Saturday, December 23, 2017

"గంగోత్రి"-రాఖీ


నా కవిత్వం బాగుంటుంది
కానీ చదువరులకు ఏదో వెలితి తెలుస్తూ ఉంటుంది
అది నాకూ తెలుస్తూ ఉంటుంది
ఏదో అసంపూర్తి గోచరిస్తూనే ఉంటుంది

అందాలు పూస్తాయి నా కైతలు
పరిమళించవెందుకో
వెన్నెల్లు కాస్తాయి నా రచనలు
ఆహ్లాదం పంచవెందుకో

ఆగర్భ శ్రీమంతుణ్ణి కాకున్నా
ఆకలి రుచి ఒంట బట్టలేదెప్పుడూ
అమ్మానాన్నల గారాబం నోచుకున్నోణ్ణి
కాలుకు మట్టే అంటుకోలేదెప్పుడూ

నాచుట్టూ కన్నీళ్ళుకష్టాల బురదే...గొప్పేంకాదుగాని తామరాకునయ్యాను పంకజాన్నై విరిసాను
నాగజెముళ్ళ పొదల్లో నడిచినా  గుచ్చుకున్న ముళ్ళకు నొచ్చుకోకుండా తిరిగాను

స్థిత ప్రజ్ఞత పెద్ద పదమేమో గాని ,నేను పెద్దగా స్పందించని జడుణ్ణి
మానవీయ ఆర్ద్రత అవసరమేగాని
దయనెరుగని హృదయమున్నోణ్ణి
ఫక్తు ప్రాక్టికలుణ్ణి

అనుభవించి పలవరించడం
నా కవితాత్మలో అత్యాశే 
వస్తుదార్శనికత,సామాజిక స్పృహ నా వ్యక్తీకరణలో ఓ ఊహ

కడుపు నొచ్చో
శోష వచ్చో పెల్లుబుకలేదు నా కవిత్వం
గుడుల నుండో గడీలనుండో
కడవాడ గుడిసెల నుండో పుట్టుక రాలేదు నాతత్వం
కుల కడగండ్లనుండి మతచితులనుండి పురుడు పోసుకోలేదు నా సాహిత్యం

లేని కష్టాన్ని ఆపాదించుకోవడం
తెలీని దైన్యాన్ని అనుభూతిచెందడం
అవతలివారి చెప్పుల్లో
మనకాళ్ళుంచడం
పరకాయ ప్రవేశం చేయడం
అది కదా నిజమైన కవన ప్రసవ వేదన
అదే సదా ఋజువైన కవితాంకురార్పణ

కడుపు చించుక వస్తేనే కవిత్వం!
గుండెల్లోకి దూసుక పోయేదే
కవిత్వం!!

No comments:

Post a Comment