Saturday, December 31, 2011

WISH U HAPPY NEW YEAR-2012


కనకమహాలక్ష్మి కాలి అందియల లయ
జ్ఞానభారతి కఛ్ఛపి వీణియ శ్రుతి కలయ
ఆదిపరాశక్తి ఖడ్గ కాంతులు వెలయ
మీ ఇల్లు విజయ దుందుభుల శబ్దాలయ కావాలని మనసారా కోరుకొంటూ_
మిత్రులకు,స్నేహపాత్రులకు,ప్రేమమూర్తులకు..ఆంగ్ల వత్సరాది శుభాకాంక్షలు!!

Wednesday, December 28, 2011

అందమైన బంధం-మన అందరి అనుబంధం

అందమైన బంధం-మన అందరి అనుబంధం

సోదరి నీవన..
నేను ..మచ్చలున్న చుక్కల నెచ్చెలుని అవుతానని..భయం
ప్రేయసి నీవన 
నేను ..మన్మధుడిలా మాడిమసినౌతానని..అయోమయం
అమ్మవు నీవన
నేను వయసుపెంచిన పోకిరినౌతానన్నది..అదో విషయం
మనిషికి మనిషికి మనిషికి మని+షి కి మానవీయ బంధమే కదా అందం..
నేస్తం ! స్నేహాన్ని మించిన అనుబంధం వేరే లేనే లేదన్నది.సదా నిర్వివాదం!!

Saturday, December 17, 2011

పుణ్యకాలం


పుణ్యకాలం
ఎదురుగా ఉన్నప్పుడు
ముఖం తిప్పుకొంటావ్...
కవ్వించడానికి ఎదురొచ్చి మరీ
తప్పుకుంటావ్....

నేలరాలిన స్మృతుల
పూలనేరుకొచ్చి
మాల కడతావు
ఎందుకో ఏర్చి కూర్చి..

వసంతాల సాయంతో
ఋతు రాగాలు వినిపిస్తావ్..
కోకిలల నెయ్యంతో..
కోటి రాగాలనాలపిస్తావ్...

పదాల పొదల మాటున
సయ్యాటలాడుతుంటావ్...
కవితల జలతారు పరదాల
దోబూచులాడుతుంటావ్...

గుండెని తట్టిచూడడం..
మనసుని పట్టి చూడడం..
బుంగమూతి పెట్టి మరీ
ఆకట్తుకోవడం..నీకంటే..తెలిసినవారెవరున్నరనీ...

నీకు తెలుసు...
నిజంగా నాకూ తెలుసు..
ముద్రపడిన స్నేహ చిత్రం..చెదిరిపోదనీ...
ఆరాటపడే మనోనేత్రం..నిదురపోదనీ...

అలసిపోయా నేస్తం..!
నీ చేతిలో ఓడిపోయా..
నీ గెలుపుకోసం..ఎప్పుడూ ఓడిఫోతూనేఉంటా..
నిను గెలిపించాలని ఆరాట పడుతూనే ఊంటా...

నేస్తం !కాసింత నవ్వుకొందాం..
కరిగిపోతున్న కాలాన్ని ఇకనైనా జుర్రుకొందాం..!!


Monday, December 5, 2011

ప్రతి క్షణం-విలక్షణం


ప్రతి క్షణం-విలక్షణం
నిరక్ష రాస్యుడనే
నీ రక్ష కోరితినే....
తీక్షణంగ వీక్షించకు...
ఏ క్షణమూ నను ఉపేక్షించకు-
మౌనవ్రత శిక్ష వేస్తు
కక్ష తీర్చుకోకె నాపై...
స్నేహమొకటె లక్ష్యం మనకు
కవితలోనె మోక్షం మనకు..
క్షమలోన నీవు ధాత్రివి
ధీరత లో క్షత్రియ పుత్రివి....
దక్షతలో  దక్ష పుత్రివి...
వరములిచ్చు అక్షయ పాత్రవి...
నా పలుకులు అక్షర సత్యం..
అనుక్షణం నీ స్మరణే నిత్యం..!!





స్త్రీ ..ఓ మిస్ట్రీ...!!


శ్రమ పడి రాయిని శిల్పంగ మలవొచ్చు
నేర్వగ వీణతొ రాగాలు చిలకొచ్చు
నదులకు ఎదురీది చరితను సృజియించవచ్చు
నారీ నీమది నెఱుగగ/గెలవగ నరులకు సాధ్యమే..?


Friday, December 2, 2011

అంతరంగ అంతరార్థం


అంతరంగ అంతరార్థం
బ్రహ్మకైనా అర్థమౌతుందా నీవాలకం...
అయినా తోసేసినా నీవద్దకే చేరుతుందేం నా హృదయ లోలకం..?
దూరమవ్వలాననుకున్నా దూరమే దూరమౌతుంది గాని-
మనం దూరమవడం ఎలాసాధ్యం...?
మఱచిపోదామన్నా మఱపే మఱుపవుతోంది గాని-
నరనరాల్లో పేరుకపోయిన పేరునెలా మఱవడం సాధ్యం...
భావాలని కూడా( పేటెంట్ రైట్స్) జన్మహక్కుల్లా..నొక్కేస్తే..
అలక్కీ..నోచుకొనే లక్కూడా లేదా.....?
వెంటపడే తుంటరిగా నన్నొంటరి చేస్తుంటే..
వేధించే వెధవాయిలా వాయిస్తుంటే...
గోడు వెళ్ళబోసుకొనే తోడూ నీవే కాదా..??
ఇరువైపులున్న చక్రాల ఇరుసేకదా..స్నేహం..!
ఎరిగి ఉండీ ఎరగనట్టెందుకు నటియిస్తావు..నేస్తం???

Saturday, September 24, 2011

సాదర ఆహ్వానము!

సాదర ఆహ్వానము!
ఈ రోజు(25-09-2011) కరినగర్ మాతా మహా శక్తి మందిరం లో
నా ఆడియో సి.డి.”దయామృతవర్షిణి”(మహాశక్తి భక్తి గీతాలు) ఆవిష్కరణ కలదు
అందరూ అహ్వానితులే! !సమయం:ఉదయం 10.00
_రాఖీ

Monday, August 22, 2011

వర్ణ మాల-నీ మెడలో ఈ వేళ

వర్ణ మాల-నీ మెడలో ఈ వేళ

అక్షర మాల-నీ మెడలో ఈ వేళ
మిత్రమా నా మనోనేత్రమా
స్నేహమా నా తీరని దాహమా
నేస్తమా ఓ నా సమస్తమా
ప్రియతమా నా స్వగతమా
చెలియా ఓ నా గుండెలయా
సఖియా నా హృదయ వీణియా
నా అర్థము నీవే
నా ఆశవు నీవే
నా ఇఛ్ఛవు నీవే
నా ఈడేరని కోర్కెవు నీవే
నా ఉన్నతి నీవే
నా ఊపిరి నీవే
నా ఊహవు నీవే
నా ఊసులు నీవే
నాలో ఋష్యత్వము నీవే
నా ౠకవు నీవే
నా కలవు నీవే
నా కలము నీవే
నా ఖడ్గము నీవే
నా ఖేదము నీవే
నా గారాబము నీవే
నాలో ఘర్షణ నీవే
నా చిత్తము నీవే
నా ఛత్రము నీవే
నే చేసే జపము నీదే
నా జ్ఞానము నీవే
నా పాలిటి ఝషము నీవే
నాకెదురైన టక్కరి నీవే
నాకు గుణ పాఠము నీవే
నా డాబువు నీవే
నా ఢంబము నీవే
నా ప్రేరణ నీవే
నా తపన నీవే
నా మనోరథము నీవే
నాకు దగ్గర నీవే
నా ధార్మికత నీవే
నా నందము నీవే
నా పరవశమీవే
నా తపః ఫలము నీవే
నా బాధ నీవే
నా భయము నీవే
నా మంత్రము నీవే
నా యజ్ఞము నీవే
నా రాగము నీవే
నా లౌక్యము నీవే
నా వేదము నీవే
నా శస్త్రము నీవే
నా షడ్రుచులు నీవే
నా సహనము నీవే
నా మనోక్షేత్ర హలము నీవే
నాలోని లలిత కళలు నీవే
నా క్షమయా ధరిత్రి నీవే
నా కొఱక రాని కొయ్యవు నీవే
మిత్రమా నా మనోనేత్రమా
స్నేహమా నా తీరని దాహమా
నేస్తమా ఓ నా సమస్తమా
ప్రియతమా నా స్వగతమా
చెలియా ఓ నా గుండెలయా
సఖియా నా హృదయ వీణియా
ఓ ఉత్పల మాలా
ఓ చంపక మాలా
ఓ వైజయంతి మాలా
ఓ మణి మాలా
ఓ మేఘ మాలా
ఓ వన మాలా
ఓ మల్లె మాలా
ఓ గీత మాలా
ఓ జప మాలా
ఓ రత్న మాలా
ఓ పుష్ప మాలా
ఓ మధు మాలా
ఓ నక్షత్ర మాలా
ఈ వర్ణ మాల-నీ మెడలో ఈ వేళ !! !! !!

Thursday, August 18, 2011

క్షణం-లక్షణం

క్షణం-లక్షణం

నిన్న ఒక కల
రేపు అనేది ఒక ఆశల వల
నిజమెరుగకుంటే బ్రతుకే వలవల
మనసే విలవిల!

గతం ఒక అనుభూతి
భవిష్యత్తు ఊహా కృతి
తెలిసుకోకుంటే ఈ సంగతి
జీవితమే దుర్గతి
మనుగడయే అధోగతి!!

ఈ క్షణం
పట్ల వీక్షణం
ఉండడమే సులక్షణం
అపుడిక ఆనందమయమే క్షణక్షణం!!!

Saturday, August 13, 2011

రాఖీ పూర్ణిమ రక్షాబంధన దినోత్సవ శుభా కాంక్షలతో..రాఖీ.

నా చెల్లి - బంగారు తల్లి

నా చెల్లి
అందాల జాబిల్లి
చల్లని పాలవెల్లి
మమతా మధురిమల మల్లి
నా లాభం-క్షేమం కోరే కల్పవల్లి
నా సోదరికి రక్షనీవె సంతోషి తల్లి(మాత)
వేడెద సదా నీ పాదాలకు ప్రణమిల్లి !!

Friday, August 12, 2011

చుట్టూ చీకటిని తిట్టకు-నిన్ను నీవు తిట్టుకోకు
ప్రయత్నించి చిరు దీపం వెలిగించుకో
కనీసం కన్నులన్నా మూసుకో
అప్పుడు బయటా లోపల చీకటి
లోపలి చీకటిని తరిమేయడం
నీకు రెండు విధాలా సుసాధ్యం
ఆత్మజ్యోతి వెలిగించగలిగినా
స్వప్నలోకాల్లో విహరించ గలిగినా
ఎంతకు రాని గమ్యం గురించి చింత వీడు
పయనమే రమ్యమనే భావం తో చూడు
వేచి ఉండాల్సి వచ్చినపుడు విసుగు చెందకు
నీవు నీతో గడప గలిగినందుకు సంతసించు
కొత్తపరిసరాలతో ఇమడలేక బాధ పడకు
ఇసుకలో తైలం తీసి అభినందనలందు
అడవిలో కుందేలుని చూసి ఆనందం పొందు
అనుభవించ గలిగితే అంతా ఆనందం
భయపడితే బ్రతుకే విషాదం!!

Tuesday, August 9, 2011

ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు

ప్రేమసమరం

తూర్పున నేను
పశ్చిమాన నీవు
భూగోళానికి ఇరువురం చెరోవైపు
అందుకే అందదు మనకు మనవీపు
అయినా తీపులకై చేతులు చాపు
ధృవాలు వేరు ఉత్తర దక్షిణాలు
అందుకేనేమో ఈ ఆకర్శణాలు
దృక్పథాలు వేరు ఎడ్డెమంటె తెడ్డెమనడాలు
ప్రేమసమరంలో అవసరమా ఖడ్గమూ డాలు
వాయింపుకు భిన్నంగా రెండురకాలుగా మ్రోగే డోలు
ఎప్పుడైనా పయనంలో మనచేతులు చెట్టపట్టాలు
కలిసిసాగుతున్నా కలుసుకోలేని రైలు పట్టాలు
భేషజాల భావజాలం –ఒకరులేక ఒకరం మనజాలం!
బ్రతుకే ఇంద్రజాలం-అంతర్జాలంలా మయాజాలం!!

Saturday, August 6, 2011

మిత్రులందరికీ మైత్రీ దినోత్సవ శుభాకాంక్షలు!!

నా మతం –స్నేహితం

స్నేహితమంటే-
ఎదుటివారి నుండి ఏదీ కోరుకోకుండా ఉండగలగాలి
ఎదుటివారికి ఏదైనా ఇవ్వగలగాలి
స్నేహితమంటే-
మనం ఏదైనా అడిగి తీసుకోగలగాలి
ఎదుటివారు అడగకముందే తీర్చగలగాలి
స్నేహితమంటే-
స్వేఛ్ఛ –స్వఛ్ఛత
ఇఛ్ఛ-స్పష్టత
స్నేహితమంటే-
సముద్రంకాదు చుట్టూ నీరున్నా దాహం తీర్చకపోవడానికి
ఎడారికాదు నిరాశా నిట్టూర్పులే మిగల్చడానికి
స్నేహితమంటే-
జీవనది ,తను ఎంతైనా ఇవ్వగలిగేది ఏదీ ఆశించకుండా
మనకెంత లభించనా కొంతే పొందగలిగేది
స్నేహితమంటే-
మిత్రుడు(సూరీడు), వెలితురూ వెచ్చదనం ఇస్తాడు
కొంతవరకే తగినంత వరకే సహించగలం
స్నేహితమంటే-
గాలి ,చల్లగాలి తప్పని సరి ,తుఫాను ముప్పేమరి
స్నేహితమంటే-
భూమాత ,మనని ఓపికగా భరించగలుగుతుంది
భూకంపం రానంతవరకు
స్నేహితమంటే-
ఆకాశం ,అది ఉన్నట్టుగా భ్రమింపజేసే శూన్యం
అదే లేనట్టుగా మాత్రం భావించలేం
స్నేహితమంటే-
అచంచల విశ్వాసం-మూఢనమ్మకం కాదు
దైవం-దెయ్యంకాదు
స్నేహితమంటే-
అవధులు లేనిది,పరిధులున్నది
వ్యవధులు లేనిది ,పరిమితులున్నది
స్నేహితమంటే-
బంధాలకు చెందనిది అతీతమైనది
భావాలకు అందనిది అందమైనది
స్నేహితమంటే-
ఎంతచెప్పినా తక్కువే మరి
ఎంత చెప్పకున్నా తక్కువా? అది గడసరి
సృష్టిలో తీయ’నిధి’తీయనిదీ స్నేహమేనోయి!
సృష్టిలో ’మాయ’నిది మాయనిదీ స్నేహమేనోయి!!

Thursday, August 4, 2011

విను విను విన్-విన్ లా

విను విను విన్-విన్ లా

కడలివి నీవు
సాహసి నేను
ఎన్నిసార్లు ముంచినా
ఎదలోతుల శోధన నాపలేను
ఎన్నిసార్లు విసిరేసినా
అవతలి గట్టెక్కే వరకు ఈ(త) సాధన మానుకోను
కరుణిస్తావో-కాలానికే వదిలేస్తావో
నన్ను గెలిపించి గెలుస్తావో(విను విను విన్-విన్ లా)!
అగాధ జలధి అట్టడుగున సమాధి చేస్తావో!!

శుభోదయం !!

శుభోదయం !!

ప్రతి ఉదయం
శుభోదయం !!
కోరు కొంటోంది నా హృదయం!!
ప్రతి సమయం
కావాలి రసమయం
జీవితం సదా ఆనందమయం
చేసుకోలేకుంటెనే విస్మయం
అనునయం
ఆశించే నయనం
అవుతుందెందుకు అశ్రుమయం
గాజు బొమ్మలైనా
కొయ్యబొమ్మలైనా
మట్టి బొమ్మలైనా
తోలు బొమ్మలైనా
ఆడేవాడు ఆడించేవాడు
వాటిని వాడు వాడు
ఎల్లప్పుడు కాపాడుతాడు
అందుకే కడతాడు వాటి మధ్య ఏదో తాడు
ఊగే ఊయల తాడు కారాదు ఉరితాడు
పాడె గా మారకూడదు పాడే వాడు
అందుకే నేస్తం !
అందుకో సమస్తం!!
మానవ జన్మే ప్రశస్తం!!
చేజారనీకు స్నేహ హస్తం!!
చేసేయి మధుర స్మృతులను మదిలో నిక్షిప్తం!!!

Wednesday, August 3, 2011

“తుమ్మెద ఎద వేదం”

“తుమ్మెద ఎద వేదం”

నీ గుండె కరిగేటందుకు
నే చేస్తా నాద యజ్ఞం!

నీ మనసు గెలిచేటందుకు
రాసేస్తా రసమయ కావ్యం

నిను మైమరపించేటందుకు
నేనందిస్తా అనురాగ పరపరాగం

నీ అన్వేషణలోనే
బలిచేస్తా నా సర్వస్వం

గ్రహించవెలా ప్రణయ తత్వం
అనుగ్రహించవెలా ఈ ప్రేమ పిపాసిని సైతం

పారిజాత పరిమళమేకదా నిత్య దైవత్వం!
దైవమే నీవైనప్పుడు మరతువెలా దయాపరత్వం

భ్రమర-సుమాల బంధం…
బ్రహ్మ సృష్టికే-
సత్యం శివం సుందరం!!!

Wednesday, July 13, 2011

“కలగాపులగం”

“కలగాపులగం”

ఊహలొ నువు ఊరించిన గాని
కుంచెతొ నిను దించా - చిత్తరువులొ బంధించా

తలపులొ నువు మెరిసినగాని
తాపసినై నిను ధ్యానించా - తన్మయమే నే చెందా

కలల్లోన నువు కవ్వించిన గాని
కవితలోన నిను మలిచా - ప్రేమికుడిగ నేగెలిచా

కనులముందు నిలిచావా
కలవరమే అనుకోనా – కలవరమైందనుకోనా

చెమరించగ నా కనులే- చిత్రంగా చిత్రమే చెరిగిపోయే

పెరిగిన నా ఎద సవ్వడికే- వింతగా తపోభంగమైపోయే

గీతమాలపించబోగా- గొంతుపెగలదేమాయే అది నీ మాయే

చెలీ నువు కలవా!- నిజముగ కలవా?-ఎదలో వాలవా?!

Friday, July 1, 2011

"అ(దా)(సో)హం"

"అ(దా)(సో)హం"

ఇంట్లో బయటా
ఒంట్లో ఎదుటా
గదిలో మదిలో
నీలో నాలో
లోలో అంచుల్లో అగాధాల్లో
పైపై గాల్లో మేఘాల్లో
అణువులో అంతరాళంలో
అంతరంగంలో అంతరిక్షంలో
పంచభూతల్లో పంచేంద్రియాల్లో
అంతటా అన్నిటా
ఉన్నది నేనే కదా!
ఇంకా బయటపడే మార్గమున్నదా!!
ఆ అవసరము అనవసరమే సదా!!!

Saturday, April 2, 2011

స్నేహితులకు ,బ్లాగు మిత్రులకు -వీక్షకులకు, కవితాభిమానులకు ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

స్నేహితులకు ,బ్లాగు మిత్రులకు -వీక్షకులకు, కవితాభిమానులకు ఖర నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!!

ఈ“ఖర” ఆఖరా?!

ఈ“ఖర” ఆఖరా?!

కోయిలా కూయవేల? రాయిలా మౌనమేల?
ఉగాది రాలేదనా? రాదేలనా!
మామిడమ్మ చివురేయలేదనా, మల్లి చెల్లి పూయలేదనా
చింత కాయకుంటే ఎందుకంత చింత?
మన్మధుడు చెఱకును విల్లుకై ఎత్తుకెళ్లాడనా !
మమకారాలు కరువయ్యాయనా!
నీ పాట జనం మరి’చేద’య్యిందనా!
పర్యావరణముప్పు వల్ల కన్నీటి ఉప్పూ కరువయ్యిందనా!!
ఇది తెలంగాణాకు మరో దగాదనా
ప్రభుతకు దిగాదనా
వికీలీకులు- టుజీ స్కాంలు- నల్లధనాలు-కృష్ణ కమిటీ నయవంచనలు
పెట్రేగిన సెగాదనా
సునామీల అణుధారికతల అతలాకుతలమైన
జపనీయుల దుఃఖగాద మరి చేదనా
కాలాంతానికి ఈ “ఖర” ఆఖర నా


ఏ’దోనీ’ దయవల్లో సచినాడిన ప్రతిభ వల్లో
యువరాజు పటిమ వల్లో జహీర్ బంతి మెరుపులవల్లో
వీరలెవల్లో ఆడిన పరుగుల సెహవాగువల్లో ,
టీమిండియా పట్టుదలవల్లో శత ఏకవింశతి జనభారతి ప్రీతి వల్లో
సిక్సరుచుల తో,బౌండరీలతో ప్రపంచ టీములన్నిటినీ దంచి పచ్చడి చేసి
అందించిన ప్రపంచ క్రికెట్ ’కప్పు’ నీ ముందుంది.
అస్వాదించు ఆనందించు అది అందరికీ పంచు
అదే నీ మనోబలంపెంచు-విజయగానమిక వినిపించు

ఎందుకు నేస్తం?ఈ బేలతనం
పాడవే కోయిలా.. పాడుకో యిలా....
ప్రకృతికే నేస్తంలా..పాటే సమస్తంలా...
--రాఖీ---9849693324

Monday, March 7, 2011

ఆకు-నీకు-బహుపరాకు!

ఆకు-నీకు-బహుపరాకు!

ఆకు-నీకు-బహుపరాకు!
ఆకు-పడబోకు నీపై నీవే చిరాకు!!
నీవు లేకుండా క్షణం గడవదు మాకు-మ్రాకుకు

విశ్వమంతా కాలగర్బంలో కలిసిపోయినా
జగమంతా జలప్రళయంలో లయమైపోయినా
నీవు-నీపై యోగనిద్రలో పరమాత్ముడు(వతపత్రశాయి)
ఉందనే ఉంటారుకదా!
నీవుంటెనే మాను(చెట్టు) మాను(మనోహరము)కదా
నీవులేకుంటే అది మోడే సదా!!
గణపతికి గరిక పోచలే ప్రియతమాలు
పశుపతికి బిల్వపత్రాలే సుపూజితాలు
తాటాకుతోనే తరతరాల సాహితీ సంపదలు
తమలపాకుతోనే అందాలు బంధాలు
ఒప్పందాలు సంబంధాలు!!
మామిడాకు కడితేనే ఇంటికి పండుగ
విస్తరాకున వడ్డిస్తేనే కడుపు నిండుగ
కోయిలకాపాటలు నీపల్లవాల వల్లేకదా
మూడునాళ్ళ ముచ్చటలు,మురిపాలు
పైపై మెరుగులు పూలసొత్తు !
కాని నీ సేవలకు తలవొగ్గు సర్వంసహా జగత్తు!!
ఉన్నంతకాలం
తిండివై నీడవై
మందువై మాకువై
నేలరాలినా నలిగి నాని
సేంద్రియ ఎరువై
తల్లి ఋణం తీర్చుకొనే
నీ విభవం అమోఘం,అప్రమేయం
నీ త్యాగం శ్లాఘనీయం!
మానవాళికి ప్రాణవాయువు నీ భిక్ష
జీవకోటికి నీవే కదా శ్రీరామ రక్ష!!
ఆకు-నీకు-బహుపరాకు!!!

వి’చిత్రం’

వి’చిత్రం’

వీ’క్షణము’లో ప్రణయమే ఉదయిస్తే
హృదయానికి అనుక్షణం యాతన!
హృదయంలో విరహమే జనియిస్తే
నయనానికి అహరహమూ వేదన!!

Thursday, January 20, 2011

“ఎక్స్ ప్లాయ్ టేషన్”

“ఎక్స్ ప్లాయ్ టేషన్”
సాకు- బాకు అవుతుంది నా దేశంలో...
బహీనత- వజ్రాయుధమవుతుంది నా దేశంలో-

మరణాలేవైనా మార్గం సులభతరం చేస్తాయి –మాకు ఉపకరణాలై...
ఆత్మహత్యలేవైనా మారిపోతాయి- మాకు తిరుగు లేని అస్త్రాలై...

కేజ్ లు..లింకేజ్ లు..పై పై మసాజ్ లు
మాఫీలు.. మద్దతులు..మడతపేచీలు కుచ్చు టోపీలు
కంటి తుడుపులన్నీ..కపట నీతులు..కుటిల గోతులు
మేమేం తక్కువ తిన్నమా.. మేం మాత్రం వెధవాయిలం అనుకొన్నావా
ఊరడింపుచర్యలు బ్లాక్ మెయిలింగ్ల్ లై రొమ్మువిరుచుకొంటాయి....
రాయితీలు తేఱగా దొరికే తాయిలాలుగా రూపు మార్చుకొంటాయి..
రిజర్వేషన్లు జన్మహక్కై రాజ్యమేలుతుంటాయి-
సబ్సిడీలు తాత సొమ్మై సోమరితనం పెంచుతుంటాయి..
ఓట్లు వక్రమార్గాల అక్రమాలు నేర్పుతుంటాయి
హక్కులు రెక్కలువిప్పుకొని విశృంఖలంగా సొమ్ముచేసుకొంటాయి

పురుషాధిక్యం
పేదరికం
నిరక్ష్యరాస్యత
వెనకబాటుతనం
కులాలు
మతాలు
అవకరాలు
అవలక్షణాలు
అజ్ఞానం
ఏదైనా కావచ్చు ప్రతిదీ ఓ చిచ్చు!!
అన్నీ అర్హతలే నాదేశంలో-“ఈజీ మనీ” కి
అన్నీ అవకాశాలే నాదేశంలో-“లేజీ మాన్ ”కి

ఇది విషవలయం-ఎవరిని ఎప్పుడు ముంచేస్తుందో
ఇది తేన తుట్టే-కదిపితే ఎవరిని కబళిస్తుందో
ఇది పులిపై స్వారీ- దిగితే ఎవరిని మ్రింగేస్తుందో
అందుకే వీటిని ఇలాగే ఉండనిస్తారు...
వీటిని ఇంకా ఇంకా పెంచి పోషిస్తారు..
రోగికోరేదీ కమ్మని తీయని మందే..! వైద్యుడు ఇచ్చేదీ జబ్బు మానని మందే..!!
ఉన్నతమైన స్వావలంబనకు ఎన్నడూ ఊతమీయరు..
ఉదాత్తమైన సాధికారతకు ఎప్పుడూ పట్టం కట్టరు...
వీటిని పెంచి పోషిస్తేనే- రాజకీయ మనుగడ !
కాదుపొమ్మంటే అమ్మో-నిత్యం రగడ !!
ఎవరిస్థాయిలో వాళ్ళు...
ఎవరికందినంత వాళ్ళు...
దోచుకున్న వాడికి దోచుకున్నంత మహదేవా
గుంజుకున్న వాడికి నంజుకుంన్నంత నారాయణా
నిస్సహాయంగా,అశక్తతతో,దీనంగా,బ్రతుకు దుర్భరమై
ప్రకృతి వైపరిత్యనికో విధి విలాసానికో ఎదురీదలేక
కొట్టుమిట్టాడే జీవికి తిరిగి నిలద్రొక్కు కోడానికి
అందించే చిరుసాయం-!
అదే అదనుగా,అదే ఆసరగా, అదే అవకాశంగా ఎగబడే
బాగా బలిసిన డేగలు,కందిరీగలు
రాబందులు,పందులు,
నక్కలు, పంది కొక్కులు,
గబ్బిలాలు ,గుడ్లగూబలు
నోటికాడి కూడు తన్నుకపోయే మాయోపాయం-!!
పథకాలకు తిలోదకాలు..
సిద్ధాంతాలకు పిండ ప్రదానాలు...
ప్రగతికి తగ్గని విరోచనాలు..!!!

-రాఖీ