Sunday, June 10, 2018


“పిన్నీసు” 

కొన్ని కొన్ని అంతే...
చిన్న చిన్న పాత్రలే
ఎంతో ప్రభావితం చేస్తాయి
కీలకమైన మలుపులు తిప్పుతాయి
నాయకుడికి దిక్సూచీలౌతాయి
కథా రథ చక్రపు సీలలౌతాయి...
ఆయువుపట్టు ఔతాయి
రామాయణం లో జటాయువులా
భారతంలో పాచికలా

గుండీ తెగిపోయి
జారిపోతున్న లాగు(నిక్కర్)కి
రక్షణ గా నిలబడ్డ వైనం
మరపురానిది

చిరుగును మరుగు పరుస్తూ
బిచ్చగత్తె మానం కాచిన విధం
శ్రీ క్రిష్ణుడికి తీసిపోనిది

తెగిన స్లిప్పర్ నాడాకు
చేయూత నందించి ఆదుకొన్నక్షణం
అపురూపమైనది

కాల్లో గుచ్చుకున్న ముల్లును
లాఘవంగా పెరికిన సందర్భం
ప్రశంసార్హమైంది

చెవిలో గులను దూరం చేసీ,
గుబిలిని తీసీ చేసే సేవ
గురుతరమైనది

పచ్చడిలో
మామిడి ముక్క కొరికినప్పుడు
పళ్ళ సందులో ఇరుక్కున్న పీచు
పీచమణచిన నైపుణ్యం కొనియాడదగ్గది

చిన్న పనిముట్టే
ఎంతో పని చేసి పెట్టు
అల్ప సాధనమే
ఎన్నో సాధించి పెట్టు

మగ పిల్లల మొల తాడుకు
ఆడపిల్లల చేతి గాజుకు
అలనాడు ...

‘అని’నాడు సిద్ధమైన యోధుడి
ఆయుధంలా..
సర్వదా కంటికి రెప్పలా కాచే
అంగ రక్షకుడిలా..

వన్నె తరగక
విలువ మారక
పెన్నిధిగా 'కాంటా'(పిన్నీసు)
పేదవాడి బ్రతుకు దారంటా...

చెప్పడానికి లెక్క దొరకని
తెలపడానికి భాష చాలని
పలువిధ ప్రయోజనకారి
ఎన్నెన్నో అవసరాలకు
తానంటూ ముందుకురికే
బహుముఖ ప్రజ్ఞాశాలి
త్యాగశీలి "పిన్నీసు"...!!