Wednesday, March 28, 2018

“ఏమి., రాయనూ..!” –రాఖీ,ధర్మపురి-9849693324
(విలంబి ఉగాది శుభాకాంక్షలతో)

ఉగాది వస్తుందంటే ఉత్సాహమే..
కోకిలకీ, కవికీ..
లేమావి చివుర్లతో గొంతు సవరి౦చుకోవచ్చనీ..
ఉరకలెత్తే భావాలతో కలం ఝళిపించ వచ్చనీ
ఆరు ఋతువులు..కాలమానాలు
ఆరు రుచులూ ..పంచాంగ శ్రవణాలు
హేవలంబికి శాపనార్థాలూ
విలంబికి ప్రార్థనాయుత వినతి పత్రాలు..

ఎప్పుడూ ఉండేదేగా ..పాత చింతకాయ పచ్చడి
ఏం రాయనూ పదేపదే,నవ్యత చూపాలిగా... చచ్చీ చెడి

విజయ్ మాల్యా,నీరవ్ మోడీ ల్లాంటి ఘరానా మోసగాళ్ళ గురించి
అడుగడుగునా ఎదురయ్యే..రాజకీయ పగటి వేషగాళ్ళ గురించి
పండగ పూట దండగమారి మనుషుల గురించి
ఏమనుకొన్నా చర్విత చరణమే..!

నోట్ల రద్దు ఓట్లకు చేటైనట్లు...
ఆర్ధిక నిర్భందంలో సామాన్యుడు సతమతమౌ తున్నట్లు
రె౦డెక్స్ ల “జీ యస్ టీ” లతో ఇండెక్స్ లు అతలాకుతల మైనట్లు...
పీల్చి పిప్పిచేసిన మీడియా..కాల్చి మసి చేసిన పాడిగా
రాజకీయాలు ,రక్త పాతాలూ..భ్రూణ హత్యలు..నర బలులు
బ్యాంక్ స్కా౦ల బాగోతాలు..దొంగ స్వాముల దురాగతాలూ
స్త్రీ ల పట్ల అత్యాచారాలు,విచ్చల విడిగా సాక్షాత్కరించిన లంచావతారాలూ..
హోదా ప్రాతిపదిక గా జరుగుతున్న ఉదంతాలు,రాద్ధాంతాలూ..
షరా మామూలుగా రాయడానికి..వార్తా విశేషాలా కవితలు..?
సంచలనాత్మక కథనాలా...కవి భావుకతలు..?! ఏం రాయనూ...!

మరిచిపోతున్న మానవీయ విలువల్ని గుర్తుకు తెస్తా..
మనిషి ఏకాకిగా మిగిలిపోతున్న సంగతి విశద పరుస్తా..
మెదడు హృదయాన్ని ఎలా కరుడుగట్టిస్తున్నదో ఎరుకపరుస్తా
చిన్ననాటి అనుభవాల అనుభూతుల్ని తేనెల ముంచేస్తా..

వృద్ధాశ్రమాలు మూతబడేలా..
నిరాదరణకు గురైన తల్లిదండ్రుల అనురాగం
వారి సంతానానికి గుర్తుకు తెస్తా..

విద్యా, వైద్యం కార్పోరేట్ కబంధ హస్తాల్లో..
ఎలా నలిగి పోతున్నదో..కనువిప్పు కలిగిస్తా
బాల్యం సహజ ప్రతిభను కోల్పోయి.,
ఎలా హ్యూమనాయిడ్ అయ్యిందో
మమ్మీ డాడిల కళ్ళు తెరిపిస్తా...

హెల్మెట్లు సీట్ బెల్ట్ ల పట్ల నిర్లక్ష్యం
యువత పాలిట ఎలా యమ పాశమౌతుందో
తెలియ పరుస్తా..

మద్యం మత్తు.,అతివేగపు గమ్మత్తు
బ్రతుకునెలా బలితీసుకు౦టాయో తెలుసుకునేలా
ప్రకటిస్తా..

ప్రపంచ తెలుగు మాహా సభల విజయ గర్వంతో
తెలుగు భాషను తెలుగింటింటి తోరణం చేస్తా..
మహారాష్ట్ర కర్షకుల పాదయాత్ర స్ఫూర్తిగా..
ఆదివాసీల అకు౦ఠిత దీక్ష సాక్షిగా...
బంగారు తెలంగాణా మీదుగా..
భవ్య భారత్ వైపు.. అడుగులేస్తా..!!

Tuesday, March 20, 2018


మన్మధ జననం

కలం ఉలికి పడింది...ఉగాది వచ్చేసింది ఆనవాయితీగా కవిత రాయాలి కదా అని,
వెదుకులాట మొదలైంది వస్తువు కోసమని..
ఆరాటం సారథి అయ్యంది మనోరథానికి,

లౌక్యం యుక్తి సూక్ష్మం బోధించింది,ఎన్నాళ్ళుగా నో రాస్తున్నావ్ ఆ మాత్రం తెలీదా అని,
ఆరు రుచుల జీవితం,
ఆరు ఋతువుల కాలం
ఇదే కదా ఉగాది మర్మం
ఇదే కదా ఉగాది కవితా వస్తు ధర్మం!

మధు మాస మకరందం,కోయిల గానం- తీయ దనం
గ్రీష్మ ఋతు మండే తాపం ,భానుడి ప్రతాపం-కార గుణం
వర్షాకాల పుడమి ప్రసవం,జల ధారల గగనం -ఉప్పుకి తార్కాణం
యువ జంటల కలల వలపు పంటల శరత్కాలం-
వగరుకు చిహ్నం
కౌగిలింతల వింతల చింతల హేమంతం -పులుపుకు ఆలవాలం
అహరహర విరహ అనురాగ శిశిరం-చేదుకు ఆలంబనం

 జీవన వనంలో ప్రతి ఉదయం ఉగాది ఆగమనం!
తీపి చేదూ కలయికలో ప్రతి క్షణం "మన్మధ "జననం మరణం!!

Friday, March 2, 2018


"కవి(కో)కిలా..?!"

కాలం జారిపోతోంది..
వేళ్ళ సందుల్లోంచి..
కవిత కోసం ఆగలేక

దృక్పథం మారిపోతోంది...
నా చిన్ని బొజ్జకు ...
శ్రీరామ రక్షగా

పలకరించే పాఠకులకోసం...
అక్షరాలు నిరీక్షిస్తూనే ఉంటాయి

ఎదురొడ్డే ధైర్యానికి ...
కొత్తగా సైబర్ బెదిరింపులు ..
తోడేళ్ళయ్యాయి,

లబ్దప్రతిష్టులకే...
ఉపలబ్దమౌతోంది ...
ఏ మాధ్యమమైనా

కర్ణుడి చావుక్కారణాలెన్నో...
కవిత మనుగడలో
ద్యోతకమౌతాయి,

కవులు
కవిత
గెలవడానికి..
నేస్తం..

కనీసం ఒకరైన
స్పందించి
అందించాలిగా
 స్నేహ హస్తం...!!