Saturday, December 23, 2017

బి ప్రాక్టికల్"

కంఫర్ట్ జోన్ లో కూర్చుంటాం...
కదనరంగపు సాహసాల 
కబుర్లు చెబుతాం,
ఇంటి ముందరి వీధికుక్కకు 
ఎంగిలన్నం సైతం పెట్టలేం,
జీవకారుణ్యం గురించి బోధచేస్తాం...

ఆశలని అనుభూతులని 
పోతపోసుకుని తీసిన సినిమాల్లో సైతం 
రంధ్రాన్వేషణ చేపడతాం...
మంచిని ఎంచడానికి 
ఒక్కటంటే ఒక్కటైన అంశం 
చూడలేని కబోధులమైతాం

కోయిల అందాన్ని 
దుయ్యబట్టడమెందుకు 
కమ్మని గాత్రాన్ని ఆస్వాదించక

కాకి అపశకునమని 
విదిల్చడమెందుకు..
అదే కాకి పితరుల ప్రతీక యని మరచి..

దేశాధిని నేతలు నీ నా లాంటి వారేగా,
రెండుకాళ్ళు రెండు చేతులు
ఇరవైనాలుగ్గంటలేగా
మనమూ ఉద్ధరించొచ్చుగా 
ఊకదంపుడు మాని

సాహసులు,సైనికులకు 
ఉచిత కితాబులిస్తాం
మనము మన పిల్లలు సైతం
సేఫ్ జోన్ లో షికార్లు కొడతాం...

కార్పొరేట్ వ్యవస్థని కడిగేస్తాం...
ప్రభుత్వ పాఠశాలలని ,
ఆసుపత్రులని సప్పోర్ట్ చేస్తూ.,
ఇంటర్నేషనల్ స్కూల్ 
అడ్మిషన్ కోసం..
ప్రెగ్నెన్సీ నుండే 
పైరవీలు మొదలెడతాం...
జలుబు చేసినా,కాలుబెణికినా 
ఏ అపోలోకో
కాంటినెంటల్ కో పరుగెడతాం.,

అరవింద్ కాటన్ వైట్ షర్ట్ మీద
తెలుపంతా మరచి 
ఆవగింజంత మచ్చను 
పసిగడతాం..
చందమామని సైతం
ఎండగొడతాం

ప్రతి పక్షానికెపుడూ
పదవీ లాలస
మనకెందుకు
ఆరకం ధ్యాస

నిజానికీ
సమాజానికీ మినహా
ఏదోఒక ఇజానికి
భావజాలానికీ
ఎందుకు మనం
దాసోహం
బానిసత్వాన్ని నిరసిస్తూనే
వెట్టిచేస్తూ
మేనా మోస్తూ
బానిసలమయ్యే వైనం

నేను సైతం అంటూ 
మనం మాత్రం
ఎందుకు వేయొద్దు
అడుగు ముందుకు
వెరవడమెందుకు
కొండను ఢీకొట్టే
పొట్టేలయ్యేందుకు

ఉద్యమం లేవదీసే చైతన్యం
అవ్వాలి మనం
ప్రత్యక్షంగా ముఖాముఖిగా 
తేల్చుకునే నాయకత్వం
కావలి మనం

వాదన లో పస ఉంటే
మనలో నిజాయితీ ఉంటే
న్యాయం ధర్మం మన పక్కనుంటే
జనం క్షేమం మనం కోరుతుంటే
జనమంతా ప్రభంజనంలా మనవెంటే

No comments:

Post a Comment