Saturday, December 23, 2017

సెక్యు(ల)ర్ డ్ 

భయాన్ని భుజాన వేసుకుని...
ధైర్యాన్ని పులుముకుంటాం...

మేకపోతు మనని చూసే 
గాంభీర్యాన్ని...అలవర్చుకుంటుంది..
కవిత్వం పేలవంగా నవ్వుకుంటుంది..
కవులమైన మనని చూసి..

అడుగడుగునా అభద్రతా భావం...
ప్రతి తాడూ పామైనట్లు
ప్రతి వాడు ఎనిమైనట్లు

దేశమంతా వరదల్లో కొట్టుక పోతుంటే...
సేఫ్టీగా..ఒడ్డున ఉన్న ఫీలింగ్...
భీభత్సంగా  జనం సిన్మా టిక్కెట్ల కోసం 
ఫస్ట్ డే ఫస్ట్ షో కోసం కొట్టుక చస్తుంటే...
రిజర్వేషన్ టికెట్లు చేతిలో గాలికి ఊగుతుంటే
బాల్కనీ అద్దాలనుండి చూస్తూ ఆనంద (?) పడే వైనం...

శృంగారం గురించి రాస్తే...మన పెద్దరికానికి భంగం
విప్లవం ప్రస్తావిస్తే...పోలీసుల తో ప్రహసనం
రాయితీల మాటెత్తితే....విమర్శల రాళ్ళ వర్షం
యే ఇజాన్ని బలపర్చినా ఇతరుల వీరంగం
ఇష్యూల జోలికేలితే...ఇంతే సంగతులు..

అర్థం గాని భావం తో..కాస్త అటూ యిటూ తిప్పి
ఏటో తీసుకెళ్ళి...అర్ధంతరంగా..ఆపేస్తే..రిస్క్ ఫ్రీ..

ఎవరో కవి మిత్రుడు అన్నట్టు..

“ఇక్కడ కష్టాలకు ,జీవితాలకు
అఇష్టాలను పూసి వదుల్తారు రా భయ్...
బాగా బ్రతకటానికా
త్వరగా చావటానికా 
ఎందుకురా అయ్యా ఈ ఎరువులు 
చల్లుకుని బ్రతకటం ....”

నిజమే...మారేడు కాయ కావాలంటే..మసిపూస్తే..సరి
ఎందుకింక కష్టాలు కాకర కాయలు..రోజూ ఉన్నవేగా..
అరాచకాలు..విరోచనాలు..అలవాటేగా..

బ్రతుకు చిత్రం కవితల్లోనూ బ్లాక్ అండ్ వైటేనా
కాస్త కలల కలరద్దుకుంటే పోలా..

వీకెండ్ పార్టీలు..సండేస్ పబ్బులూ...
ఓ గర్ల్ ఫ్రెండ్...ఓ.లాంగ్ డ్రైవ్...
లాక్కుపోదూ ...మనని ఆనందం తనవెంట...
ఎందుకొచ్చిన తంటా..ఈ వివాదాల పెంట

చిన్న చిన్న సంతోషాల్ని చప్పరించుకు సాగుతూ...
ఒకరి వీపు మరొకరం చరుచుకొంటూ..
ఒకరికొకరం భుజం తట్టుకొంటూ..
నాకంటే నాకంటూ .,చంకలెగరేస్తూ..

నిరంతరం నిర్భయంగా...
అనవరతం ఆనందంతో...

No comments:

Post a Comment