Saturday, December 23, 2017

"కవితేఛ్ఛ"


కవి నిరంకుశుడు,
భావం ,కవనం, భాష , నిర్మాణం..,ఇదీ క్రమం

లాక్షణీకులు 
మహామహులనే  దుయ్య బట్టారు ,
వాల్మీకి కాళిదాసులనూ వదల్లేదు..,

కవికి
పాండిత్యం,ఛందో బంధాలు 
వ్యా'కరణీకాలు అవసరం లేదు 
కావాల్సింది అనుభూతి చెందే హృది.,
ఏ కవీ లెక్కలు వేసుకొని రాయడు
ఆ లయ ఎద లయలా 
అతని కవితలో ఒదిగి పోతుంది 
చట్రాల్లో ఊపిరాడకనే 
కవి పంజరాలు తెంచుకున్నాడు ,

పాండితీ ప్రకర్ష అంతా 
కవి రాస్తేనే కదా ,
కవనం మీద లెక్కలు వేసుకొని 
పండితులు సూత్రాలు రాసుకొంది,

మనో ధర్మ సంగీతం లానే 
మనో ధర్మ కవిత్వం..,
అమ్మ పాడిన లాలి పాట 
ఏసరిగమలు నేర్చుకొంది,
గొర్లు కాచే పిల్లవాడి పిల్లనగ్రోవి 
ఏ సంగీతం నేర్చు కొంది ,
జానపదం ఏ వ్యాకరణం నేర్చుకొంది,

మనం పిపీలికం
అనుకోవడానికి ఏమీ లేదు,
ఎవరూ స్రష్టలు కాదు
మన ప్రపంచమే 
విశ్వంలో గుర్తించలేనంత,
మనం విర్రవీగితే మూర్ఖత

మనం  నిత్య సాధకులం,
ఎప్పటికీ విద్యాసక్తులం
ఒక్క మాటలో జిజ్ఞాసువులం,
తలకెక్కిన కళ్ళు నేలను చూస్తే ,
తత్వం బోధ పడుతుంది,

నీల్గే నిరసన కన్నా ,
నిర్మాణాత్మక విమర్శ 
అభిలషణీయము,ఆదరణీయము,
అటువంటి వాటికి సదా స్వాగతము!!

No comments:

Post a Comment