Saturday, August 21, 2010

నా లోకం

నేస్తం !
నాకు ఒక పెన్నిధి దొరికింది....

కాని సంతోషం అందుకు కాదు..

ఆ కారణంగానైనా..
అనందాన్ని నీతో పంచుకొనే అవకాశం వచ్చినందుకు ..
మనసు మరీ మరీ ఉవ్విళ్ళూరుతోంది..

నిజమైన సంతోషం..అంటే..
నీతో ..ఉన్న ఈ క్షణాలే అపురూపమైనవి...

మణులకన్నా ..మాణిక్యాలకన్నా..
పసిడి కన్నా..ప్రాణం కన్నా ..అతులితమైనవి..

నీ శుభ సందేశం కొరకు..

ఒక చకోరిలా..

ఒక చక్రవాకంలా...

నా లోకం...నీ కోసం!!

Saturday, July 31, 2010

మైత్రీ దివస శుభాకాంక్షలు...!!!!

ఎక్కితే స్నేహ నౌక!
ఉండదు జీవనసంద్రాన మునక!!
మైత్రీ దివస శుభాకాంక్షలు...!!!!

Thursday, July 29, 2010

అసాధ్యం-నా మది దుర్భేద్యం

అవును ప్రతీదీ నీ ఇష్టమే-
ఇల్లొదిలీ ఊరొదిలీ వెళ్లిపోతావ్....
అంతా నీ అభీష్టమే-
రాష్ట్రాన్నీ దేశాన్నీ దాటిపోతావ్...
కబుర్లాడుతూనే మర్యాదకైనా-
చెప్పాపెట్టకుండా జారుకుంటావ్...
పేరూ వేషమూ భాషామార్చుకుంటావ్..
విలాసమూ మరే సమాచారమూ- దాచుకుంటావ్
అచూకి అసలే తెలీకుండా-
అన్ని జాగ్రత్తలూ తీసుకుంటావ్....
అయితేనేం నేస్తమా..!
నా హృదయం నుండి-
మాయమవడం నీకు సాధ్యమా..?

నీవే..నీవే...

నీవే..నీవే...
గడియారంలో ముల్లు
సెకనుకోసారి కదులు
గుండె గదుల సవ్వడులు
నిమిషానికి డెబ్బై సార్లు
మదిలో తరగని నీ తలపులు
నిరంతర ప్రవాహాలు
నిత్యజీవిత కృత్యాలు
నిమిత్తమాత్ర తథ్యాలు

Saturday, July 17, 2010

అమృత మైత్రి

అమృత మైత్రి

ఏ మేఘాల మాటునో ...
దాగిన సత్యాలు..
ఏ తిమిరాల నోగార్చునో
వెలిగే ప్రగ్జ్యోతులు...
జ్ఞాన బిందువులై..
స్నేహ సింధువు లయ్యే ప్రస్థానం....!
భగీరథ యత్నం లో
గంగావతరణ సదృశం .................!!
తుషార సమీరాలు..
నీలి గగనాన ఘన ఘనాలై.. .....
ఆహ్లాద వీచికలు.. శీతలమైతే ..
ద్రవీభూత హృది శీకరాలు

పొట్టి చిట్టి చినుకులై..
మంటికి..మింటికి ..కంటికీ ఏకధారలై..
ఇలా తలానికి ..బిల బిలా పరుగులిడి ...
కాలవలై..వాగులై..వంకలై..
నదులై..వరదలై..
మనసుల ఇరు దరులను ..
చేరువ చేస్తూ..
అయ్యింది.. స్నేహ సింధువు..
అది అమృత వరదాయిని,,క్షీర సింధువు..!!

Saturday, July 10, 2010

పర-వశం

పర-వశం

పరిచయాన పరిమళాలు-
వెదజల్లినావె
స్నేహితాన సౌరభాలు-
విరజిమ్మినావె
మైత్రీ మధురిమలు-
వర్షించినావె
మధురోహల రోదసిలో-
విహరింపజేసావె
అనుభూతుల మరుమల్లెలు-
వికసింపజేసావె
మంత్రమేదొ వేసి నన్ను –
మాయజేసినావె
నన్ను నేనె మఱచులాగ-
మైకంలో ముంచావే
నువ్విచ్చిన వరమెకటే –
తీయనైన ఈ విరహం ....
నే చేసిన దోషమొకటె-
నిను తలచుట అహరహం...
నువ్వు కలవని కాలం-
వర్షమాయె..................!
నిన్ను చూడక కన్నుల-
వర్షమాయె................!!

Saturday, May 8, 2010

” అమ్మ “

మహోన్నత మాతృత్వ దినోత్సవం-నా జన్మ దినోత్సవం
ఈ రోజే కావడం యాదృఛ్చికమైనా—నాకొక వరం
కాకతాళీయమైనా..అతి మనోహరం!!
(మాతృత్వ దినోత్సవ సందర్భంగా మా అమ్మ శ్రీమతి గొల్లపెల్లి వేంకటలక్ష్మీ అంజయ్య పాదపద్మాలకు..ఈ కవిత..అంకితం)

“అమ్మ”
అమ్మ అమ్మ అమ్మ
అ నుండి క్ష వరకు... అమ్మ!
ఒకటి నుండి అనంతం వరకు....అమ్మ!
జననం నుండి మరణం వరకు..... అమ్మ!
శూన్యం నుండి విశ్వాంతరాళం వరకు....అమ్మ!
క్షమ నుండి ప్రేమ వరకు...అమ్మ!
ఓర్పు నుండి ఓదార్పు వరకు .....అమ్మ!
త్యాగం నుండి అనురాగం వరకు....అమ్మ!
దైవత్వం నుండి మాతృత్వం వరకు....అమ్మ!
అమ్మ కన్న గొప్పది..ఒకే ఒకటున్నది..ఈ లోకంలో
ఇంకా అర్థం కాలేదా..అదీ అమ్మ నే కదా సదా!!

Sunday, April 4, 2010

ప్రేమ సంకేతం

ప్రేమ సంకేతం
నీ ఊసెత్తగానే మనసులో స్ఫురిస్తాయి
నవపారిజాతాలు
నీ ఊహ రాగానే హృదయంలో వెల్లు వెత్తుతాయి
రమ్య జలపాతాలు
నీ తలపు మెరవగనే మదిలో నినదిస్తాయి
భవ్య సంగీతాలు
నీ స్మృతి మెదలగనే ఎదలో పురివిప్పుతాయి
ఆహ్లాద మయూరాలు
కనులు మూస్తే స్వప్నాలు
’కల’వరిస్తే సత్యాలు?!
ఇంతకన్నా ఏంకావాలి ఋజువులూ సాక్ష్యాలు!
ఎలా తెలుపగలగాలి ప్రేమ కొలమానాలు,సంకేతాలు!!

Monday, March 15, 2010

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

బ్లాగ్వీక్షకులకు అభిమానులకు మిత్రులకు నా వి ”కృతి” సహిత ఉగాది శుభాకాంక్షలు!!

షడ్రుచుల ఉగాది-కో-యిల గానాల వినోది

కోయిలా కూయవేల?

రాయిలా మౌనమేల?

ఉగాది రాలేదనా? రాదేలనా!

మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా

చింత కాయకుంటే ఎందుకంత చింత?

మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !

మమకారాలు కరువయ్యాయనా!

నీ పాట జనం మరి’చేద’య్యిందనా!

పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!

ఎందుకు నేస్తం?ఈ బేలతనం

నేనున్నాను నీకోసం

నా షడ్రుచుల జీవితమూ ఉంది



తలపు(/తలుపు) “తీయని” మనసుంది

కాసింత మా’నవత’పై మమ’కార’ముంది

నచ్చక చిటపట లాడినా తప్పని సరియగు స్నేహిత(౦)ము(ఉ)ప్పుంది

కారణమేదైనా గాని మెచ్చేనేస్తాలను మరి”చేదు”౦ది

నొప్పించినా స’వరించి’ ఉల్లాస తీరాలకు పరుగులు తీసి(తీయించి) వగర్చేదుంది(వగరు+చేదు)

జీవిత మలుపు మలుపులో గెలిపించే వేలు’పులు పు’ష్కలంగా అందించే దీవెన ఉంది.

పాడవే కోయిలా..

పాడుకో యిలా....

ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...

Sunday, March 14, 2010

గత ఉగాదుల స్వగతాలు

గత ఉగాదుల స్వగతాలు

తెఱ పడని నాటకం
నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
అసలే నాది అంధుని పాత్ర
అందులోను అమావాస్య రేయిలో
లైటారిపోయినప్పటి సీను
నిజంగానే తడుము కోవాల్సిన పరిస్థితిలో
అప్పుడు నేను జీవిస్తున్నానని ఎరుగని ఆడియన్స్
నా నటన చూసి ఎన్నెన్ని కామెంట్స్
వాళ్ళకెలా చెప్పాలి అది నాటకమని
నా పాత్రే ఒక బూటకమని
నా నాటకానికి తెర తీసారే గాని
వేయడం మానేసారు
ఇదేం రక్తి కడుతుందని ఇంకా
ఇలాగే చూస్తున్నారు
నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
తెరవెనక్కి పారిపోతే పిరికి వాడని అంటారు
రంగాన్నంతాపీకి పోతే పిచ్చివాడని అంటారు
ఇంకా అలాగే నిలబడితే చచ్చిపోడేమని అంటారు
రావడమైతే రంగం మీదికొచ్చాను గాని
మధ్యలో డైలాగ్స్ అన్నీ మరచిపోయాను
నోటికొచ్చింది పేలుతున్నానే గాని
’అసలు యాక్షన్’ చేయడం మానేసాను
కప్పగంతులు వేస్తున్నాను
కుప్పిగెంతులు వేస్తున్నాను
నవ్వుతున్నారు లెమ్మని
ఇంకా నవ్వుకొమ్మని
నీతులు మాట్లాడ్డం మానేసి బూతులనే మాట్లాడుతున్నాను
కాళ్ళతో నడవడం వదిలేసి చేతులతో నడుస్తున్నాను
నువ్ బఫూన్ వి కావని డైరక్టర్ చెప్పడు
నువ్వే హీరోవని ప్రామ్టరూ చెప్పడు
వాళ్ళకు మాట పడిపోయింది కామోసు
మరి నాకే చెవుడొచ్చింది కావచ్చు
ప్చ్! నా జీవిత నాటకం ఆగితే బాగుణ్ణు
హుమ్!!ఈ విషమ రంగం మారితే బాగుణ్ణు
నాలోని మరోమనిషికి ఇవ్వేం పట్టవ్
ఆ’మరమనిషికి’ నావేం గిట్టవ్
“ ఒరే నువ్వున్నది అథః పాతాళం
చేరాలనుకునేది గగనాంతరాళం
ఎందుకురా ఎప్పుడూ అదే ధ్యాస
ఎందుకురా ఈ వృధా ప్రయాస
తెల్ల కాగితాన్ని పిచ్చిగీతలతో ఎందుకురా పాడుచేస్తావ్
ఎవరూ అర్థం చేసుకోని భాషలో ఎందుకురా నీ గోడు రాస్తావ్
నువ్వనుకుంటున్నావ్ అది కళాఖండమని
నువ్వనుకుంటున్నావ్ అది ఘనకార్యమని
అసలూ ఎందుకు నటిస్తావ్ “ అని నేనంటే
“అయినా ఏం సాధిస్తావ్ “అని నే అన్నది వింటే
నాలోని మరో వాడు పరమ కౄరుడు-
“నటించడం నా జన్మ హక్కు” అంటాడు
“అయినా నటిస్తే ఏం తప్పు” అంటాడు
“ నీతిగా బ్రతికితే గోతిలోకి తోస్తారా”
చిరు నవ్వు నవ్వితే ఉరిశిక్ష వేస్తారా “
అనేదే వాడి వాదన-ఆవేదన
“ నటించు కాకపోతే నగ్నంగా నర్తించు
ఇదే పాత్రలో ఇదే స్టేజీపై ఈ ప్రేక్షకులముందే ఎందుకు నటిస్తావ్
నీ నటనకి ఆస్కార్ అవార్డ్ రావాలని వెర్రిగా ఎందుకు ఆశిస్తావ్-“
నేనంటే పడని అసమర్థుడు నా మాటే వినని దరిద్రుడు అన్నాడూ-
“ ఏంచేస్తాం నా ఖర్మ ఇలాగే కాలిపోయింది
దొరక్కదొరక్క నాకిదే దాపురించింది
ఏది ఏమన్నా నా నటన దీనికే అంకితమైంది
ఐనా
“తప్పుని తప్పు “ అన్నవాడిని తప్పుగా అనడమేగాని”
’ఒప్పుని ఒప్పు’అని ఒప్పుకున్న వాడేడిరా “అని
వాడి మాటలూ కొంత సబబు అనిపించాయి
వాడి బాధలో కొత్త సత్యాలు తోచాయి
“ ఎవరి కోసం నటిస్తున్నావో గాని
చూడాల్సిన వాళ్ళు చూసి హర్షిస్తున్నారో లేదో గాని
గోటితో పోయేదానికి గొడ్దలి ఉపయోగించడం తో
మాటతో పోయేదానికి మనిషిని బలిచేయడం తో
నడమంత్రపువాళ్ళవల్ల నగుబాటు కావాల్సి వచ్చింది
చేయని నేరానికి శిక్షపొందల్సి వచ్చింది
అయినా ఎందుకురా అందని దానికోసం అర్రులు చాస్తావ్
ఎందుకురా ఆకాశానికి నిచ్చెన వేస్తావ్
ఇవతలి వాళ్ల ప్రణాలు అనవసరంగా ఎందుకు తీస్తావ్
అనుక్షణం అవమానంతో కుమిలి కుమిలి ఎందుకు ఛస్తావ్
అసలు ఎందుకీ అనర్థపు తపన
అవును ఎందుకీ అనవసరపు మదన
ఒరే ఎందుకీ అంతర్గత రోదన
ఇంకా ఎందుకీ అనంత కాల వేదన “”
అప్పుడన్నాడు ఏమి తెయని మా మూఢుడు
ఒప్పుకున్నాడు అన్ని తెలిసిన ఈ మూర్ఖుడు
“ ఎలా బయట పడాలిరా ఎరక్క వచ్చి ఇరుక్కున్నాను
ఏలా ఏడవాలిరా నే ఎక్కిన కొమ్మనే నరుక్కున్నాను
ఇప్పుడేంచేయాలిరా నా నాలుక నేనే కొరుక్కున్నాను
ఆడే వాణ్ణి ఓడి పోయాను
ఆడించేవాడూ వీడి పోయాడు
అయినా చేతులు కాలాక ఆకులు పట్టుకోలేం
అవును పునాది కూలాక మేడలు కట్టుకోలేం
కాని ఈ ప్రేక్షకులకు
చక్షువు నోరుతో వీక్షణ కోరతో
దృశ్యాన్ని తాగుతూ పైశాచికానందం పొందే భక్షకులకు
ఇదంతా చూసి విసుగు రావడం లేదూ
ఇందులో ఏదో గందరగోళం జరిగిందని తోచడం లేదూ
అందుకా మాటల రాళ్ళు రువ్వుతున్నారు
అందుకే చూపుల బాకులు దువ్వుతున్నారు
నా నటన చూసి హా హా కారాలు
నన్ను చూసి హుంకారాలు ఛీత్కారాలు
నా నాటకం పేరే “ ఓటమి “ కదూ
దాని రచయిత మాత్రం రాముడో కృష్ణుడో కాదు
వాడు అసలైన అసమర్థుడు వ్యర్థుడు
ప్రియమైన ప్రేక్షకులారా ఇంత తెలిసాక
ఎందుకు మీరు వెళ్ళడం లేదు
నరమాంస భక్షకులారా వాన కురిసాక
ఎందుకు తెర వెయ్యడం లేదు
ఓ సూత్రధారీ ! నువ్వైనా చెప్పేడు
ఈ రంగానికి మలుపు ఎప్పుడు?
నా నాటకానికి ముగింపు ఎన్నడు???

ఈ ఉగాది ఆనందానికి సమాధి


రక్తాక్షి ఏం చూసింది రుధిరాన్ని తప్ప
రక్తాక్షి ఏం మిగిల్చింది నిట్టూర్పు తప్ప
రక్తం ఏరులై పారింది నిన్న
హాహా కారాలే ఏ నోట విన్నా
ఏముంది గతం వేపు తిరిగి చూస్తే
కాకులు గ్రద్దలు వాలే స్మశానం తప్ప
ఏముంది చరిత్ర పుటలు తిరగేస్తే
రక్తాక్షి లిఖిత రక్తాక్షరాలు తప్ప
ఏ వర్షం చూసినా ఏమున్నది హర్షం?
బాధల పెదవులు పులుముకున్నాయి చిరు వర్షం !
ఏ గానం విన్నా ఏమున్నది వినోదం?
జగమంతా ప్రతిధ్వనించు అన్నార్తుల ఆర్తనాదం!!
క్రోధన మాత్రం ఏంతెస్తుంది రోదన తప్ప
క్రోధన మాత్రం ఏం మిగులుస్తుంది ఆవేదన తప్ప
నిన్నకారిన రక్త ధారలు తుడుస్తుందా ?ఓదారుస్తుందా!
అమ్మ మానం అమ్మజూపిన
పరమ నీచుల మారుస్తుందా? తెగటారుస్తుందా!
అన్నదమ్ములు మతం పేరిట
కుమ్ములాడితె విడిపిస్తుందా? తీర్పిస్తుందా!
క్రోధన మాత్రం ఏం తెస్తుంది రోదన తప్ప
క్రోధన మాత్రం ఏం మిగులుస్తుంది ఆవేదన తప్ప
మీద ఉమ్మేసినా సహిస్తాం మేం
కాలదన్నేసినా క్షమిస్తాం మేం
ఓర్పు మా మారుపేరు-సహనం మాబ్రతుకు తీరు
అందుకే రా క్రోధనా! చేసిపో విలయ నర్తన!!

Saturday, March 13, 2010

అందమె ఆనందం-ఆనందమే జీవిత సుమ గంధం!!

అందమె ఆనందం
పిరుదులపై పారాడే నీలాల కురులదే అందము
హిమగిరులను తలదన్నే ఎదబిగువులదే అందము
తనివిదీర చూపుకైన నోచని లోభినాభిదే అందము
కేసరే విస్మయపడు సన్నని నడుమునదే అందము
హరిణులను మించిన చంచల నయనాలదే అందము
సంపెంగల మరిపించెడు చక్కనైన నాసికదే అందము
బూరెలవలె ఊరించెడు నిగ్గెక్కిన బుగ్గలదే అందము
దానిమ్మలె నమ్మలేని తళుకుల దంతాలదే అందము
హద్దుల సరిహద్దులు దాటించే ముద్దగు పెదవులదే అందము
జివ్వుమనేలా ఎదుటివారి ఎదలపై రువ్వే నవ్వులదే అందము
బాకులు కాకున్నా గుండెల్లో గుచ్చుకునే చూపులదే అందము
అందమే ఆనందం-ఆనందమే జీవిత సుమ గంధం!!

Friday, March 12, 2010

ప్రేమించు

నీకు తెలుసా వాలిపోతున్న కనురెప్పల బరువెంతో
నీకు తెలుసా రాలి పడుతున్న అశ్రువుల విలువెంతో
నీకు తెలుసా నిద్రలేమితో మండే కళ్ల మంటెంతో
గమనించావా!
తదేకంగా తెఱపై చూస్తుంటే కనుకొలను
కోల్పోయిన ఆర్ద్రత అనుభవాలను
నీకు తెలుసా భావ గంగా ప్రవాహాన్ని నీకందించడానికి
వేళ్ళునొక్కేకీల హేల గోల
నీకు తెలుసా ముంచుకొచ్చే మత్తు గమ్మత్తు మహత్తులు
నీకు తెలుసా అనుక్షణం నీ ఆలోచనల కుమ్మరిపురుగు మెదడునెలా తొలుస్తుందో
నీకుతెలుసా! పుడమి కడుపు చీల్చుకొంటూ వెలికి వచ్చే గడ్డి పఱక ప్రయాస
నీకు తెలుసా!గొంగళి పురుగు రంగుల సీతాకోక చిలుక లా మారడానికి పడే ప్రస్థాన యాతన
నీకు తెలుసా! ఒక్కో పుల్లను,ఎండు గడ్డి రెల్లునూ కూడగట్టుకొని
పిచ్చుక గూడు కట్టుకోడానికి పడే తపన
ఎందుకు నేస్తం ! తీసిపారేస్తావ్ !! నన్నూ నా ప్రేమను
ఎందుకు మిత్రమా!! అపనమ్మకంతో చూస్తావ్ నన్నూ నా అనురాగాన్నీ
నీకు చేదు అనుభవాలు ఉండొచ్చుగాక !
నీవు విషమ పరిస్థులనెదుర్కొనవచ్చుగాక!!
అందరినీ ఒకే గాటుకు కట్టేయడం ఎంతవరకు సమంజసం?
అందరినీ అదే చోటుకి నెట్టేయడం ఎంతవరకు సబబు?
ఎప్పుడూ మోసపోతామని భయపడడం ఎంత వరకు న్యాయం?
నమ్మకం ఎప్పుడూ నమ్మదగ్గదే!
విశ్వసనీయత ఎల్లప్పుడు విశ్వసించ దగ్గదే!!
నమ్మంది నిమిషమైనా మనలేమే!
నమ్మంది క్షణమైనా శ్వాసించలేమే!!
పుట్టుక ఒక విశ్వాసం ?!
మరణం జీర్ణించుకోలేని నిజం
ప్రేమ అవసరమైన నమ్మకం
స్నేహం శాశ్వతమైన ఆనందం!!
గ్రహించు
సంగ్రహించు
విశ్వసించు
ప్రేమించు
సదానందంగా
సచ్చిదానందంగా
జీవించు
అనుభవించు అనుభూతులు పంచు!!!!!

Thursday, March 11, 2010

నీకే ఈ నా సమస్తం!!

ఆనంతాల అంతుల నుండి
దిగంతాల అంచుల దాటి
పాలపుంతలేన్నో మీటి
చుక్కలు చిక్కులు తెగ త్రెంచుకొని
ఖగోళాలు కృష్ణబిలాలు తప్పించుకొని
నవగ్రహాల ఉపగ్రహాల పీడ వదిలించుకొని
సప్త సముద్రాలను ఈదీ
మేరు పర్వతాల నధిరోహించి
అరణ్యాలు ఎడారులన్నీ ఏదీ వదలక
కౄర మృగాలు విష సర్పాలు ఎదునారైనా నే బెదరక
మైదానాలు నదీ నదాలు
కొండలు కోనలు వాగులు వంకలు ఏవీ విడవక
ఎండమావులు ఇంద్ర ధనువులూ వేటి మాయలో అసలే చిక్కక
లోయలు గుహలూ మిద్దెలు మేడలు
రెక్కల శ్వేత తురంగంపై అంతటా సంచరించి
విశ్వమంతటా అన్వేషించీ
అణువణువున నిను శోధించీ
ఆఖరికి నాలోనే నీవైన నన్ను గ్రహించి సంగ్రహించీ
తరించి అవతరించానిట నేస్తం!
నీకే ఈ నా సమస్తం!!
కుశలమే నా ప్రస్తుతం ?!

Thursday, March 4, 2010

“యత్ర నార్యస్తు పూజ్యంతే”


“యత్ర నార్యస్తు పూజ్యంతే”

ఎవరు గుర్తించగలరు-స్త్రీ ఔన్నత్యాన్ని
ఎవరు కీర్తించగలరు-మహిళ మూర్తిమత్వాన్ని
ఎవరు తెలుసుకొనగలరు-పడతి ప్రేమ తత్వాన్ని
ఎవరు శ్లాఘించ గలరు-సుదతి సౌందర్యాన్ని
ఎవరు కొనియాడగలరు-తరుణి త్యాగనిరతిని
ఎవరు ఆరాధించగలరు- నాతి దైవత్వాన్ని
జననేంద్రియాలు-పాల సంద్రాలు
చర్మ వర్ణాలు-దేహ గణితాలు-అవయవ పరిమాణాలు
ఇంతేనా ఇంతి విలువ!
ఏనాడో వేసుకుంది నీకై- తనకు తానే శిలువ!!
మిత్రమా అప్పుడే మరచిపోయావా-పాలుతాగి రొమ్ము తన్నావుకదా!
నేస్తమా ఇంతలోనే కైపు తలకెక్కిందా –తిన్న ఇంటి వాసాలు లెక్కిస్తున్నావు మర్యాదా!!
నిన్ను నవమాసాలు మోసిందీ –నెలతే
తన రక్తమాంసాలు పంచిందీ –రమణే
నీకు స్తన్యమిచ్చి నీ ’కొవ్వు’ పెంచిందీ –ఒక సుందరే
నీ మలమూత్రాల నెత్తి పోసిందీ-ఒక ముదితే
నీకే రోగమొచ్చినా-నీకెలా నొచ్చినా
కనురెప్పలా కాచిందీ-గారంగా పెంచిందీ-ఒక కాంతయే
నేస్తమా!
నీ అసహాయ అసహన కోప ప్రదర్శన
కేవలం అది ఒక బూతో-నీ పుట్టుకకి కారణమయ్యే రీతో
నువ్వు నోరు తెరచి పేలితే -అది ఒక తల్లి గురించో-చెల్లి గురించో
మిత్రమా!!
నీవు పెదవి విప్పి వాగితే-అది ఒక శాపనార్థమో
ఒక అవయవ అవకర అవగుణగణమో
కించపరచడం మినహా నువ్వేం సాధించగలవ్
మనసు నొప్పించే తరహా మాత్రమే వాదించగలవ్
ఆమాత్రం అందరూ పేలగలరు-అంతకన్న ఎక్కువే
ఎదురు దాడి చేయగలరు
పరిధులు దాటని సంస్కారం వారికి వెన్నతో పెట్టిన విద్య
అవధులు మించని గాంభీర్యం-వారు నేర్చుకున్న విజ్ఞానం
దైవమిచ్చిన నాలుక-కాదుకదా అశుద్ధానికి ప్రతీక!
వరంగా దొరికిన వాక్కు-కాకూడదు కదా అసహ్యించుకోబడే కక్కు!!
పవిత్రమైన నీ హృదయం-ఎలా అయ్యింది మల నిలయం?
ఇప్పటికైనా నిన్ను నీవు తెలుసుకో
నీ తప్పులు నీవే దిద్దుకో
నీ బ్రతుకుని మంచిగా మలచుకో
నీ జన్మకి సార్థకత చేకూర్చుకో
నిను కన్న వాళ్ళు-కట్టుకున్నవాళ్ళు
నీ చుట్టూ ఉన్నవాళ్ళూ గర్వించేలా మసలుకో
అందిస్తున్నా నేస్తం –నీకే ఈ సమస్తం!!!!!!!

Saturday, February 20, 2010

పెద విన్నపం

గాలిలో నే కలిసిపోయినా
నీ ఊపిరై నే నిలిచిపోతా
బూడిదగా నే మారినా
నీ భావనలో నే వాసముండెద
సమాధి నేనైపొయినా
నీ స్మృతిలో జీవించెద
మరణమందైనా గాని
ముందే నే చితిని మండెద
నేస్తమా!
ఎన్నటికైనా నా ప్రేమను గుర్తించేవా!!
ఎప్పటికైనా నను నీవాడిగ స్వీకరించేవా!!

Saturday, February 13, 2010

ప్రేమే దైవం!

ప్రేమ గుడ్డిదే గాని
చూడగలుగుతుంది ఎవ్వరూ చూడలేని
చీకటి కోణాలు
అతినీలలోహితాలు
పరారుణ కిరణాలు!

ప్రేమ చెవిటిదే గాని
వింటుంది ఎవ్వరూ వినగలుగని
అతి ధ్వనులు
భరించలేని ప్రతి ధ్వనులు
ఎదచేసెడి వింత సవ్వడులు!!

ప్రేమ కుంటిదే గాని
ఎగరగలుగుతుంది ఎవ్వరు దాటలేని
ఏడేడు సంద్రాలు
ఎక్కడం కష్టమయ్యే ఎవరెస్ట్ శిఖరాలు
చేరడం భారమయ్యే జీవన తీరాలు!!!

ప్రేమ మూగదే గాని
ఎరుకపరుస్తుంది
కవులు రాయలేని కావ్యాలు
భాషకందలేని భాష్యాలు
వర్ణింపజాలని దృశ్యాలు!!!!

ప్రేమకవకరాలెన్నో ఉన్నా
ప్రేమకున్న గొప్పతనమే ఆత్మస్థైర్యము
వైశిష్టతయే మొండి ధైర్యము
దౌర్బల్యమే హృదయ చౌర్యము!!!!!!

అమ్మను ప్రేమను ఎవరూ శ్లాఘించలేరు
అమ్మను ప్రేమను ఎపుడూ త్యజించలేరు
ప్రేమకు జీవరూపం అమ్మ!
అమ్మకు పూర్ణభావం ప్రేమ!!

Friday, February 12, 2010

దేశం-సందేశం

కలము పట్టి కవిత రాసినా
గళము విప్పి పాట పాడినా
కలిగించు ప్రజలందు దేశభక్తి!
రగిలించు ఎదలందు చైతన్య శక్తి!!

Tuesday, February 9, 2010

ప్రకృతి పాఠాలు

నింగితాను చెబుతుంది
ఎలా వంగి ఉండాలో

నేల మనకి నేర్పుతుంది

ఎలా అణిగి మనగాలో

సంద్రమూ తెలుపుతుంది

పరిధెలా దాటకుండాలో

పవనమెరుక పరుస్తుంది

ప్రాణమెలా నిలపాలో........!

Friday, February 5, 2010

“నేనే” మిగలక నీవై పోతా!!

గణపతి నీవై ప్రకటితమైతే-పార్వతి మాతగ నిను ముద్దాడెద
మారుతివై మరి నువ్వెదురొస్తే-రాముడు నేనై అక్కున జేర్చెద
కృష్ణుడు నీవై నను కృప జూస్తే-రాధను నేనై నీలో ఒదిగెద
విద్యాదేవిగ నువ్వగుపిస్తే-బుద్దిగ మేధలొ పదిల పరుస్తా
కాళిక నీవై కన్నెఱ జేస్తే-రామకృష్ణనై ప్రేమగ జూస్తా
గ్రామ దేవతగ ప్రత్యక్షమైతే-దేహం నీకే నే బలియిస్తా
పంచభూతముల ప్రతినీవైతే-పంచప్రాణముల నేనర్పిస్తా
సర్వము నిండిన సత్యా నివైతే –ఆడి తప్పని హరిశ్చంద్రుడినౌతా
తిమిరం మాన్పే గురువీవైతే-సేవలు చేసే శిశ్యుడ నవుతా
ప్రాణంతీసే మృత్యువు వైతే- జీవం పోసే అమృతమవుతా
ప్రళయ కాల రుద్రుడివే నీవైపోతే-ఉమలా సగభాగమై నిలిచిపోతా
నువ్వెలా ఉన్నా సరే-అన్నీ నీవని ఆరాధిస్తా!
నన్నెలా అనుకున్నా సరే-“నేనే” మిగలక నీవై పోతా!!

Thursday, February 4, 2010

క్షణమైనా మనం...!

నాకూ తెలుసు ప్రియతమా...
నన్ను గెలిపించడానికే నువ్వోడిపోతావని...
నన్ను దేవుడిగ మార్చేందుకే నీ గుండియ గుడి చేసావని..!!
కనుమఱుగైన గతం గుర్తొస్తే దుఖః భాష్పాలు...
కనులముందు నిలుస్తే ఆనంద భాష్పాలు....
ఎలాగైనా తప్పవు నయనాల గంగా-యమునల ప్రవాహాలు
దృక్కోణాల కందని దృక్పథం మన మధ్య దిక్చక్రం...!
కలిసినట్లనిపించే ఊహా చిత్రం...!!
పరిచయం అనేది అత్యంత అల్పమైన పదం మనబంధం ముందు..
ఈ అనుబంధం జన్మ జన్మాల పొందు ..పసందు...
అయినా మనసు పంచుకొన్న భావాలు మాటలకెలా అందుతాయి..?
ఏ నిఘంటువులలో దొరుకుతాయి?
వ్యక్తీకరించలేని అనుభూతులు పరవశానికే చెందుతాయి..!
అంతరాంతరాల్లో ఒకటైన మనం...
వేరే అనే భావనలో  మనం మనం..!

Saturday, January 30, 2010

ఓ స్త్రీ !

ఓ స్త్రీ !
ఓ నారీ, ఓ ఇంతీ,
ఓ ముగ్ధ, ఓ ముదితా ,ఓ మగువా, ఓ మహిళా
ఓ అతివా ,ఓలలనా,ఓ వనితా,ఓతరుణీ
ఓ కలికీ ,ఓ కోమలీ, ఓ పడతి, ఓ సుదతీ
తల్లివో ,చెల్లివో, పాలవెల్లివో, కల్పవల్లివో
అమ్మవో ,పూల కొమ్మవో,అక్కవో తేనె చుక్కవో
ఎందుకమ్మా మమ్మల్ని ఇలా అలరిస్తావు,ఊరిస్తావు ,ఉడికిస్తావు
ఎందుకమ్మా మాకు ప్రాణం పోస్తావు
మమ్ము మాలిమి చేస్తావు
నీ మురిపాలలో ముంచేస్తావు
నీ సహచర్యం లో లాలిస్తావు
నీ అనురాగంతో తడిపేస్తావు
సూరీడు చుట్టూ భూమిలా
మా జీవితమంతా నీ నీడలా మేమిలా
నీ వెంటే ఉంటాము-నీ చుట్టే తిరుగుతూ ఉంటాము
ఎందుకమ్మా మమ్మల్నిలా ప్రభావితం చేస్తావు
ఎందుకమ్మా మమ్మల్ని ప్రలోభ పెడతావు
మాకు జ్ఞానం కలుగ జేస్తావు
మా చేయి పట్టి నడిపిస్తావు
గోరు ముద్దలు కుడిపిస్తావు
ఏదోలా మంత్ర ముగ్ధులను చేస్తావు
ఏదొ మాయలో పడదోస్తావు
మా కింకే ప్రపంచమూ తెలీదు
మాకు మరింకే ధ్యాసా లేదు
కుసుమం చుట్టూ భ్రమరంలా
చంద్రిక కొరకై చకోరం లా
మేముంటే –మైమరచి పోతుంటే
మాలో లోలోఅంతానీవై నిండిపోతావు
మా సత్యాన్వేషణ మా నిత్యాలోచన
అన్నీ నీవై ఉండిపోతావు
పిచ్చివాళ్లను చేసేది నీవే
మెచ్చి మెళ్ళో దండ వేసేది నీవే
ఎందుకమ్మా ఇలా మామది దోస్తావు
ఎందికమ్మా నీ మది దాస్తావు
త్యాగం నీరూపంటారే
అనురాగం నీ తీరంటారే
ఓ స్త్రీ !
ఓ నారీ, ఓ ఇంతీ,
ఓ ముగ్ధ, ఓ ముదితా ,ఓ మగువా, ఓ మహిళా
ఓ అతివా ,ఓలలనా,ఓ వనితా,ఓతరుణీ
ఓ కలికీ ,ఓ కోమలీ, ఓ పడతి, ఓ సుదతీ
తల్లివో ,చెల్లివో, పాలవెల్లివో, కల్పవల్లివో
అమ్మవో ,పూల కొమ్మవో,అక్కవో తేనె చుక్కవో
ఏదేమైనా
నీ తోనే మా జీవితం!
నీకే మేమంకితం !!!

Friday, January 15, 2010

సత్య శివ సుందరీ!

దశావతార ధారిణీ దైత్య సంహారిణీ
నవరస సరస పోషిణీ-జగన్మోహినీ
అష్టైశ్వర్య ప్రదాయిని-నాద వినోదిని
సప్త వ్యసన వినాశినీ –దుర్గా భవానీ
అరిషడ్వర్గ భయంకరీ-శాంకరీ
పంచ భూత సంజాతిని-భువనైక సుందరీ
చతుర్వేద సారాంశినీ-శ్రీ వాణీ బ్రాహ్మిణి
సత్వరజస్తమో త్రైగుణ్యీ- బాలా త్రిపుర సుందరీ
ద్వైదీ భావ మాయామోహినీ-ఇహపరదాయినీ
సత్య శివ సుందరీ-రాఖీ రస మంజరీ
నిత్యమోక్ష ప్రదాయిని ఓంకార రూపిణి
అమ్మా నీకిదె సాష్టాంగ వందనం
వేయవమ్మా నీతోనే నా బంధనం

Tuesday, January 12, 2010

ఆ”విరి”

నేల దిగిన మేఘాలు -అందాల నీ కురులు
చూస్తుంటే వేస్తున్నాయి-నాకే అవి ఉరులు
సవరించ పూనితె ఆ ఘన ఘనాలు
అటు హిమవన్నగాలు!
ఇటు మేరు జఘనాలు!!
నేనెలా వేగను-నా హృదయ ఆవిరి సెగలో
నిలవగ నే విరినై –సదా నీ సిగలో

Monday, January 11, 2010

కవిని నేను!

చిగురాకు నేను
చిరుగాలికే మైమరచేను
ఏకాకి నేను
చిరు స్పర్శకే పులకరించేను
అనాధను నేను
చిరునవ్వుకే పరవశమౌతాను
బీడు భూమి నేను
చిట్టి చినుకుకే అనందం తట్టుకోలేను
ఎండిన మోడు నేను
ఆమని కై అర్రులు చాస్తాను
ఎడారి బాటసారి నేను
ఒయాసిసుకై పరితపించి పోతాను
పసి వాణ్ణి నేను
చేర దీస్తే ఆశగా చేతులు సాచేను
చకోరి నేను జాబిలికై జాలిగ చూస్తాను
కవిని నేను
కాసింత ప్రశంస కే ఉత్తుంగ తరంగమై ఉప్పొంగుతాను
ఏమిచ్చుకోను అభిమానులందరికీ
శిరసు వంచి నేను సదా అభివాదమంటాను

Saturday, January 9, 2010

మోహం-దాసోహం

నీ ప్రేమ కొరకె బ్రతికేస్తున్నా
కాదంటే వెంటనె ఛస్తా
మరోజన్మ జన్మ ఎత్తైనాసరె
నీ కడుపున కొడుకై పుడతా
అప్పుడెలా దూరం చేస్తావ్
వద్దన్నా నను ముద్దాడేస్తావ్
ఓ వనితా
జగన్మాతా
విశ్వవిజేతా
నీ చనుబాల గ్రోల
హరిహర బ్రహ్మలూ
అయినారమ్మా నీ ఒడిలో
పసిపాపలుగా వారు
నే నెంత ?నీ ప్రేమ ఘన సాగరమంత
అందుకే ఈమోహం అంటా
అందుకే సోహం అంటా
దాసోహం అంటా
సదా సోహం అంటా
నీ దాస దాసోహం అంటా

Friday, January 8, 2010

కలల చెలీ!

ఒక్క చినుకైనా రాలదేం?
మేఘమాల కొలువున్నా...
ఒక్క పూవైనా పూయదేం?
మధుమాసం తానున్నా...
చిరు వెలుగైనా ప్రసరించదేం?
వెన్నెల కాస్తున్నా...
ఏ హృదయం స్పందించదేం ?
కవితలెన్నొ రాస్తున్నా..
ఓ నా కలల చెలీ!
నువు లేక నా బ్రతుకే సున్నా...
ఓ నా ఊహా సుందరీ!!
నీ కొఱకే నే జీవిస్తున్నా...

Thursday, January 7, 2010

ప్రేమకోసమే!

నిధుల కోసం వెతుకుతుంటే
సమాధులైనా త్రవ్వాలికదా
గులాబి కోరి త్రెంచుతుంటే
ముళ్ళు గ్రుచ్చినా నవ్వాలి సదా
మొగిలి రేకులే ఆశిస్తే
సర్పాలకైన వెరవొద్దు
రాజకుమారే కావాలంటే
సాహసాలు నువు మరవొద్దు
ప్రేమలోకమే నీదనుకొంటే
విరహాలనైన నీవు సైచాలి
ప్రేమకోసమే నీవనుకొంటే
త్యాగాలకైన చేయి సాచాలి

Tuesday, January 5, 2010

ఎంత కష్టమొ అంత ఇష్టం!

ఎంత కష్టం ఎంత కష్టం
మనసులోని భావమంతా
బయట పెట్టుట ఎంత కష్టం
గుండెలోనా దాగివున్నా
గుట్టు విప్పుట ఎంత కష్టం
ప్రకటమైనా భావుకతనే
తెలియ జేయగ భాష కష్టం
ప్రసరింపజేసే యానకముకై
ఎదురు చూచుట ఎంత కష్టం
తెరచుకున్న తెరలొ కూడ
సాంకేతిక పదము కష్టం
ఎందరున్నా నీకు మాత్రమె
ఎరుక పరచుట ఎంతకష్టం
ఎంత కష్టమొ అంత ఇష్టం

Monday, January 4, 2010

లవా!

పుష్పమాలవా
మేఘమాలవా
మణిమాలవా
తులసి మాలవా
కనరాని బాలవా
దహియించు అగ్నికీలవా
సెలవే నా లొ వాలవా
కావే కరుణాలవాలవా

Sunday, January 3, 2010

నిత్య సత్యమే

నమ్మినా నమ్మక పొయినా
సూర్యుడు ఉదయించేది తూర్పుననే
నమ్మినా నమ్మక పొయినా
భూమి ఉండేది గుండ్రంగానే
నమ్మినా నమ్మక పొయినా
మానవాతీత శక్తి ఉనికి వాస్తవమే
నమ్మినా నమ్మక పొయినా
నీపైన నాఅనురక్తి నిత్య సత్యమే

సయ్యాట

లాస్యం తెలియును
హాస్యం తెలియదు
పాటనెరుగుదు
సయ్యాట నెరుగను
సత్యాల దాచలేను
తత్వాల  జోలికోను
ముసుగు లేని మనసే నాది
విసుగురాని వరసే నాది
వడ్డించిన విస్తరి నేను
నే తెరిచిన పుస్తకమేను

ఆచూకి

ఎందాక ఈ దొంగాటలు
ఎందుకీ దాగుడు మూతలు
తొలగిపోదా ఈ గ్రహణం
దూరమవదా_మరణం
కాలం జారి పోనీకు
కలలే కరిగి పోనీకు
ఆచూకి దాచనేల
ఆరాటం పెంచనేల