Friday, April 27, 2018


"మైత్రి వనం"

కొందరు నేస్తాలు హరివిల్లులు..
అన్నీ కుదిరినప్పుడే అరుదెంచి అలరిస్తారు,

కొందరు నేస్తాలు ఒయాసిస్సులు..
ప్రాణంపోతున్న సమయంలో ఆర్తి తీరుస్తారు..

కొందరు నేస్తాలు చిరుజల్లులు..
అలా అలవోకగా వచ్చి ఎంతోకొంత ఎద తడిసేలా ఒలక బోస్తారు

కొందరు నేస్తాలు పున్నమి వెన్నెలలు..
క్రమంతప్పక కలుస్తూ కాసింత హాయిని వెదజల్లిపోతారు

కొందరు నేస్తాలు నదులు..
వరదల్లా ముంచేస్తారు కొండొకచో గుక్కెడు నీళ్ళైనా ఇవ్వలేక ఎండి పోతారు

కొందరు నేస్తాలు మలయ సమీరాలు..
అలా స్పృశించి తేరుకునే లోగా ఇలా మాయమౌతారు..

కొందరు నేస్తాలు ఊసరవెల్లులు
ఏక్షణం ఎలాప్రవర్తిస్తారో
వ్యక్తిత్వాన్ని వక్రీకరిస్తారో

కొందరు నేస్తాలు గుంటనక్కలు
స్నేహం ముసుగులేస్తారు
అవకాశం కోసం కాచుకొని నిండా ముంచేస్తారు

ఇందరు నేస్తాల్లో ఏఒక్కరో
ప్రాణసములు..
ఊపిరిలో ఊపిరిగా
హృదయ లయగా
పగలు నీడగా
రేయి కలగా..!!

Tuesday, April 3, 2018

"యాది మనాది"

బాల్యం అమూల్యం
బాల్యం చిరస్మరణీయం
నీదినాది

బాల్యం వైకల్యం
బాల్యం మరణతుల్యం
వీధిబాలలది

వణికించే చలిలో
వర్షించే వేకువలో
పాలపాకెట్లు వేయడం కోసం
డొక్కు సైకిల్ పై
పరుగులు పెడుతుంది ఒక బాల్యం
దినపత్రికలు రువ్వుతుంది
మరో బాల్యం

మబ్బు తెరతీయకముందే
మంచుపొర కరుగక ముందే
నాలుగు కూడళ్ళ మధ్య
అల్లంమొరబ్బా అమ్ముతుంటుంది ఇంకోబాల్యం

కుప్పతొట్టి విలాసమై
చెత్తకుండీల్లో
చిత్తుకాగితాలు
ప్లాస్టిక్ బాటిళ్ళూ
క్యారీబ్యాగ్ లు పోగుచేసుకుని
అమ్మిపొట్టపోసుకుంది
ఇదోబాల్యం

రోడ్డు పక్క కొలిమిలో మోయలేని సుత్తితో
గునపాలకు,గొడ్డళ్ళకు
సాటేస్తూ తండ్రికి సాయంగా
బాధ్యత భరిస్తూ
బంగారు బాల్యం

హోంవర్క్ చేసుకునే సమయంలో
నాలుగిళ్ళలో
కళ్ళాపి చల్లి బోళ్ళు తోమే
పనిలో మరో పగడార బాల్యం

పరికించిచూడు నేస్తం
ఆటపాటల్లో తేలియాడుతూ
సమాంతరంగా చదువుకుంటూ
గడిపేవేళ
కార్పొరేట్ కార్ఖానాల్లో ముడి సరుకై పుట్టకముందే లక్షలు పెట్టుబడి పెట్టి క్రష్ లలో క్రష్ చేయబడే బాల్యం కనబడుతుంది.

బాల్యం నేటి సమాజ వైకల్యం..!
బాల్యం వత్తిడిలో చిక్కిశల్యం..!!

"ఋతుసంహిత"

శిశిరానికి వణికిన తరులకు
దనివారగ కప్పిన  ఆకుల దుప్పటి ఆమని..!!

గ్రీష్మంలో కాలిన పుడమికి
లేపనమై కురిసిన నవనీతం శ్రావణి..!!

వలపులు  రేపిన శరశ్చంద్రిక
తమకపు తపనల తీర్చిన మదన మంత్రం హేమంతం..!!