"అభిమతం"
రాజుకుంటోందో మూల నర్మగర్భంగా
నివురు గప్పిన నిప్పై ఎద మర్మంగా
మా అభిమతమే మనగలగాలని
పరహితమన్నది హతమొనరిస్తూ
మానవతా హననమే తమధర్మంగా
సమైక్యతకు సమతకు చితిపేర్చే
పేచీలతో రాచిరంపాన పెడుతూ
పిట్టకొంచమై కూత చేత ఘనమై
లౌకికతకు భారతీయతకు ముప్పు తెస్తూ, తప్పని సరి తిప్పల బెడుతూ అంటకాగుతూ
చాపక్రింది నీరని నిర్లక్ష్యం చేస్తుంటే
ఉప్పెనై కప్పెట్టేదాకా కళ్ళప్పగించడమే…
పుట్టినూళ్ళే జైళ్ళై,వికృత రాచపుళ్ళై..,కాశ్మీరీ ఫైళ్ళై సెక్యూలరిజానికి సెక్యూరిటీ కరువై… విద్వేషం విస్తరిల్లి చొర్రంగ సోమలింగమై సొచ్చీ క్రూర పైశాచిక వీరంగమై…బహిరంగమై…
మనోభావాలు మైనాలకూ హైనాలకూ,బలహీనాలకే
ఎలా కూసినా కోసినా కూలదోసినా చెల్లేది వాటికే…!
మదగజాలు మృగరాజులు సమస్త సాధుజీవులు నోరెళ్ళబెట్టి చూసినా నోళ్ళూ గుళ్ళూ దేవుళ్ళూ పగుళ్ళ పాలై మూసినా,తల మాసినా వెతలెడబాసునా బాసూ., చేరినా శ్మశాన వాటికే…!!
దబాయించే రుబాబొకటి వాడి బాబుగాడి సొమ్మైనట్టు సంస్కృతి,సంప్రదాయాల చేసేస్తూ ఖరాబు…
లేడెవడు లేవడెవడూ ఎదురొడ్డే షరాబు…
కళ్ళముందు తేటతెల్లమై పడిఉన్నా కళ్ళకు గంతలు కట్టుకుంటే భవిష్యత్తు బాటంతా కంతలు గుంతలవడమే ఖాయం…
ఖాయిలా పడ్డ పౌరుల పౌరుషాలని కాస్త పునరుద్ధరిస్తే.,
నా జెండా అంటూ అండగా అజెండా రూపొందుతుందని
ఊరుఊరంతా పీల్చుకుంటుంది ఊపిరి…!!