగలగాలి
స్నేహితమంటే-
మనం ఏదైనా అడిగి తీసుకోగలగాలి
ఎదుటివారు అడగకముందే తీర్చగలగాలి
స్నేహితమంటే-
స్వేఛ్ఛ –స్వఛ్ఛత
ఇఛ్ఛ-స్పష్టత
స్నేహితమంటే-
సముద్రంకాదు చుట్టూ నీరున్నా దాహం తీర్చకపోవడానికి
ఎడారికాదు నిరాశా నిట్టూర్పులే మిగల్చడానికి
స్నేహితమంటే-
జీవనది ,తను ఎంతైనా ఇవ్వగలిగేది ఏదీ ఆశించకుండా
మనకెంత లభించనా కొంతే పొందగలిగేది
స్నేహితమంటే-
మిత్రుడు(సూరీడు), వెలితురూ వెచ్చదనం ఇస్తాడు
కొంతవరకే తగినంత వరకే సహించగలం
స్నేహితమంటే-
గాలి ,చల్లగాలి తప్పని సరి ,తుఫాను ముప్పేమరి
స్నేహితమంటే-
భూమాత ,మనని ఓపికగా భరించగలుగుతుంది
భూకంపం రానంతవరకు
స్నేహితమంటే-
ఆకాశం ,అది ఉన్నట్టుగా భ్రమింపజేసే శూన్యం
అదే లేనట్టుగా మాత్రం భావించలేం
స్నేహితమంటే-
అచంచల విశ్వాసం-మూఢనమ్మకం కాదు
దైవం-దెయ్యంకాదు
స్నేహితమంటే-
అవధులు లేనిది,పరిధులున్నది
వ్యవధులు లేనిది ,పరిమితులున్నది
స్నేహితమంటే-
బంధాలకు చెందనిది అతీతమైనది
భావాలకు అందనిది అందమైనది
స్నేహితమంటే-
ఎంతచెప్పినా తక్కువే మరి
ఎంత చెప్పకున్నా తక్కువా? అది గడసరి
సృష్టిలో తీయ’నిధి’తీయనిదీ స్నేహమేనోయి!
సృష్టిలో ’మాయ’నిది మాయనిదీ స్నేహమేనోయి!!

Thursday, August 4, 2011

విను విను విన్-విన్ లా

విను విను విన్-విన్ లా

కడలివి నీవు
సాహసి నేను
ఎన్నిసార్లు ముంచినా
ఎదలోతుల శోధన నాపలేను
ఎన్నిసార్లు విసిరేసినా
అవతలి గట్టెక్కే వరకు ఈ(త) సాధన మానుకోను
కరుణిస్తావో-కాలానికే వదిలేస్తావో
నన్ను గెలిపించి గెలుస్తావో(విను విను విన్-విన్ లా)!
అగాధ జలధి అట్టడుగున సమాధి చేస్తావో!!

శుభోదయం !!

శుభోదయం !!

ప్రతి ఉదయం
శుభోదయం !!
కోరు కొంటోంది నా హృదయం!!
ప్రతి సమయం
కావాలి రసమయం
జీవితం సదా ఆనందమయం
చేసుకోలేకుంటెనే విస్మయం
అనునయం
ఆశించే నయనం
అవుతుందెందుకు అశ్రుమయం
గాజు బొమ్మలైనా
కొయ్యబొమ్మలైనా
మట్టి బొమ్మలైనా
తోలు బొమ్మలైనా
ఆడేవాడు ఆడించేవాడు
వాటిని వాడు వాడు
ఎల్లప్పుడు కాపాడుతాడు
అందుకే కడతాడు వాటి మధ్య ఏదో తాడు
ఊగే ఊయల తాడు కారాదు ఉరితాడు
పాడె గా మారకూడదు పాడే వాడు
అందుకే నేస్తం !
అందుకో సమస్తం!!
మానవ జన్మే ప్రశస్తం!!
చేజారనీకు స్నేహ హస్తం!!
చేసేయి మధుర స్మృతులను మదిలో నిక్షిప్తం!!!

Wednesday, August 3, 2011

“తుమ్మెద ఎద వేదం”

“తుమ్మెద ఎద వేదం”

నీ గుండె కరిగేటందుకు
నే చేస్తా నాద యజ్ఞం!

నీ మనసు గెలిచేటందుకు
రాసేస్తా రసమయ కావ్యం

నిను మైమరపించేటందుకు
నేనందిస్తా అనురాగ పరపరాగం

నీ అన్వేషణలోనే
బలిచేస్తా నా సర్వస్వం

గ్రహించవెలా ప్రణయ తత్వం
అనుగ్రహించవెలా ఈ ప్రేమ పిపాసిని సైతం

పారిజాత పరిమళమేకదా నిత్య దైవత్వం!
దైవమే నీవైనప్పుడు మరతువెలా దయాపరత్వం

భ్రమర-సుమాల బంధం…
బ్రహ్మ సృష్టికే-
సత్యం శివం సుందరం!!!