రాఖీ||నువ్వెవరు...?||
నువ్వు కనికరించాలే
గాని
నువ్వు కనబడని
దెక్కడ..?
నువ్వు అక్కున
జేర్చుకోవాలె గాని
నీ వల్ల ఊరడింపుకు
ఏదీ..కొదవ..!
వడ్ల గింజలో..బీజాక్షర
మౌతావు
తాటి ముంజలో..తత్వాన్ని
చూపుతావు
గాజు పెంకులతో...కరుణకు
గుడి కడతావు
తెగిన చెప్పులతో...త్యాగానికి
ముడి పెడతావు
అక్షరాల్ని ఉగ్గుపాలలో
చేర్చుకొన్నావో...
పదాలని బుడి బుడి
అడుగులుగా నడక నేర్చుకోన్నావో..
కలం నీ
చేతిలో..పాడుతుంది..కదన కుతూహలం..
భావం నీ పాదాలకు
దాసోహమంటూ చేస్తుంది..సలాం..
ఎవరూ పట్టించుకోని
వస్తువుల్లో..
నీకు ప్రపంచం కనబడుతుంది....
అందరూ ఎవగించుకొన్న
వాటిల్లోనూ..
నీకు అందం ద్యోతక
మౌతుంది...
పెంట
కుప్పమీది..విస్తరి ముక్కను చూస్తే..సైతం
స్పందించడం నీకు
తెలుసు..
కాళ్ళ క్రింద నలిగిపోయే
గడ్డి పోచను చూసినా
చెమ్మగిల్లుతుంది..నీ
మనసు
నవరసాలు నీకు బానిసలు..
ప్రకృతి నీకు పాదా క్రాంతం..
ఎదను చీల్చుక పోవడం...
చీలిన ఎదకు మలాం పూయడం
నీకే సాధ్యం..
మనసంటూ ఉంటె మాత్రం
నువ్వు గిలిగింతలు పెట్టక
మానవు..
మనిషంటూ నీ కడకొస్తే..
ఎద తలుపులు తట్టక
మానవు..
సాధారణ అనుభవమైనా...
అనుభూతుల అంచుకు
నెడతావ్...
రోజూ తింటున్నదైనా...
కొత్త రుచులు నువు
చూపెడతావ్
ఇదమిద్దమైంది కాదు నీ
రూపం..
ఇంతని లేదు కొలమానం..
నువ్వేవరైతే మాత్రమేం..
ఆహ్లాదానికి
ఆనందానికీ..నీవే ప్రతి రూపం..
వామనుడిలా నాలో ఉన్న
నీవు...
త్రివిక్రముడిలా..ఇకనైనా..భాసిల్లు...!!
09-12-2012.
No comments:
Post a Comment