Saturday, January 30, 2010

ఓ స్త్రీ !

ఓ స్త్రీ !
ఓ నారీ, ఓ ఇంతీ,
ఓ ముగ్ధ, ఓ ముదితా ,ఓ మగువా, ఓ మహిళా
ఓ అతివా ,ఓలలనా,ఓ వనితా,ఓతరుణీ
ఓ కలికీ ,ఓ కోమలీ, ఓ పడతి, ఓ సుదతీ
తల్లివో ,చెల్లివో, పాలవెల్లివో, కల్పవల్లివో
అమ్మవో ,పూల కొమ్మవో,అక్కవో తేనె చుక్కవో
ఎందుకమ్మా మమ్మల్ని ఇలా అలరిస్తావు,ఊరిస్తావు ,ఉడికిస్తావు
ఎందుకమ్మా మాకు ప్రాణం పోస్తావు
మమ్ము మాలిమి చేస్తావు
నీ మురిపాలలో ముంచేస్తావు
నీ సహచర్యం లో లాలిస్తావు
నీ అనురాగంతో తడిపేస్తావు
సూరీడు చుట్టూ భూమిలా
మా జీవితమంతా నీ నీడలా మేమిలా
నీ వెంటే ఉంటాము-నీ చుట్టే తిరుగుతూ ఉంటాము
ఎందుకమ్మా మమ్మల్నిలా ప్రభావితం చేస్తావు
ఎందుకమ్మా మమ్మల్ని ప్రలోభ పెడతావు
మాకు జ్ఞానం కలుగ జేస్తావు
మా చేయి పట్టి నడిపిస్తావు
గోరు ముద్దలు కుడిపిస్తావు
ఏదోలా మంత్ర ముగ్ధులను చేస్తావు
ఏదొ మాయలో పడదోస్తావు
మా కింకే ప్రపంచమూ తెలీదు
మాకు మరింకే ధ్యాసా లేదు
కుసుమం చుట్టూ భ్రమరంలా
చంద్రిక కొరకై చకోరం లా
మేముంటే –మైమరచి పోతుంటే
మాలో లోలోఅంతానీవై నిండిపోతావు
మా సత్యాన్వేషణ మా నిత్యాలోచన
అన్నీ నీవై ఉండిపోతావు
పిచ్చివాళ్లను చేసేది నీవే
మెచ్చి మెళ్ళో దండ వేసేది నీవే
ఎందుకమ్మా ఇలా మామది దోస్తావు
ఎందికమ్మా నీ మది దాస్తావు
త్యాగం నీరూపంటారే
అనురాగం నీ తీరంటారే
ఓ స్త్రీ !
ఓ నారీ, ఓ ఇంతీ,
ఓ ముగ్ధ, ఓ ముదితా ,ఓ మగువా, ఓ మహిళా
ఓ అతివా ,ఓలలనా,ఓ వనితా,ఓతరుణీ
ఓ కలికీ ,ఓ కోమలీ, ఓ పడతి, ఓ సుదతీ
తల్లివో ,చెల్లివో, పాలవెల్లివో, కల్పవల్లివో
అమ్మవో ,పూల కొమ్మవో,అక్కవో తేనె చుక్కవో
ఏదేమైనా
నీ తోనే మా జీవితం!
నీకే మేమంకితం !!!

Friday, January 15, 2010

సత్య శివ సుందరీ!

దశావతార ధారిణీ దైత్య సంహారిణీ
నవరస సరస పోషిణీ-జగన్మోహినీ
అష్టైశ్వర్య ప్రదాయిని-నాద వినోదిని
సప్త వ్యసన వినాశినీ –దుర్గా భవానీ
అరిషడ్వర్గ భయంకరీ-శాంకరీ
పంచ భూత సంజాతిని-భువనైక సుందరీ
చతుర్వేద సారాంశినీ-శ్రీ వాణీ బ్రాహ్మిణి
సత్వరజస్తమో త్రైగుణ్యీ- బాలా త్రిపుర సుందరీ
ద్వైదీ భావ మాయామోహినీ-ఇహపరదాయినీ
సత్య శివ సుందరీ-రాఖీ రస మంజరీ
నిత్యమోక్ష ప్రదాయిని ఓంకార రూపిణి
అమ్మా నీకిదె సాష్టాంగ వందనం
వేయవమ్మా నీతోనే నా బంధనం

Tuesday, January 12, 2010

ఆ”విరి”

నేల దిగిన మేఘాలు -అందాల నీ కురులు
చూస్తుంటే వేస్తున్నాయి-నాకే అవి ఉరులు
సవరించ పూనితె ఆ ఘన ఘనాలు
అటు హిమవన్నగాలు!
ఇటు మేరు జఘనాలు!!
నేనెలా వేగను-నా హృదయ ఆవిరి సెగలో
నిలవగ నే విరినై –సదా నీ సిగలో

Monday, January 11, 2010

కవిని నేను!

చిగురాకు నేను
చిరుగాలికే మైమరచేను
ఏకాకి నేను
చిరు స్పర్శకే పులకరించేను
అనాధను నేను
చిరునవ్వుకే పరవశమౌతాను
బీడు భూమి నేను
చిట్టి చినుకుకే అనందం తట్టుకోలేను
ఎండిన మోడు నేను
ఆమని కై అర్రులు చాస్తాను
ఎడారి బాటసారి నేను
ఒయాసిసుకై పరితపించి పోతాను
పసి వాణ్ణి నేను
చేర దీస్తే ఆశగా చేతులు సాచేను
చకోరి నేను జాబిలికై జాలిగ చూస్తాను
కవిని నేను
కాసింత ప్రశంస కే ఉత్తుంగ తరంగమై ఉప్పొంగుతాను
ఏమిచ్చుకోను అభిమానులందరికీ
శిరసు వంచి నేను సదా అభివాదమంటాను

Saturday, January 9, 2010

మోహం-దాసోహం

నీ ప్రేమ కొరకె బ్రతికేస్తున్నా
కాదంటే వెంటనె ఛస్తా
మరోజన్మ జన్మ ఎత్తైనాసరె
నీ కడుపున కొడుకై పుడతా
అప్పుడెలా దూరం చేస్తావ్
వద్దన్నా నను ముద్దాడేస్తావ్
ఓ వనితా
జగన్మాతా
విశ్వవిజేతా
నీ చనుబాల గ్రోల
హరిహర బ్రహ్మలూ
అయినారమ్మా నీ ఒడిలో
పసిపాపలుగా వారు
నే నెంత ?నీ ప్రేమ ఘన సాగరమంత
అందుకే ఈమోహం అంటా
అందుకే సోహం అంటా
దాసోహం అంటా
సదా సోహం అంటా
నీ దాస దాసోహం అంటా

Friday, January 8, 2010

కలల చెలీ!

ఒక్క చినుకైనా రాలదేం?
మేఘమాల కొలువున్నా...
ఒక్క పూవైనా పూయదేం?
మధుమాసం తానున్నా...
చిరు వెలుగైనా ప్రసరించదేం?
వెన్నెల కాస్తున్నా...
ఏ హృదయం స్పందించదేం ?
కవితలెన్నొ రాస్తున్నా..
ఓ నా కలల చెలీ!
నువు లేక నా బ్రతుకే సున్నా...
ఓ నా ఊహా సుందరీ!!
నీ కొఱకే నే జీవిస్తున్నా...

Thursday, January 7, 2010

ప్రేమకోసమే!

నిధుల కోసం వెతుకుతుంటే
సమాధులైనా త్రవ్వాలికదా
గులాబి కోరి త్రెంచుతుంటే
ముళ్ళు గ్రుచ్చినా నవ్వాలి సదా
మొగిలి రేకులే ఆశిస్తే
సర్పాలకైన వెరవొద్దు
రాజకుమారే కావాలంటే
సాహసాలు నువు మరవొద్దు
ప్రేమలోకమే నీదనుకొంటే
విరహాలనైన నీవు సైచాలి
ప్రేమకోసమే నీవనుకొంటే
త్యాగాలకైన చేయి సాచాలి

Tuesday, January 5, 2010

ఎంత కష్టమొ అంత ఇష్టం!

ఎంత కష్టం ఎంత కష్టం
మనసులోని భావమంతా
బయట పెట్టుట ఎంత కష్టం
గుండెలోనా దాగివున్నా
గుట్టు విప్పుట ఎంత కష్టం
ప్రకటమైనా భావుకతనే
తెలియ జేయగ భాష కష్టం
ప్రసరింపజేసే యానకముకై
ఎదురు చూచుట ఎంత కష్టం
తెరచుకున్న తెరలొ కూడ
సాంకేతిక పదము కష్టం
ఎందరున్నా నీకు మాత్రమె
ఎరుక పరచుట ఎంతకష్టం
ఎంత కష్టమొ అంత ఇష్టం

Monday, January 4, 2010

లవా!

పుష్పమాలవా
మేఘమాలవా
మణిమాలవా
తులసి మాలవా
కనరాని బాలవా
దహియించు అగ్నికీలవా
సెలవే నా లొ వాలవా
కావే కరుణాలవాలవా

Sunday, January 3, 2010

నిత్య సత్యమే

నమ్మినా నమ్మక పొయినా
సూర్యుడు ఉదయించేది తూర్పుననే
నమ్మినా నమ్మక పొయినా
భూమి ఉండేది గుండ్రంగానే
నమ్మినా నమ్మక పొయినా
మానవాతీత శక్తి ఉనికి వాస్తవమే
నమ్మినా నమ్మక పొయినా
నీపైన నాఅనురక్తి నిత్య సత్యమే

సయ్యాట

లాస్యం తెలియును
హాస్యం తెలియదు
పాటనెరుగుదు
సయ్యాట నెరుగను
సత్యాల దాచలేను
తత్వాల  జోలికోను
ముసుగు లేని మనసే నాది
విసుగురాని వరసే నాది
వడ్డించిన విస్తరి నేను
నే తెరిచిన పుస్తకమేను

ఆచూకి

ఎందాక ఈ దొంగాటలు
ఎందుకీ దాగుడు మూతలు
తొలగిపోదా ఈ గ్రహణం
దూరమవదా_మరణం
కాలం జారి పోనీకు
కలలే కరిగి పోనీకు
ఆచూకి దాచనేల
ఆరాటం పెంచనేల