Sunday, December 31, 2017

రాఖీ॥శుభమస్తు

ఆకాశం చాప చుట్టేసి
నేల మాళికలో దాచిపెట్టేసా..
నేలమ్మ ఊరుకోదుగా
మట్టి పరిమళాలని చల్లి
రైతింట్లో దుఃఖపు చెట్టుని
పురుడోసుకుంది

తుప్పుబట్టిన తుపాకులు
తుడుచుకోవడానికి మాత్రమే
ఓపిక చేసుకుంటున్నాయి

అప్పుడప్పుడు ఎన్ కౌంటర్లో
లాల్ సలాం పాటలు పాడుకుంటాయి
మందుపాతరలో సేద్యం చేసిన కృషీవలుడు
పార్లమెంటులో పద్యాలు సైతం
పాడకుండా కునుకు తీస్తున్నాడు

రంగుల పుటలు మార్చుకుంటున్న
ప్రజాస్వామ్యం
ఎప్పుడూ నియంతృత్వ పాఠాలే
వల్లెవేస్తుంటుంది

కవుల కిటికీల్లోంచి రోజూ
చందమామ పలకరిస్తూనే ఉంటాడు
వేరే పనేంలేనట్టు
ప్రేయసి అందాల పందేరంలోనే
ఓలలాడుతూఉంటుంది.

ఫేస్బుక్కో..వాట్సప్పో
పేరేదైనా సోషల్ మీడియాలో
సొల్లువరదలే

బటానీలు నమిలినమిలి నలిగిన
దంతాలనుచూసి బాగుచేయలేక
వైద్యులంతా నీళ్ళు నములుతున్నారు

ఏక పక్షం పక్షపాతం
ప్రశంసల జల్లుల్లో
కవన కన్య పడిశంతో
పరవశించిపోతోంది

సొంత రేకుడబ్బాల చప్పులకు
అభిమానుల ఆనంద తాండవాలు
కనువిందు చేస్తున్నాయి
ప్రొఫైల్ పిక్కుల మాయామోహంలో
పోటాపోటీగా అనుసరణలుఆదరణలు

కొత్త పుంతాల ఆరాటంలో
కైత తైతక్కలాడుతోంది
బుడబుక్కలేషాలుకడుతోంది

పెరిగిన వేదిక ప్రేక్షకులను మ్రింగుతోంది
చిరిగిన పాంటూ చింత మాని
ఫాషన్లను చాటిచెబుతోంది

సుగుణాత్మకాలు,సుకృతాలు
నిఘంటువులనంటుకొనేఉంట్టున్నాయి

కొత్త సంవత్సరం
కొత్తదనానికి శ్రీకారం కావాలి
మానవతావాదానికి ప్రాకారం కావాలి
కులమతవర్గప్రాంత ఇజాలు లేని
నిజానికి ఆకారం కావాలి
విశ్వమానవ సౌభ్రాతృత్వానికి
ఘీంకారం కావాలి!!

హ్యాపీ న్యూఇయర్!టు ఆల్ మై నియర్ డియర్!!

31/12/2017

Friday, December 29, 2017

నిర్దయ


{మానవ మృగాలకీ...
మౌనంగా ఉన్న మానవాళికీ..
ప్రభుతకీ..
చట్టాలకు...
ఆలస్యంగా నైన కళ్ళు తెరిచే పోలీస్ శాఖకి..
నాయకులకూ...
మార్పు చెందాల్సిన..ముష్కరులకు..
ఒక గుణ పాఠం..
నిర్భయ,,జీవితం ..
ఒక బలి పీఠం..}

"౦"

(నిర్భయ గురించి రాయడానికి ద;ఖం తో కల౦ ..మూగవోయింది.....)

Saturday, December 23, 2017

రాఖీ||ఓటు కే నా ఓటు||

సామాన్యుడా నీకు సలాం..!
సగటు జీవీ..నీకు సదా గులాం...!!

నీ కన్న సిద్ధాంతి ఎవరు..?!
నీ కన్న వేదాంతి..ఎవరు..?!

ఎంత కష్టాన్నైనా..గ్రహచారంతో. ..ముడిపెట్టు కుంటావ్...
ఎంతటి క్లిష్టత నైనా..(ఫిలాసఫీ)తత్వం తో..సరిపెట్టుకుంటావ్..
ప్రతిదీ జీవితంలో ఒక భాగం గానే.. తల పోస్తావ్..
ఏదైనా ఆటలో అరటి పండని..సర్దుక పోతావ్...

నీ కన్న గొప్ప తత్త్వవేత్త ఎవరు..!
నీ కున్న పరిపక్వతకు నా నెనరు..!!

కరువులూ కాటకాలూ సరే.....
ఎరువులూ..కరెంటు కోతలూ కొసరే..?!

మాఫీల మాట దేవుడెరుగు..
ఖరీదు కట్టినా..దొరకదనేదే..దిగులు..!
రాయితీలు తాయిలాలు ఎవరి కొరకు..?
రేయింబవళ్ళు బారులు తీరినా..దొరకని సరకు..!!

ప్రభుత్వాలూ..రాజకీయాలూ..కొత్తేం కాదు..
ప్రలోభాల వలతో..ఓట్లు దండుకోవడంలో..వింతే౦ లేదు..

ఏ డిపార్టుమెంటు చూసినా ఏమున్నది గర్వకారణం..?
గవర్నమెంటు సమస్తం..ప్రజా పీడన పైశాచికత్వం..!
ఏ పార్లమెంటు సమావేశం తీరినా ఏమున్నది సవివరణం..
పార్టీల అస్తిత్వం కోసం ..వీధికుక్కల పోరాతత్వం..!!

ఇది నిరాశ బోధించడం కాదు
పిరికి మందు నూరి పోయడమూ కాదు..

రెండు వేల రూకలకో..రెండు సారా పాకు లకో..
ఏ టీవీ..సెల్ ఫోన్ దురాశకో...కులాల పట్ల ద్రుతరాష్ట్ర ప్రేమకో..
నీకు నీవే..అమ్ముడై...జండాలు మోసి దాస్యం చేయకు...
నీకు నీవే ఆత్మవంచనకు లోనై....ఐదేళ్ల బానిసవై..పట్టం కట్టకు...

ఓటు ప్రజాస్వామ్యంలో..మందుగుండు నింపిన ఫిరంగీ..
ఓటు మన భారత దేశంలో..ఎక్కుపెట్టిన ..క్షిపణి...

నచ్చని ప్రభుత్వాలను..కూకటి వ్రేళ్ళతో..పెకలించి వేయి..
చేవ చచ్చిన రాజకీయాలనిక .ప్రక్షాళన చేయి..!!

సామాన్యుడా నీకు సలాం..!
సగటు జీవీ..నీకు సదా గులాం...!!


రచన॥రాఖీ " జీవ(కవ)నం"

పూవు ప్రశంసకు రెక్క విప్పదు
కోకిల మెప్పుకోసం గొంతు విప్పదు
మయూరి సత్కారం కోసం పురి విప్పదు
ప్రకృతి తనను ఆచరించమని విప్పిచెప్పదు.,

స్పందించే మనసునెవరూ బంధించ లేరు.
అందలాలనాశిస్తే చేయెవరందించలేరు

కదిలించే కవితే 
కవికి ఉజ్వల భవిత.,!!

రాఖీ  "అర్థవంతం"

నాకే అర్థం కాను నేను,
ఎన్నోసార్లు ట్రాఫిక్ పోలీసు నౌతుంటాను..
తుంటరి తనం నాకు సరిపడదు మరి
ఇంకొన్ని సార్లు రోడ్లు ఊడ్చే చీపురు నౌతాను..
స్వఛ్ఛ భారత్ కర్మచారులకు ఊతమౌతాను,
ఎలాగూ కంచంలో అన్నం మెతుకును కాలేనుగా,

అప్పడప్పుడు తెగి జారిపడ్డ చెప్పు నౌతాను.. పరుగెత్తే ప్రయాణీకుడికి ఆఫీసులో తిట్లు తప్పించాలిగా..

ఇక ఇప్పుడైతే కాసింత సెంటు నవడం కోసం సర్కస్ ఫీట్లు నేర్చుకుంటున్నా..
మెట్రో రైల్లో కంపు కాసింతైనా దిగమింగాలిగా..
పల్లెలో కాలిలో ముల్లౌతుంటా..
కాసింతైనా పాదచారి కావరం వంచాలిగా..

ఎటొచ్చి ఎప్పుడే పాత్రలో ఒదుగుతానో
ఒక్క నా నిద్దురకే తెలుసు,.
అదిమాత్రమే గా నాకు కలల్ని వొంపేది..

పడక అంటే పడకనే..
పగటిపూట సవారిచేస్తుంటా
రెప్పల అల్చిప్పల్లో
ముత్యాల నేరుకుంటుంటా...

అందుకోసం
గుండె గగనం లో..
స్వాతి చినుకులు వర్షిస్తూనే ఉంటాయి

అర్థమైతే ఆశావాదం
వ్యర్థమైతే ఆశనిపాతం...!!

రాఖీ"అంకితం"

పరిచిన పచ్చిక నేనై
అందిస్తా పాదాలకు మెత్తదనం
కప్పుకున్న దుప్పటినేనై
ఇస్తానీ మేనికి వెచ్చదనం

వీచే చిరుగాలిని నేనై
తెస్తాలే సుమ గంధం
కురిసే విరి తేనియ నేనై
రుచినిస్తా అధరాలకు తీయదనం

కూసే కలకోకిలనై
వినిపిస్తా నవ వేదం
విరిసే హరి విల్లును నేనై
కలిగిస్తా కంటికి ఆహ్లాదం

శబ్ద స్పర్శ రూప రస గంధాలు
పంచేంద్రియానుభూతి చందాలు
పంచభూత పరివేష్ఠితాలు
పంచ ప్రాణ ప్రతిష్ఠితాలు

సర్వం నీకే అర్పితాలు
సకలం నీకే అంకితాలు
రాఖీ॥దృక్పథం

పాత రగ్గులో కవిత్వం.,
పండ్లపుల్లలో కవిత్వం
పాలమ్మే కవిత్వం 
పేపరబ్బీ కవిత్వం

ఇడ్లీబండిలో ఇంపైన కవిత్వం
సెవన్ సీటర్లో సొంపైన కవిత్వం
రంగుల సీతాకోకల కలల కవిత్వం
చొంగల గొంగళి పురుగుల కవిత్వం

జామైన ట్రా'ఫికర్ కవిత్వం
ఝామైన లేటు కథల కవిత్వం

ఆలి చేసే గోల కవిత్వం
బతిమాలే నటన కవిత్వం
హద్దులు చెరిపే ముద్దు కవిత్వం
సద్దు మణిగే యుద్ధ కవిత్వం

సంధి కవిత్వం సంయోగ కవిత్వం
తమక కవిత్వం తన్మయ కవిత్వం
నిదుర ఒడి నిశ్చింత కవిత్వం
తెల్లారి గానుగెద్దు కవిత్వం..,

ఏరంగు కళ్ళజోళ్ళకు ఆరంగు కవిత్వం..
పాజిటివ్ నెగెటివ్ కోణాల కవిత్వం

ప్రశాంత కవిత్వం విప్లవ కవిత్వం
ప్రేమ కవిత్వం విరహ కవిత్వం
ఆనంద కవిత్వం విషాద కవిత్వం
దైవీయ కవిత్వం మానవీయ కవిత్వం

ఉన్నది ఒకటే జీవితం,
హాయినివ్వాలి దృక్పథం..!!

"ఆనంద నందనం"-రాఖీ

ఒళ్ళంతా
గులాబీ సుకుమారం
చెంపల్లో కెపుల మంకెనలు
కళ్ళలో కలువల వలలు
నవ్వులో కురిసే మల్లెలు
నాసిక ఒదిగిన సంపంగి
పెదాల్లో అందాల మందారాలు
పలుకుల్లో పారిజాత ఘుమఘుమలు
కురుల వంకీల్లో నీలాంబరాలు
వదనం కమల సదనం
చూపుల్లో చామంతులు
బుగ్గసొట్టల్లో బంతులు
మెడవంపుల్లో నిద్రగన్నేరులు
నడుము మడతలో నందివర్ధనాలు
నాభిలో నాజూకు సన్నజాజి
పూవుల బుట్టవే నీవు
సుమసమ దిట్టవే నీవు

ఏపూలని నీకై నే తేను..?!
తనువంతా
నీవలంకరించుకోను!!
"గంగోత్రి"-రాఖీ


నా కవిత్వం బాగుంటుంది
కానీ చదువరులకు ఏదో వెలితి తెలుస్తూ ఉంటుంది
అది నాకూ తెలుస్తూ ఉంటుంది
ఏదో అసంపూర్తి గోచరిస్తూనే ఉంటుంది

అందాలు పూస్తాయి నా కైతలు
పరిమళించవెందుకో
వెన్నెల్లు కాస్తాయి నా రచనలు
ఆహ్లాదం పంచవెందుకో

ఆగర్భ శ్రీమంతుణ్ణి కాకున్నా
ఆకలి రుచి ఒంట బట్టలేదెప్పుడూ
అమ్మానాన్నల గారాబం నోచుకున్నోణ్ణి
కాలుకు మట్టే అంటుకోలేదెప్పుడూ

నాచుట్టూ కన్నీళ్ళుకష్టాల బురదే...గొప్పేంకాదుగాని తామరాకునయ్యాను పంకజాన్నై విరిసాను
నాగజెముళ్ళ పొదల్లో నడిచినా  గుచ్చుకున్న ముళ్ళకు నొచ్చుకోకుండా తిరిగాను

స్థిత ప్రజ్ఞత పెద్ద పదమేమో గాని ,నేను పెద్దగా స్పందించని జడుణ్ణి
మానవీయ ఆర్ద్రత అవసరమేగాని
దయనెరుగని హృదయమున్నోణ్ణి
ఫక్తు ప్రాక్టికలుణ్ణి

అనుభవించి పలవరించడం
నా కవితాత్మలో అత్యాశే 
వస్తుదార్శనికత,సామాజిక స్పృహ నా వ్యక్తీకరణలో ఓ ఊహ

కడుపు నొచ్చో
శోష వచ్చో పెల్లుబుకలేదు నా కవిత్వం
గుడుల నుండో గడీలనుండో
కడవాడ గుడిసెల నుండో పుట్టుక రాలేదు నాతత్వం
కుల కడగండ్లనుండి మతచితులనుండి పురుడు పోసుకోలేదు నా సాహిత్యం

లేని కష్టాన్ని ఆపాదించుకోవడం
తెలీని దైన్యాన్ని అనుభూతిచెందడం
అవతలివారి చెప్పుల్లో
మనకాళ్ళుంచడం
పరకాయ ప్రవేశం చేయడం
అది కదా నిజమైన కవన ప్రసవ వేదన
అదే సదా ఋజువైన కవితాంకురార్పణ

కడుపు చించుక వస్తేనే కవిత్వం!
గుండెల్లోకి దూసుక పోయేదే
కవిత్వం!!
॥రాఖీ॥ మా'నవ'తరం


గాయపడ్డ గుండెకాయ ఎన్నిగండాలను తట్టుకుందో..!
బీడువడ్డ నేలతల్లి ఎన్ని క్షామాలను ఎత్తుకుందో...!!

దారినపోయే ప్రతి దానయ్య కబళించినోడే...
బ్రతుకుతెరువుకొచ్చి పెత్తనం చెలాయించినోడే...

మంచితనానికి ఉండనిస్తే మనమెడలు వంచినోడే
మన బలహీనతలను తనమనుగడకై పెంచి పోషించినోడే

ముక్కలు చెక్కలైన శకలాలను ఎంతకాలం పేర్చుకుందాం!
ఒకేరకమైన గుణపాఠాలను ఎన్నిసార్లని నేర్చుకుందాం!!

తిరిగిరాని గతాలను ఎంతకాలం చిలుక్కుదాం!
మానిపోతున్న వ్రణాలను ఎన్నిసార్లు కెలుక్కుదాం!!

మనది నుండి మాదికి మారిపోయిన సిద్ధాంతం ఎందుకు పురికొల్పుతోంది ఆర్యద్రావిడ అంతర్యుద్ధం కోసం?

కూడగట్టి రెచ్చగొట్టి తరిమికొట్టాలనుకొనే హాస్యాస్పద వాదం
ఎలా ఔతుంది బహుళప్రజామోదం??

రాతియుగాలనాటి వంచన నిజమే కావొచ్చు
మను వాదమో
హరప్పా వేదమో 
కడజాతిగ పీడనలో వాస్తవం గ్రహించవచ్చు

కానీ కాలం ఎలావెనక్కి వెళుతుంది
టైంమిషన్ ఎక్కడం కల్పనే ఔతుంది

నాడు క్షోభకుగరైనవారు,వివక్ష అనుభవించిన వారు 
ఏనాడో గతించిన వారిపై తీర్చుకోలేరుగా ప్రతీకారం

కారకులుకానివారిపై కక్షగట్టుడెందుకు నేటి సమాజంలో సమసిపోతోందిగా ప్రతీదురాచారం

మార్పు ఒక్కరోజులోనే రాదు
ప్రకృతి ఒక్కనాడే పరిణామం చెందదు

అణగదొక్కడం ఆక్షేపణీయమైనప్పుడు 
దాన్ని మనమూ విసర్జించాలిగా

సమసమాజంకోసం అందరం కలిసికట్టుగా గర్జించాలిగా

కులమత రహితం జన హితం
సెక్యులరిజం అంబేడ్కర్ అభిమతం

మతం వ్యక్తిగతం
కులం వృత్తిగతం

శారీరక శ్రమ,మేధా నిపుణత గల కర్మకేగాని కులం జన్మకెలా సాధ్యం
వృత్తులతోనేగా రూపాంతరమైంది కులనేపథ్యం

కులాంతర మతాంతర వివాహాలు సర్వసాధారణ మౌతున్న ప్రస్తుత సందర్భం

రాబోయే తరాల్లో ఇదమిథ్థంగా గిరిగీయలేని కులమత సంపర్కం

పురోగమనం మాని ఏల తిరోగమన దారి
చిచ్చు రేకెత్తించే వివాదాలకు ఇకనైనా కట్టాలి గోరి

ఆహారపుటలవాట్లు అవుతాయా సిగపట్లు
మాటల తూటాలతో పడతాయేమో జాతి ఐక్యతకు జాతీయతకు పడతాయేమో తూట్లు

నలిగిపోయిన నేస్తమా,
దగా పడిన తమ్ముడా

విద్వేషాలతో
వైషమ్యాలతో 
మనందరి వికాసం
అందని ఆకసం
ప్రేమించు ప్రేమను పంచు
మానవీయతను ఆస్వాదించు

ఎరుపు రక్తంలోనే ఎన్నో గ్రూపులు
అరచేతి వేళ్ళలోనే
హెచ్చుతగ్గులు
ఏదైనా ఎదను కదిలించేదే
ఏవైనా దేనికది ప్రత్యేకించిందే

జన్మతః జన్యు పరంగా ఎన్నెన్నో విభేదాలు ఒకే తల్లి పిల్లలమైనా
శారీరక మానసిక అవకరాలు కారణమేదైనా

మనది ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే
మనది ఎప్పుడూ సర్వమానవ సౌభ్రాతృత్వమే

 మనుషులుగా సమసమాజాన్ని నిర్మిద్దాం!
పౌరులుగా దేశాన్ని నవశకం వైపు నడిపిద్దాం!!

    🇮🇳!!! జై హింద్!!!🇮🇳
"బతుకు గానుగ"-రాఖీ

ప్రతి పొద్దు ఓ ముద్ద దొరికితే చాలు
పొద్దుపొద్దున్నే చేతినిండా పనిదొరికితే చాలు
చెమటని ఎట్ల పైసలుగ మార్చుకొవాల్నో మాకు
కడుపు నేర్పింది
మాపనేదో మేం చేస్కుంటు ఎట్ల బతకాల్నో మాకు జిందగీ నేర్పింది

పెద్దపెద్ద పదాలు మా సెవులల్లొ పడవు
పార్టీల రంకులు నాయకుల బొంకులు మమ్మల్ని అంటుకోవు
మద్దెమద్దెలొ సెల్లని రూపా(యి)ల నోట్ల బాగోతం
పెబుత్వాలు బాదే పన్నుల రామాయణం ఇవ్వన్నీ మకంతుబట్టని వింతలు
దేశం కట్టుకున్న బట్టకన్నీ కంతలు
అడుగు దీసి అడుగెయ్యలేని గుంతలు

అలిసిన పానానికి ఇంత సుక్కగొంతు దిగితే చాలు
ఆకలి తీర్చే ఆలి పక్క'నుంటే పదివేలు

అట్టట్టిగనే పుట్టుకొచ్చే బొట్టెగాళ్ళకి పట్టెడు బువ్వపెట్టగలిగితె చాలు
పండుగనాడైనా నిండైన బట్ట కట్టగలిగితే చాలు

కుదిర్తే సర్కారు బడి ,లేకుంటే షేక్ మియా హోటల్ల చాయకప్పులు కడిగే పని

మా అయ్య ఆళ్ళయ్య ఆళ్ళయ్యఅయ్య అందర్దీ
గిదేతీరు
మారమని సెప్పే మాటల్దప్ప మార్గం సూపెడ్ది లేదు

గిట్లగే పాన్సాల్కోసారి ఓట్లు గుద్దుతం ,
మూన్నాళ్ళ కూలీ పైసలకి
రంగెలిసే మూడొందల సీరలకి 
గుక్కెడు పుక్కట్ సారా పొట్లాలకి
తుమ్మితె ఊడే ముక్కు పుడకల్కి
బతుకులు దిద్దిటోడే లేనప్పుడు
దొరికిందే బరుక్కొనుడు
రాతలు మార్చెటోడె దొర్కనప్పుడు
ఇచ్చిందాంతోనే తుర్తివడుడు

కాయకట్టంతో బాటు బాధలు కన్నీళ్ళు అల్వాటై రాటుదేల్నం

అటు ఆశవెట్టెటోళ్ళు
ఇటు మోసం జేసెటోళ్ళు

రాజ్జెం అందరిదే
బోజ్జెం మాత్రం కొందరిదే!!
“నట ప్రేక్షకుడు..”

కాలం కదలి పోతూనే ఉంది...
సమయం కరిగిపోతూనే ఉంది..
ఎండలు మండడం...గొంతులు ఎండడం...
క్షామం ..సంక్షోభం....
చెర్లు బార్లా  నోర్లు తెరుచుకొని...అకాశపుటెడారిలోకి..ఆశగా..
మేఘపుటె౦డమావులకేసి జాలిగా...
భూగర్భ జలాలు గర్భ శోకంతో..
ప్రాజెక్టులు..అడియాసల ..వంచిస్తూ..
పొలాలు..మూగగా రోదిస్తూ...
వేసిన పంటలు..నిత్యం ఛస్తూ...
ఆరుగాలం రైతు ప్రాణానికే..గాలం వేస్తూ..
ఎరువులకూ..కరువుగా...
కరువులకే....పరువు ..గా
కాలం కదలి పోతూనే ఉంది...
సమయం కరిగిపోతూనే ఉంది..
చట్ట౦ తనపని తాను చేసుకపోతూనే ఉంది..
రాజకీయం మాయోపాయం తో..పబ్బం గడుపుకొంటూనే ఉంది...
కట్టేసి కొడితే..పడే..చందంగా..
కక్కలేని మ్రింగలేని..గరళంగా..
రోజూ..ఏడుస్తూ..
బ్రతుకును..ఈడుస్తూ...
ఏదోలా గడిపేస్తూ..
నిరాశగా ఎదిరిచూస్తూ...
నిలువునా దోచినా..
మొహమ్మీద ఊసినా...
మారని మధ్య తరగతి ప్రజ...
ఎన్నడూ..మానని..సమాజ రుజ..!
కాలం కదలి పోతూనే ఉంది...
సమయం కరిగిపోతూనే ఉంది..
గ్యాస్ బండల బాంబులు పేల్చినా..
డీజిల్ ,పెట్రోల్..మంటల్లో..కాల్చినా..
స్కాముల్లో..ముంచినా...స్కీముల్లో..వంచి౦చినా..
ప్రేక్షక పాత్ర వహిస్తూ...
మోసపోవడమే..జీవితం లో..ఒక.భాగమని..తలుస్తూ...
వేదాంతం..వల్లిస్తూ...
ఏ కుక్క కనిపించినా..తోకాడిస్తూ..
సగటు పౌరుడు..
ఓటు నిజమైన..హక్కు దారుడు...

చట్ట౦ తనపని తాను చేసుకపోతూనే ఉంది..
రాజకీయం మాయోపాయం తో..పబ్బం గడుపుకొంటూనే ఉంది...
కాలం కదలి పోతూనే ఉంది...
సమయం కరిగిపోతూనే ఉంది..
ఉద్యమాలొస్తాయి...
సమ్మె లొస్తాయి...
అణచడానికి..ఇనుప పాదాలు ఉంటాయి..
లాలూచి పడేవాళ్ళకి..అప్పచ్చులూ..తాయిలాలూ..ఉంటాయి..
తరచూ ధరలు పెరుగుతూనే ఉంటాయి..
ఐదేళ్ల కోసారి...ఎన్నికలూ..వస్తుంటాయి..
వాగ్దానాలు...నమ్మబలకడాలు..ఉంటాయి..
వోట్లకోసం..సీట్లకోసం ..కులాలపేరా ..మతాల పేరా..
నోట్లతో..కటౌట్లతో...ప్రాతిపదిక ఏదైనా..పదవి పందేరా లుంటాయి..
మావాడికి..అనుకొన్న కాలేజీ బ్రాంచిలో..సీటు వస్తే..చాలు ..ఫీసే౦తైనా.. 
ఎదోచోట..అప్పు పుడితే..చాలు.. వడ్డీ ఎంతైనా..
ఏదోలా..చదువై పొతే..చాలు..ఏదోలా.గండం..గడిస్తే..చాలు.. 
పడుతూ లేస్తూ..మొత్తానికి..గట్టేక్కేస్తే..చాలు..
ఇది మధ్య తర గతి..చేవ్రాలు
కాలం కదలి పోతూనే ఉంది...
సమయం కరిగిపోతూనే ఉంది..
చట్ట౦ తనపని తాను చేసుకపోతూనే ఉంది..
రాజకీయం మాయోపాయం తో..
పబ్బం గడుపుకొంటూనే ఉంది...
"ఫోర్త ఎస్టేట్"-రాఖీ

కత్తి మీద సాము
నెత్తి మీద పాము
నిత్యం నీవృత్తి

చెరగని చిరునవ్వు
విసుగెరుగని మోము
ప్రశ్నించడం నీ ప్రవృత్తి

ఓ పాత్రికేయ మిత్రమా
బహుముఖ ప్రజ్ఞాశాలివి
జనహిత దీక్షాశీలివి

సమాజంలో నీ పాత్ర చిరస్మరణీయం
నిగ్గు తేల్చడం నిలదీయడంలో
నీ తెగువ అద్వితీయం

వార్తకోసం ఆత్రంలో
నీఇంటి వంటనూనె(కయ్యే పైకం) సైతం 
నీబండిలో పెట్రోలౌతుంది

నీ పిల్లల్ని స్కూలుకు దింపే సమయం కూడ వాళ్ళనొదిలి నీవెంట పరుగెడుతుంది.

నువు రచ్చకీడ్చే కుటిల నాయకుల నుండి
నువు ఉతికి ఆరేసే
అవినీతి ఉద్యోగుల వరకు
ఏ దుష్ట శక్తినీ వదలవు

ఆహార కల్తీ నుండి మొదలు
యుద్ద శతఘ్నుల వరకు ఏ కుంభకోణం నీ దృక్కోణం నుండి తప్పించుకోవు

ఆకలి పోరాటాలు
చీకటి వ్యాపారాలు
అన్నీ నీకు వార్తా విశేషాలే

సాహస కృత్యాలు
పరిశోధనా ఛేదనలు
నీకు సహజాతాలే

అడవిలో అన్నల తోనైనా
విదేశీ ప్రముఖులతోనైనా
నీ చొచ్చుకపోయే విధం
అభినందనీయం

పండుగలు ఉత్సవాలు
నీకు ప్రజలతోనే అనుభూతులు
బంధుమిత్రుల పెండ్లీ పేరంటాలు
నీకు గగన కుసుమాలు

సెలవు లేని నిత్య కృషీవలుడవు
అలుపెరుగని
సైనికుడవు

విద్రోహ శక్తుల కరాళనృత్యం
ఒకోసారి నీకు మృత్యు తుల్యం

ఏ నాడు ఏకీడు నెదుర్కోవాలో
ఏ వార్తకు ప్రతి ఫలంగా
నీ మరణ వార్త బహుమతిగా గైకొనాలో.,!

జోహార్ మిత్రమా
జేజేలు నేస్తమా!!!
“కవి పద విరమణ”

1

నిజంగా నేను కవినేనా...!
నేను రాస్తున్నది కవనమేనా...!!

ముప్పై నాలుగేళ్ళ నా కల-కలం....కవనం
పదిహేనేళ్ళ నా కవిత రహిత జీవనం-
రెట్టింపున్న కవిజీవితం-రెట్టి౦చని ప్రాభవం...

ఆల్చిప్పలో నత్తలాగా
బావిలో కప్పలాగా
తెల్సిందే జ్ఞానమని-
రాసిందే వేదమని-...
అదే చట్రంలో..తిరుగుతూ..గానుగెద్దులా...
ఒకే పంథాలో ..చరిస్తూ...గ్రుడ్డి గ్రద్దలా...
ఎంత దూరమిలా...ఎంత కాలమిలా...

2

ముక్కుసూటిగా చెప్పడం తప్ప ....
ముక్కున ముక్కెరలా మెరిసింది లేదు
సుభాషితాలను వల్లించడం మినహా..
భావుకత చక్కెరను పంచింది లేదు

మనలో లేనిది ..వేమన లో ఉన్నది
బుద్దిలో..లేనిది..బద్దెన లో...ఉన్నది
అంతేనా కవిత్వమంటే...
కాదంటావా అది తత్వమంటే..

ఎప్పుడైనా చందమామని..ఇ౦ట్లో గుమ్మానికి తగిలించావా..
ఎన్నడైనా..వాన చినుకుని నోట్లో..నాలుకకి..అందించావా..

పూలు..పాలు..మురిపాలూ..
వాగులు..వంకలు..జలపాతాలూ..
కొండలు నదులూ..సంద్రాలూ..
ఎడారి సెగలూ..ప్రియురాలి వగలూ..
ప్రణయాలూ..విరహాలూ..విషాదాలూ
కవితా వస్తువే కరువై౦దా..
కాదేదీ కవితకనర్హ మన్న శ్రీ శ్రీ మాటే చేదై౦దా..

3

అడపా దడపా అక్కడో ఇక్కడో..
శబ్దాల చమక్కులు...
అలంకారాల..గిమ్మిక్కులు..

కవితకు ఊపిరైన..భావుకత
భూతద్దం తోనైనా ద్యోతక మౌతుందా...?
కవితకి ప్రాణమైన..వస్తు దార్శనికత..
ఇన్నేళ్ళ కవనం లో..సంప్రాప్తమై౦దా..??

4

తోటి(?) కవులంతా
సహజ భావుకులంతా..
అనుభూతులు మేళవించి..
అనుభవాలు రంగరించి..
పలవరించి..కలవరించి..

కంచంతో..మంచంతో..
పెన్నుతో..గన్నుతో..
మాటతో..మౌనంతో..
ఆకలితో...చీకటితో..
బాల్యంతో..వైకల్యం తో..
కాలం తో..కన్నీళ్ళతో..

పూలతో..జోలతో..
చెట్టుతో...మట్టితో..
జవాన్ తో..కిసాన్ తో..
నిద్దురతో..ముద్దులతో..
దువ్వెనతో..నవ్వులతో..

అద్దంతో..అబద్దంతో..
సంతోషంతో..సందిద్గం తో..
వాస్తవ సంఘటనలతో...సహజ సిద్ద స్పందనలతో..
స్నేహం తో..సంసారం తో....
ఎన్ని కవిత లల్లారు..!
ఎంత కరుణ పంచారు..!!
ఎంత మమత పెంచారు..!!!

గీతాల్నీ..సంగీతాల్నీ వ్రేళ్ళ నోళ్ళతో...అద్భుత గానం చేసారు..
ప్రభాతానుభూతుల్నీ ..నిశీధి..విశేషాల్నీ..విషాదాల్నీ..
వర్ణాలలో..ముంచి..కవితా చిత్రాల్ని..ఆవిష్కరించారు..
ప్రౌఢ పదబంధాలు లేని సరళ సలలిత సరాగాల్ని కలాలతో పలికించారు..

5

చుట్టూ చూడలేని..కబోదిని..కవినెలా అవుతాను..?
మిన్నువిరిగి మీద పడినా చలించని బండోణ్ణి..
ఎలా స్పందించ గలుగుతాను..?

ఆరు పేజీల సారాంశాన్ని..అర వాక్యం లో..ముగించే నైజం..
ఒక్క ముక్కలో చెప్పేదాన్ని..లెక్కలేనంత పొడగించే మనస్తత్వం..

పూవనాలెన్నో తిరిగి తిరిగి..
అసమాన కుసుమాల నేర్చి కూర్చి..మాలలల్లాలి ...కవి-
మనిషి లోతుల్లోకి దూసుకెళ్ళి ..
తరచి తరచి విశ్లేషించాలి ....కవి-
కవన ధనువునెక్కుపెట్టి ..
అక్షర శరాలు సంధించ గలగాలి..కవి-
పదపదమున ..సుధలూరగ ఎద డోల లూపాలి కవి-

సత్య మెరిగినందుకే....ఇది నా కవి పద విరమణ..!
వాస్తవ మొప్పుకున్న౦దుకే..కవిగా నా నిష్క్రమణ..!!

సుకవీ నీకు జోహారు..!
సుకృత కృతి కవీ ..నీకు నీరాజనాలు..!!
"మాకూ మనసుంది"

సాటి ఎక్స్ క్రోమోజోమ్ తో
నన్ని కలపకు ప్రభూ ...- తన ప్రార్థన 
అరణ్య రోదనగా -"ఎక్స్ క్రోమోజోమ్"  

ఆ పిండం ఆడపిల్లే అన్న నిజాన్ని 
దాచలేని అసహాయురాలు...
గుడ్లనీరు కుక్కుకుంటూ...
-"అల్ట్రా సౌండ్ మిషన్"

తాను మోసుకొచ్చే వాస్తవం
ఆదంపతులకు 
ఆనందం చేకూరుస్తుందో లేదోనని 
అతృత పడుతూ చెవిలో దూరింది -'వార్త'

బయటికి సంతోషం 
లోపల ఆదుర్దాతో 
చిత్రంగా ప్రకటితమైంది 
ఆ తండ్రి "ఎక్స్ ప్రెషన్ "

ఎవరైతేనేం పుట్టింది ,
పోనీలే పాపం 
తల్లికి గండం గడిచింది అంటూ 
చూడవచ్చిన ప్రతివాళ్ళ సానుభూతితో 
పుట్టిన ఆపాప నోటిపై వికసించింది"బోసినవ్వు"

ముందు పుట్టినా వెనక పుట్టినా 
సోదరుడివల్ల వెలికి వచ్చి,
నిన్ను జీవితాంతం వీడనంటూ 
ఆడపిల్లకు తొలినెచ్చెలి "వివక్ష"

విధికి ఎంతగా ఎదురీది 
ఆకాశంలో సగమంటూ 
ఎన్ని రంగాల్లో ఎదుగుతున్నా ,
ఎంతగా రాణిస్తున్నా 
ఎదురు దెబ్బలు తింటూనే ఉంది 
ప్రకృతి సిద్ధమైన "ఆడతనం"

సాటివాళ్ళూ శత్రువులై అసూయతో చేసే 
అప్రకటిత యుధ్ధంతో మ్రాన్పడి పోయింది "స్త్రీత్వం"

జెండా పండగ జరుపుకున్నప్పుడల్లా దేశానికి తప్ప
మనుషులకు,అందునా మానవతులకు 
తను గగన కుసుమమేగా 
అంటూ వగచింది "స్వాతంత్ర్యం"

ఇరుమనసుల కలయిక లో 
చిరకాలం బ్రతుకు పంచుకోవడానికి 
వింత ఆచారాలు,కట్టుబాట్లతో
చెమటోడ్చి ఒక్కోరూపాయి పోగుచేసి
దాచికున్న సంపద నంతా 
ఊడ్చుకపోయే దోపిడిదారుగా 
రూపాంతరం చెందింది"పెళ్ళి"

ఇంటిపేరు మార నీకు
కంటనీరు కారనీకు...

అందం,శీలం,విద్య,బలం
ఇలా నీకున్న ప్రతి సొత్తు ఒక విపత్తు.,

పురుషుడికోసం,పురుషుడి చేత,పురుషుడికి..
అంకితమయ్యే
 ఓ మానినీ.,
అమ్మగా,ఆలిగా సోదరిగా ,సోపతిగా 
ఎంతటి ఔదార్యం చూపినా 
ఇంటాబయటా అనుమానాలు
ఊరూ వాడా అవమానాలు
ఇవేగానీకు బహుమానాలు,
ఇకనైనా తెలుసుకో
ఇలనికపై ఏలుకో 
అంటూ మేలుకొలిపింది
"కవనం"!!