Saturday, December 23, 2017

॥రాఖీ॥ మా'నవ'తరం


గాయపడ్డ గుండెకాయ ఎన్నిగండాలను తట్టుకుందో..!
బీడువడ్డ నేలతల్లి ఎన్ని క్షామాలను ఎత్తుకుందో...!!

దారినపోయే ప్రతి దానయ్య కబళించినోడే...
బ్రతుకుతెరువుకొచ్చి పెత్తనం చెలాయించినోడే...

మంచితనానికి ఉండనిస్తే మనమెడలు వంచినోడే
మన బలహీనతలను తనమనుగడకై పెంచి పోషించినోడే

ముక్కలు చెక్కలైన శకలాలను ఎంతకాలం పేర్చుకుందాం!
ఒకేరకమైన గుణపాఠాలను ఎన్నిసార్లని నేర్చుకుందాం!!

తిరిగిరాని గతాలను ఎంతకాలం చిలుక్కుదాం!
మానిపోతున్న వ్రణాలను ఎన్నిసార్లు కెలుక్కుదాం!!

మనది నుండి మాదికి మారిపోయిన సిద్ధాంతం ఎందుకు పురికొల్పుతోంది ఆర్యద్రావిడ అంతర్యుద్ధం కోసం?

కూడగట్టి రెచ్చగొట్టి తరిమికొట్టాలనుకొనే హాస్యాస్పద వాదం
ఎలా ఔతుంది బహుళప్రజామోదం??

రాతియుగాలనాటి వంచన నిజమే కావొచ్చు
మను వాదమో
హరప్పా వేదమో 
కడజాతిగ పీడనలో వాస్తవం గ్రహించవచ్చు

కానీ కాలం ఎలావెనక్కి వెళుతుంది
టైంమిషన్ ఎక్కడం కల్పనే ఔతుంది

నాడు క్షోభకుగరైనవారు,వివక్ష అనుభవించిన వారు 
ఏనాడో గతించిన వారిపై తీర్చుకోలేరుగా ప్రతీకారం

కారకులుకానివారిపై కక్షగట్టుడెందుకు నేటి సమాజంలో సమసిపోతోందిగా ప్రతీదురాచారం

మార్పు ఒక్కరోజులోనే రాదు
ప్రకృతి ఒక్కనాడే పరిణామం చెందదు

అణగదొక్కడం ఆక్షేపణీయమైనప్పుడు 
దాన్ని మనమూ విసర్జించాలిగా

సమసమాజంకోసం అందరం కలిసికట్టుగా గర్జించాలిగా

కులమత రహితం జన హితం
సెక్యులరిజం అంబేడ్కర్ అభిమతం

మతం వ్యక్తిగతం
కులం వృత్తిగతం

శారీరక శ్రమ,మేధా నిపుణత గల కర్మకేగాని కులం జన్మకెలా సాధ్యం
వృత్తులతోనేగా రూపాంతరమైంది కులనేపథ్యం

కులాంతర మతాంతర వివాహాలు సర్వసాధారణ మౌతున్న ప్రస్తుత సందర్భం

రాబోయే తరాల్లో ఇదమిథ్థంగా గిరిగీయలేని కులమత సంపర్కం

పురోగమనం మాని ఏల తిరోగమన దారి
చిచ్చు రేకెత్తించే వివాదాలకు ఇకనైనా కట్టాలి గోరి

ఆహారపుటలవాట్లు అవుతాయా సిగపట్లు
మాటల తూటాలతో పడతాయేమో జాతి ఐక్యతకు జాతీయతకు పడతాయేమో తూట్లు

నలిగిపోయిన నేస్తమా,
దగా పడిన తమ్ముడా

విద్వేషాలతో
వైషమ్యాలతో 
మనందరి వికాసం
అందని ఆకసం
ప్రేమించు ప్రేమను పంచు
మానవీయతను ఆస్వాదించు

ఎరుపు రక్తంలోనే ఎన్నో గ్రూపులు
అరచేతి వేళ్ళలోనే
హెచ్చుతగ్గులు
ఏదైనా ఎదను కదిలించేదే
ఏవైనా దేనికది ప్రత్యేకించిందే

జన్మతః జన్యు పరంగా ఎన్నెన్నో విభేదాలు ఒకే తల్లి పిల్లలమైనా
శారీరక మానసిక అవకరాలు కారణమేదైనా

మనది ఎప్పుడూ భిన్నత్వంలో ఏకత్వమే
మనది ఎప్పుడూ సర్వమానవ సౌభ్రాతృత్వమే

 మనుషులుగా సమసమాజాన్ని నిర్మిద్దాం!
పౌరులుగా దేశాన్ని నవశకం వైపు నడిపిద్దాం!!

    🇮🇳!!! జై హింద్!!!🇮🇳

No comments:

Post a Comment