Saturday, February 20, 2010

పెద విన్నపం

గాలిలో నే కలిసిపోయినా
నీ ఊపిరై నే నిలిచిపోతా
బూడిదగా నే మారినా
నీ భావనలో నే వాసముండెద
సమాధి నేనైపొయినా
నీ స్మృతిలో జీవించెద
మరణమందైనా గాని
ముందే నే చితిని మండెద
నేస్తమా!
ఎన్నటికైనా నా ప్రేమను గుర్తించేవా!!
ఎప్పటికైనా నను నీవాడిగ స్వీకరించేవా!!

Saturday, February 13, 2010

ప్రేమే దైవం!

ప్రేమ గుడ్డిదే గాని
చూడగలుగుతుంది ఎవ్వరూ చూడలేని
చీకటి కోణాలు
అతినీలలోహితాలు
పరారుణ కిరణాలు!

ప్రేమ చెవిటిదే గాని
వింటుంది ఎవ్వరూ వినగలుగని
అతి ధ్వనులు
భరించలేని ప్రతి ధ్వనులు
ఎదచేసెడి వింత సవ్వడులు!!

ప్రేమ కుంటిదే గాని
ఎగరగలుగుతుంది ఎవ్వరు దాటలేని
ఏడేడు సంద్రాలు
ఎక్కడం కష్టమయ్యే ఎవరెస్ట్ శిఖరాలు
చేరడం భారమయ్యే జీవన తీరాలు!!!

ప్రేమ మూగదే గాని
ఎరుకపరుస్తుంది
కవులు రాయలేని కావ్యాలు
భాషకందలేని భాష్యాలు
వర్ణింపజాలని దృశ్యాలు!!!!

ప్రేమకవకరాలెన్నో ఉన్నా
ప్రేమకున్న గొప్పతనమే ఆత్మస్థైర్యము
వైశిష్టతయే మొండి ధైర్యము
దౌర్బల్యమే హృదయ చౌర్యము!!!!!!

అమ్మను ప్రేమను ఎవరూ శ్లాఘించలేరు
అమ్మను ప్రేమను ఎపుడూ త్యజించలేరు
ప్రేమకు జీవరూపం అమ్మ!
అమ్మకు పూర్ణభావం ప్రేమ!!

Friday, February 12, 2010

దేశం-సందేశం

కలము పట్టి కవిత రాసినా
గళము విప్పి పాట పాడినా
కలిగించు ప్రజలందు దేశభక్తి!
రగిలించు ఎదలందు చైతన్య శక్తి!!

Tuesday, February 9, 2010

ప్రకృతి పాఠాలు

నింగితాను చెబుతుంది
ఎలా వంగి ఉండాలో

నేల మనకి నేర్పుతుంది

ఎలా అణిగి మనగాలో

సంద్రమూ తెలుపుతుంది

పరిధెలా దాటకుండాలో

పవనమెరుక పరుస్తుంది

ప్రాణమెలా నిలపాలో........!

Friday, February 5, 2010

“నేనే” మిగలక నీవై పోతా!!

గణపతి నీవై ప్రకటితమైతే-పార్వతి మాతగ నిను ముద్దాడెద
మారుతివై మరి నువ్వెదురొస్తే-రాముడు నేనై అక్కున జేర్చెద
కృష్ణుడు నీవై నను కృప జూస్తే-రాధను నేనై నీలో ఒదిగెద
విద్యాదేవిగ నువ్వగుపిస్తే-బుద్దిగ మేధలొ పదిల పరుస్తా
కాళిక నీవై కన్నెఱ జేస్తే-రామకృష్ణనై ప్రేమగ జూస్తా
గ్రామ దేవతగ ప్రత్యక్షమైతే-దేహం నీకే నే బలియిస్తా
పంచభూతముల ప్రతినీవైతే-పంచప్రాణముల నేనర్పిస్తా
సర్వము నిండిన సత్యా నివైతే –ఆడి తప్పని హరిశ్చంద్రుడినౌతా
తిమిరం మాన్పే గురువీవైతే-సేవలు చేసే శిశ్యుడ నవుతా
ప్రాణంతీసే మృత్యువు వైతే- జీవం పోసే అమృతమవుతా
ప్రళయ కాల రుద్రుడివే నీవైపోతే-ఉమలా సగభాగమై నిలిచిపోతా
నువ్వెలా ఉన్నా సరే-అన్నీ నీవని ఆరాధిస్తా!
నన్నెలా అనుకున్నా సరే-“నేనే” మిగలక నీవై పోతా!!

Thursday, February 4, 2010

క్షణమైనా మనం...!

నాకూ తెలుసు ప్రియతమా...
నన్ను గెలిపించడానికే నువ్వోడిపోతావని...
నన్ను దేవుడిగ మార్చేందుకే నీ గుండియ గుడి చేసావని..!!
కనుమఱుగైన గతం గుర్తొస్తే దుఖః భాష్పాలు...
కనులముందు నిలుస్తే ఆనంద భాష్పాలు....
ఎలాగైనా తప్పవు నయనాల గంగా-యమునల ప్రవాహాలు
దృక్కోణాల కందని దృక్పథం మన మధ్య దిక్చక్రం...!
కలిసినట్లనిపించే ఊహా చిత్రం...!!
పరిచయం అనేది అత్యంత అల్పమైన పదం మనబంధం ముందు..
ఈ అనుబంధం జన్మ జన్మాల పొందు ..పసందు...
అయినా మనసు పంచుకొన్న భావాలు మాటలకెలా అందుతాయి..?
ఏ నిఘంటువులలో దొరుకుతాయి?
వ్యక్తీకరించలేని అనుభూతులు పరవశానికే చెందుతాయి..!
అంతరాంతరాల్లో ఒకటైన మనం...
వేరే అనే భావనలో  మనం మనం..!