Thursday, December 31, 2009

రమ్యస్మృతి

నిదుర నేను పోదామంటే
ఎప్పుడు నువ్వొస్తావో
మెలకువగా ఉందామంటే
కలనైన కనిపిస్తావో

అశ్రు తర్పణం చేద్దామంటే
కనుల నుండి నువు జారేవో
హృదయ మర్పితం చేద్దామంటే
తెలియకుండ అది నిను చేరేనో
ఏమివ్వగలను నేను
ఏమవ్వగలను నేను
కవితయై నిన్నలరిస్తా
రమ్యస్మృతినై నీలొ నిలుస్తా

అందరికీ నవ వత్సర శుభ కామనలు!!

తెలంగాణా రాష్ట్రం తోనే నవశకం..నవ వర్షం...తెలంగాణా రాష్ట్రం లోనే నవనవోన్మేషం జన హర్షం!!
అందరికీ నవ వత్సర శుభ కామనలు!!

రాకాసి బొగ్గులు

స్నేహ కడలి తీరాన
గవ్వలకై నేను వెళితే
దొరికాయి నాకు స్వాతి ముత్యాలు!
మైత్రీ ద్వీపాన
గచ్చకాయలేరుతుంటే
లభించాయి నాకు అరుదైన పగడాలు!!
గుండె గండకీ ఒడ్డున
గులక రాళ్లు కోరుకుంటే
పొందాను నేను స్వఛ్చమైన స్ఫటికాలు!!!
ప్రేమరహిత హృదయంతో
విసిగి గొయ్యితియ్యబోతే
వెలికి వచ్చాయి అపరంజి మూర్తులు!!!!
చెలిమి గనిని ఎంతగానో
వజ్రాలకొరకై త్రవ్వితె
బయట పడుతున్నాయి రాకాసి బొగ్గులు!?

భావేంద్రజాలం

సముద్రాన్ని పుక్కిట్లో బంధించగలమా..
ఆకాశాన్ని గుప్పిట్లో బిగించగలమా…
ఉవ్వెత్తునా ఎగసిపడే భావతరంగాలను నిరోధించగలమా..
అవధిలేని హృది వినువీధిని–
అక్షర నక్షత్రాల్లోనే ప్రకటించగలమా…
అనుభూతుల స్వేఛ్చావిహంగాలను-
పద పంజరాల్లో ప్రదర్శించగలమా…
కంటికి కనిపించని కాంతిలాగా
కర్ణభేరి గ్రహించని శబ్దాల్లాగా
భాషకందని భావాలూ…..!
నిత్యనూతన అనుభవాలూ…!!

Wednesday, December 30, 2009

నీ తోడొస్తా

నీ కంటి కాటుక కోసం
నే మాడి మసినై పోతా
నీ వొంటి చీరకు సైతం
ఓ నూలు పోగై పోతా
నీఇంటి వాకిలి లోనా
ముత్యాల ముగ్గై పోతా
నీ చంటి పాపగ మారి
మాతృత్వం మధురిమ లిస్తా
చిన్నారి చేతులతోటి
కన్నీరు నే తుడి చేస్తా
కష్టాల కడలిని దాటగ
కడదాకా నీ తోడొస్తా

ఆర్ద్రత

హృదయమెంత సున్నితం నేస్తం!
అందుకే భగవంతుడు దాన్ని
ఉరఃపంజరం మధ్య
అతి పదిలంగా పొందుపరిచాడు
అయినా దానికి గాయాలు అవుతూనే ఉంటాయ్
నవనీతాలు దొరుకుతూనే ఉంటాయ్...
ఎదలో తడి ఏర్పడి
ఆ ఊట నీటిబుగ్గలా పైకి తన్నుకొచ్చి
కాసేపు కనుపాపలతో చెలిమి చేసి
కనులని చెలిమెలు చేసి
అయినా కూడా నిలువలేక
మనసాగలేక
అశ్రుధారలై..దుఃఖ భాష్పాలై..
కన్నీటి వరదలై..ఉద్వేగ జలపాతాలై..
దుముకుతాయి..గంగావతరణ దృశ్యాలై..
ఇంతకన్నా ఇంకేంకావాలి..మానవతకై..
హృదయ స్పందనకై....

కలకంఠి

నే తిన్నదెపుడు
పడుకున్నదెపుడు
ఆలోచనెపుడు
కర్తవ్యమెపుడు
కలకంఠి నావెంటే
కడదాక నీవుంటే
కాలమై ఇలలోనె కలిసిపోతా
ఆత్మనై నీలోన ఉండిపోతా

Sunday, December 27, 2009

ఓ సునామీ!(మంచి పేరుగల దానా??!!)

ఓ నా మైనా(లాండ్ మైనా)
ఏదేమైనా
నువు పాటైతే(పాటు/పోటు అలలు)
పొరపాటైతే
నే పోటౌతా(పైలాగే)
(భూ)తల పోటౌతా
చెలియలికట్టను దాటే
భీకర పోటౌతా
ఓ బినామీ
నీ కోసం వినా శ క రమైనా
అయిపోతా నేనూ ఓ సునామీ!(మంచి పేరుగల దానా??!!)

సాగర సంగమం

శివ ఝటాజూటము వీడి
హిమశిఖర పీఠమును పారాడి
ఉత్తుంగ తరంగయై
ఉన్మత్త అభంగయై
దూకే నీ భావ గంగాలింగమునకై
హరి శయన తల్పమై
సిరి జనకులా అనల్పమై
హిమకర పూర ప్రకల్పమై
అమోఘ సంగమమునకై
నేనైపోతా సహస్ర బాహు కెరట
విశాల సంద్రమై

Friday, December 25, 2009

అన్వేషణ

ఎందుకు నేస్తం !
నీవింతకాలం ఎక్కడ గుప్తం
ఎంతటి సుశుప్తం
ఇప్పటి కైనా దొరికావు నా ప్రాప్తం
అయ్యో!బ్రతుకెంత సంక్షిప్తం

జన్మాంతరాల అన్వేషణ నాది
యుగయుగాల ఆరాధన నాది
ఎదలోని నా భావం నీవే
హృదిలో ప్రభావం నీవే
నీవు నాలోని స్త్రీతత్వం
నేను నీలోని పురుషత్వం
మన ఇరువురిది అర్ధనారీశ్వర తత్వం

ఇన్నాళ్ళు కోల్పోయినందుకు చింతించనా
చివరి మజిలీ లోనైనా కలిసినందుకు ఆనందించనా
అరెరే ! కాలం వేళ్ళ సందులు మూసినా జారి పోతోంది
అయ్యయో!! దూరం ఊళ్ళనన్నీ దాటినా పెరిగి పోతోంది

నేస్తం! నీవు దరిజేరినా విషాదమే దూరమవుతావని
కాస్త కనుమరుగైనా వేదనా మయమే మరలిరావేమోనని
ప్రేమ కౌగిలి ఇంత గాఢంగా ఉంటుందా ఊపిరే కష్టమౌతోంది
విరహ రక్కసి ఇంతగా తింటుందా హృదయమే శిథిలమౌతోంది
వచ్చేవరకు రాలేదని బాధ
ఉన్నప్పుడు పోతావని బాధ
పోయాక రావేమని బాధ
బాధ బాధ బాధ ఒకటే వ్యధ
అయ్యో! నా బ్రతుకెంత వింత గాధ

నేనే

www.Andhrafolks.net
నేనే
అన్నిటికీ కారణం అనుకుంటే
ఈ క్షణం
నే అనుభవిస్తే
ఏదీ ఆశించకుంటే
ప్రతిదీ స్వీకరిస్తే
అంతా మంచికేనని భావిస్తే
జీవితంలో ఏదైనా భాగమే నని
ఇది ఇంతేనని, సహజమేనని తలపోస్తే
బ్రతికినంతకాలం అందరితో కలిసి మెలిసి
హాయిగా జీవిస్తే
ఆనందం!
బ్రహ్మానందం!!
పరమానందం!!!

Thursday, December 24, 2009

...........నా స్నేహమా..!

క్రిస్మస్ పండగ శుభాకాంక్షలతో........................
...........నా స్నేహమా..!
వెదకబోయిన తీగవే నీవని
–అనుకోకుండా ఉండలేను
మారువేషం వేసుకొన్న స్నేహమే నీవని
- అనుకోకుండా ఉండలేను
చేజారిన హృదయమే నీవని
–అనుకోకుండా ఉండలేను
మరపురాని అనుభూతే నీవని
-అనుకోకుండాఉండలేను
నువులేకుండా నేనే లేనని
-అనుకోకుండాఉండలేను
నేస్తం! ప్రతిక్షణం పరస్పరం తలుచుకుంటామని
-అనుకోకుండాఉండలేను
కరిగిపోయే కాలం ముందు మనం సజీవ శిలాప్రతిమలమని
-అనుకోకుండాఉండలేను!!

వెన్నెల్లో ఆడపిల్ల

నువ్వెవరో నే కనిపెట్టేసా
నా కవితలొ నిను చుట్టేసా
వెన్నెల్లో ఆడపిల్లవా
కోనేట్లో కలువ కన్నెవా
గోదాట్లో ఇసుక తిన్నెవా
నా ఎదలో సవ్వడి నీవా
నా స్మృతిలో అలజడి నీవా
చేజారిన మణిపూసా@
ఊహల్లో నిను చూసా
స్వప్నంలో నిను కలిసా
ఊసులన్ని నీతో పలికా
హృదయం లో బంధించేసా

Wednesday, December 23, 2009

ఉషోదయాన వెల్లివిరిసాయి
రెండు కవితా పారిజాతాలు
గత రేయి నీ చేత
అవి ప్రేరేపితాలు
ఏ చే జారిన మణిపూసవో
ఏ మబ్బేసిన శశిరేఖవో
నాకు మాత్రం సుందర ప్రకృతివి
నా కవితల మానికమౌ ఆకృతివి

Tuesday, December 22, 2009

ప్రేమనే ప్రేమిస్తారు అందరూ
భావననే ఆస్వాదిస్తారు ఎల్లరూ
ప్రేమ ఒక సంగీతం
స్త్రీ/పురుషుడు ఒక వాయిద్యం
వేణువో వీణియో
పియానో వయొలినో
శ్రావ్యత ఆప్యాయత
శ్రుతులు అపశ్రుతులు
లయలు విలయాలు
అన్నీ ఉంటయ్
జీవిత సంగీతంలో
సంగీత జీవితంలో
పరికరమెంత గొప్పదైనా
పలికించే దక్షత ముఖ్యం
సరిగా మ్రోయిస్తేనె కదా
శ్రోతలకది శ్రవణపేయం

Monday, December 21, 2009

అభిమానము అస్వాదనమే

తాజ్ మహల్ రాసిస్తే 
బ్రతుకంతా కాపురముంటామా 
రాకెట్ మన పరంచేస్తే 
హాయిగా ప్రేయసితో షికార్లు కొడతామా
అందాల ఐశ్వర్యని వండుకొని తింటామా 
యేసుదాసు గాత్రాన్ని నంజుకొంటామా 

అభిమానం ఆస్వాదనమే 
ఆస్వాదన అనుభూతి మయమే 
ఇలయరాజా సంగీత రీతులు అభిమానం 
యండమూరి రాత రీతులు అభిమానం 
సచిన్ క్రికెటాట తీరు అభిమానం 
సానియా బంతుల షాట్ తీరు అభిమానం 
సినిమాల్లో నటిస్తున్నప్పుడే కమల్ హసన్ గొప్పదనం పొరుగింటివాడైపోతే ఏమున్నది వినూత్నం 

అభిమానం అంటే అంతే 
మర్మమైన ప్రతిదీ వింతే 
కలవనంత వరకు కలవరింతే 
కలిసినంతనె చెప్పలేని గుబులంతే-చింతే 

ఆకసాన ఉంటేనే చందమామ సొగసుదనం 
అల్లంతలొ ఉన్నపుడే కొండలకా నునుపుదనం 
పొరలు కప్పి ఉన్నప్పుడె ఉల్లి 
విప్పుకొంటుపోతే అంతా ఖాళీ 

కొన్ని అందకుంటేనే హాయి 
కొన్ని దాచుకుంటేనే పదిలమోయి…!
సాహిత్యం నాతత్వం! 
సంగీతం ప్రియనేస్తం!!

 కవిత నా భవిత పాట 
నా బాట గీతం నా అభిమతం 
కవనం నా జీవనం 
గేయం నాధ్యేయం 
 గానం నా ప్రాణం
 
భావం నాజీవం 
సుతి నాస్తుతి 
లయ నా ఎద లయ 
 అక్షరం నాశరం 
మనస్సు నా ధనుస్సు 
పదాలు నా పథాలు 
చరణాలు నా మనోరథాలు 
కావ్యాలు నా లక్ష్యాలు 

 జనసంగతి నా కృతి 
గమకం నా గమనం 
నాదం నా వేదం 
స్వరం నే కోరే వరం 
 రాగం నా ఖడ్గం 
తాళం నా పటాలం 

పల్లవి నా పద్మవ్యూహం 
 కవిత నా భవిత
 పాట నా బాట 
 సాహిత్యం సంగీతం నా సొంతం!-
నా జీవిత పర్యంతం!!

Sunday, December 20, 2009

నా తొలి కవిత----------------------02-October, 1978.
మహా సముద్రంలో ఓ అల-జీవన పథంలో ఓ కల
కలమనే ఖడ్గంతో
కాలుమోపాను కవితా రంగంలోకి
కనిపించారు ఎందరో మహాను భావులు
చేసాను అందరికీ వందనాలు
కాదు నా పోరాటం రాజభోగాల కోసం
కావాలి న్యాయం,ధర్మం
పోవాలి అవినీతి ,అక్రమం
కాన ఇస్తాను ప్రాణ ధనాదులు
చేస్తాను చేతైందీ సమాజానికి
కరకు కత్తులతొ కుత్తుకలు కోస్తాను
ఈ సమాజంలో చీడపురుగులవి
కడకు తేల్చుకుంటాను విజయమో
మరి వీర స్వర్గమో నని!!