Friday, April 27, 2018


"మైత్రి వనం"

కొందరు నేస్తాలు హరివిల్లులు..
అన్నీ కుదిరినప్పుడే అరుదెంచి అలరిస్తారు,

కొందరు నేస్తాలు ఒయాసిస్సులు..
ప్రాణంపోతున్న సమయంలో ఆర్తి తీరుస్తారు..

కొందరు నేస్తాలు చిరుజల్లులు..
అలా అలవోకగా వచ్చి ఎంతోకొంత ఎద తడిసేలా ఒలక బోస్తారు

కొందరు నేస్తాలు పున్నమి వెన్నెలలు..
క్రమంతప్పక కలుస్తూ కాసింత హాయిని వెదజల్లిపోతారు

కొందరు నేస్తాలు నదులు..
వరదల్లా ముంచేస్తారు కొండొకచో గుక్కెడు నీళ్ళైనా ఇవ్వలేక ఎండి పోతారు

కొందరు నేస్తాలు మలయ సమీరాలు..
అలా స్పృశించి తేరుకునే లోగా ఇలా మాయమౌతారు..

కొందరు నేస్తాలు ఊసరవెల్లులు
ఏక్షణం ఎలాప్రవర్తిస్తారో
వ్యక్తిత్వాన్ని వక్రీకరిస్తారో

కొందరు నేస్తాలు గుంటనక్కలు
స్నేహం ముసుగులేస్తారు
అవకాశం కోసం కాచుకొని నిండా ముంచేస్తారు

ఇందరు నేస్తాల్లో ఏఒక్కరో
ప్రాణసములు..
ఊపిరిలో ఊపిరిగా
హృదయ లయగా
పగలు నీడగా
రేయి కలగా..!!

No comments:

Post a Comment