Friday, December 25, 2009

అన్వేషణ

ఎందుకు నేస్తం !
నీవింతకాలం ఎక్కడ గుప్తం
ఎంతటి సుశుప్తం
ఇప్పటి కైనా దొరికావు నా ప్రాప్తం
అయ్యో!బ్రతుకెంత సంక్షిప్తం

జన్మాంతరాల అన్వేషణ నాది
యుగయుగాల ఆరాధన నాది
ఎదలోని నా భావం నీవే
హృదిలో ప్రభావం నీవే
నీవు నాలోని స్త్రీతత్వం
నేను నీలోని పురుషత్వం
మన ఇరువురిది అర్ధనారీశ్వర తత్వం

ఇన్నాళ్ళు కోల్పోయినందుకు చింతించనా
చివరి మజిలీ లోనైనా కలిసినందుకు ఆనందించనా
అరెరే ! కాలం వేళ్ళ సందులు మూసినా జారి పోతోంది
అయ్యయో!! దూరం ఊళ్ళనన్నీ దాటినా పెరిగి పోతోంది

నేస్తం! నీవు దరిజేరినా విషాదమే దూరమవుతావని
కాస్త కనుమరుగైనా వేదనా మయమే మరలిరావేమోనని
ప్రేమ కౌగిలి ఇంత గాఢంగా ఉంటుందా ఊపిరే కష్టమౌతోంది
విరహ రక్కసి ఇంతగా తింటుందా హృదయమే శిథిలమౌతోంది
వచ్చేవరకు రాలేదని బాధ
ఉన్నప్పుడు పోతావని బాధ
పోయాక రావేమని బాధ
బాధ బాధ బాధ ఒకటే వ్యధ
అయ్యో! నా బ్రతుకెంత వింత గాధ

No comments:

Post a Comment