Tuesday, May 7, 2019

"ఆనంద నాంది-వికారి ఉగాది"

కాలగర్భాన అరవై మంది కవలలు 
ఏకరూప కవలలు ఈ ఉగాదులు!
పేరేదైతేనేం తీరుమాత్రం మారదు
దారేదైతేనేం ఊరుమాత్రం చేర్చదు!!

అదే ఆరంభం అదే శుభం ప్రతి ఉగాదిది
అదే ఆశావహం,అదే విషాద భరితం ప్రతి ఏడాదిది
దుర్భిక్షం రాటుదేలినా అవే ఆరు రుచులు
దౌర్భాగ్యం రాజ్యమేలినా అవే ఆరు ఋతువులు
కొన ఊపిరి ఆశల సంజీవినీలు పంచాంగాలు
ఉరుకుల పరుగుల వికాసానికి 
ఉసూరుమనిపించే గ్రహచారాలు

శ్రుతి తప్పిన పికాలు ఎప్పుడూ బకరాలు
వంధ్యత్వం తో ఫలాలు కాదుకదా 
చివురులు సైతం నోచని మావి మోడు జీవితాలు
కవుల కవితల్లో మాత్రమే కాపురముండే 
మల్లెల వెన్నెల హాయిదనాలు

పీడా పోయిన విళంబి-చొరబడిన వికారి
కత్తిపోయి డోలువచ్చె-ఢాంఢాంఢాం కదా తంబి
ఉగాది జీవితానికి ఎప్పుడూ మంచిఉదాహరణం
చేదు వగరు కారం అలవాటేగ బ్రతుకున ప్రతి క్షణం

నిన్న ఎన్నడూ తిరిగిరాని సత్యం 
రేపు ఎప్పుడూ చేరుకోని స్వర్గం
నేడు పిడికిట చిక్కిన స్వప్నం
చేజార్చకు ఏమరుపాటుగా గుప్పిటి ఆణిముత్యం!
నీ అడుగడుగూ కావాలి ఒక ఆనంద నృత్యం!!
"విరి కారులు"

పువ్వు నా కవిత్వం..!
అది రకరకాల రూపాల్లో
మల్లెలా చిన్నదిగా 
ఆనక పోవచ్చు
గులాబిలా సొంతం చేసుకోబోతే 
రాలిపోవచ్చు
మొగలి రేకులా ఆకళింపు చేసుకోలేకపోతే 
గుచ్చుకోవచ్చు..!!
ఐతేనేం దారంటి వెళ్ళే బాటసారుల చిత్తాన్ని 
ఆక్రమించక తప్పదు తావిలా.,ఇలా...
శిశిరానికి వణికిన తరులకు
దనివారగ కప్పిన  ఆకుల దుప్పటి 
ఆమని..!!
గ్రీష్మంలో కాలిన పుడమికి
లేపనమై కురిసిన నవనీతం 
శ్రావణి..!!
వలపుల రేపిన వెన్నెల
తమకపు తపనల తీర్చిన మదన మంత్రం 
హేమంతం..!!


"స్వప్నిక"

వివరం కనుక్కో మన్న 
విలాసినీ..
ఏదీ నీ విలాసం...!

మాటల్లో మకరందం 
జాలువారుతోంది..
తెలుగమ్మాయివే..

ఎప్పుడో విన్న పాటలా ఉంది..
బహుశా కోకిల కాదుగా 
కొంపదీసి..

గులాబివే సుమా 
చెప్పాగా 
గుభాళింపు చూసి

చల్లదనం 
తెల్లగా కురుస్తోందటే..
వెన్నెలవేమో మరి

నవ్వుల జల్లు చూస్తుంటే 
సందేహం 
మల్లికవా ఏంటి..?!

మొత్తానికి 
నా చిత్తానికి
వెన్నెల్లో ఆడపిల్ల వన్న మాట...!!
"విళంబి ఇక గతం-వికారికి స్వాగతం"

మూడుకాలాలు-ఆరు ఋతువులు
తొమ్మిది గ్రహాలు-పన్నెండు రాశులు
ఇదే కాల గడియారం-ఇదే ఏడాది గమనం

మూడు గుణాలు -ఆరు రుచులు 
నవ రసాలు-*పన్నెండు అనుభూతులు
ఇదే నిత్య సత్య మననం-ఇదే మానవ జీవనం

ప్రకృతి సహజాలే వెలుతురు చీకట్లు
బ్రతుకున మామూలే సంతసాలు ఇక్కట్లు
మార్చలేము కాలగమనం
మార్చుకోవాలి మననిమనం
నిర్విరామంగా కొనసాగుతూ సమయం
చేసుకోవాలి జీవితాన్ని అనుక్షణం రసమయం!

ప్రతి ఉగాది మనని మనకు చూపేదర్పణం
ప్రతి ఉగాది గతము భవితల సంతులనం

వివిధనామాలతో వింతమార్గదర్శనం
బహుళ అర్థాలతో చైతన్యోద్ధీపనం
వికారి శార్వరి హెచ్చరిస్తూ...
ప్లవ శుభకృతు స్ఫూర్తినిస్తూ..
శిశిరం వెనకే వసంతం సంయమనం
గ్రీష్మ తాపానికి వర్షం ఉపశమనం

విళంబి ఇక గతం..!
వికారికి వికాసానికి మనసా స్వాగతం..!!

*(శబ్దస్పర్శరూపరసగంధాలు+అరిషడ్వర్గము+నిరామయం)
"ఆరో భూతం"

నోర్లు తెరచుకొని
ఆవురావురంటుంటాయి బోర్లు
చిన్నారి కూనల్ని మ్రింగడానికి
ఎంతకూ వాటికి ఆకలి తీరదు

స్విమ్మంగ్ పూల్స్ అంతే 
వేసవి సెలవుల సాక్ష్యంగా
పసివారి ఊపిరితీయడానికి 
ఉవ్విళ్ళూరుతుంటాయి

ఆటస్థలాల్లో నిర్లక్ష్యానికి గురైన
సిమెంట్ బెంచీలూ
తమ ఉనికి చాటుకోవడానికి
బాల ప్రాణాలు బలిగొంటాయి

నరాలుతెగిపోయే వత్తిడిలో బ్రతుకుతూ
దివారాత్రాలు చదువునే పీల్చి చదువునే తిని
దేశాన్నుద్ధరించ బోయే
భావి తరాలను ఉరిత్రాళ్ళకు వ్రేలాడదీసి 
పొట్టనబెట్టుకునే అస్తవ్యస్త వ్యవస్థ 
వికటాట్టహాసం చేస్తూనే ఉంటుంది.

ఆసిడ్ దాడులతో, పెట్రో ఆహుతులతో
తొందరపాటు ప్రేమ(ఆకర్షణ)
తొలి యవ్వనాన్ని మట్టుబెట్టడంలో
తనవంతు కృషిచేస్తోంది.

పంచభూతాలూ శక్తివంచన లేక
పసితనాన్ని చిదిమేస్తూనే ఉన్నాయి

ప్రకృతి వైపరీత్యాల్లా మానవ తప్పిదాలు
మనుగడకు ప్రశ్నార్థకాలౌతుంటే
అరచేతి స్మార్ట్ ఫోన్ కబంద హస్తంలో
అన్ని వయసుల జనం
సాలీడు గూటి ఈగలౌతూంటే
వాట్సప్పుతో ఉదయిస్తూ సూర్యుడూ
ఫేస్ బుక్ తో జోలపాడుతూ చంద్రుడూ..!

నిర్లిప్తంగా నిర్వీర్యంగా..
తల్లిదండ్రులూ.,ప్రభుత రీతులూ..!!