Saturday, August 6, 2011

మిత్రులందరికీ మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు!!

నా మతం –స్నేహితం

స్నేహితమంటే-
ఎదుటివారి నుండి ఏదీ కోరుకోకుండా ఉండగలగాలి
ఎదుటివారికి ఏదైనా ఇవ్వగలగాలి
స్నేహితమంటే-
మనం ఏదైనా అడిగి తీసుకోగలగాలి
ఎదుటివారు అడగకముందే తీర్చగలగాలి
స్నేహితమంటే-
స్వేఛ్ఛ –స్వఛ్ఛత
ఇఛ్ఛ-స్పష్టత
స్నేహితమంటే-
సముద్రంకాదు చుట్టూ నీరున్నా దాహం తీర్చకపోవడానికి
ఎడారికాదు నిరాశా నిట్టూర్పులే మిగల్చడానికి
స్నేహితమంటే-
జీవనది ,తను ఎంతైనా ఇవ్వగలిగేది ఏదీ ఆశించకుండా
మనకెంత లభించనా కొంతే పొందగలిగేది
స్నేహితమంటే-
మిత్రుడు(సూరీడు), వెలితురూ వెచ్చదనం ఇస్తాడు
కొంతవరకే తగినంత వరకే సహించగలం
స్నేహితమంటే-
గాలి ,చల్లగాలి తప్పని సరి ,తుఫాను ముప్పేమరి
స్నేహితమంటే-
భూమాత ,మనని ఓపికగా భరించగలుగుతుంది
భూకంపం రానంతవరకు
స్నేహితమంటే-
ఆకాశం ,అది ఉన్నట్టుగా భ్రమింపజేసే శూన్యం
అదే లేనట్టుగా మాత్రం భావించలేం
స్నేహితమంటే-
అచంచల విశ్వాసం-మూఢనమ్మకం కాదు
దైవం-దెయ్యంకాదు
స్నేహితమంటే-
అవధులు లేనిది,పరిధులున్నది
వ్యవధులు లేనిది ,పరిమితులున్నది
స్నేహితమంటే-
బంధాలకు చెందనిది అతీతమైనది
భావాలకు అందనిది అందమైనది
స్నేహితమంటే-
ఎంతచెప్పినా తక్కువే మరి
ఎంత చెప్పకున్నా తక్కువా? అది గడసరి
సృష్టిలో తీయ’నిధి’తీయనిదీ స్నేహమేనోయి!
సృష్టిలో ’మాయ’నిది మాయనిదీ స్నేహమేనోయి!!

No comments:

Post a Comment