Sunday, March 27, 2022

 "సార్థక నామధేయ శుభకృతు"


ఇది మనాది తొలగిన మన ఉగాది ఘన ఉగాది

నిన్నకు నేటికున్న ఉన్నతే నిజ ఉగాది ప్రజ ఉగాది

గతపు చేదు కారాలు

రేపటి తీపి వగరులు

ఈనాటి ఉప్పు పులుపులు

కలబోసినదే బ్రతుకు కడి

షడ్రుచులున్న ఉగాది పచ్చడి


పంచభూత శుభ ఫలితాలను పంచన ఉంచుకొనక

తెలంగాణ ప్రపంచానికి పంచుతున్న ఈశ్వరుడు

ఏ వంకలేని నెలవంకను దాల్చిన ఘనుడు చంద్రశేఖరుడు

వెతల గంగని తలాపునకు తెచ్చిన అపర భగీరథుడు

విస్ఫులింగాల విద్యుత్తుని నిరంతరాయం చేసిన త్రినేత్రుడు

గాలిమాటలు కాని నియామకాల ప్రాణవాయువందిచిన నీలకంఠుడు

మట్టిని అన్నంగా మార్చె రైతుకు బంధువైన సుందరేశ్వరుడు

విశాల భారత ఆకాశానికి ఆశాదీపమౌ  రామేశ్వరుడు

మన ముఖ్య అమాత్యుడై సారథ్యం వహిస్తూంటే

తెలంగాణ ప్రజల్లో బంగారు భవితకు నాడే పడింది పునాది

బడుగుల బ్రతుకుల్లో ఇక  ప్రతి ఏడాదీ శుభకృతు ఉగాది..


సబలలకు సమన్యాయం కూర్చే అర్ధనారీశ్వరుడు

ఆడపడుచులకు తోడబుట్టిన కాళేశ్వరుడు

సకల కులమతాలకు చేయూతనిచ్చే  రాజరాజేశ్వరుడు

దళితులకు ఆత్మబంధువైన దక్షిణా మూర్తి 

తమ్ములకు ఉపాధినొసగే అన్న కొమరెల్లి మల్లన్న

అండదండై ముందడుగు వేసే కీసర రామలింగన్న ఉండగ

తెలంగాణ ప్రజలకు  ప్రతిరోజూ ఔతుంది ఉగాది పండగ

బడుగుల బ్రతుకుల్లోకి నిత్యం వస్తుంది శుభకృతు  నిండుగ…!!



Friday, March 25, 2022

 "మహాభినిష్క్రమణ"

                              - డా.గొల్లపెల్లి రాంకిషన్(రాఖీ)


"నేను" విశ్వంలో లయమైపోతా

శూన్యంలో శూన్యమై మాయమౌతా

ఒక నిశ్శబ్ద నిశీధి చరమాంకంలో


ప్రళయమేం రాదు..

ఏ ప్రభుత్వమూ కూలదు

అతి సాధారణంగా

మరింత ప్రశాంతంగా తెల్లారుతుంది,

సోషల్ మీడియా పుణ్యమా అని

విషయం తెలియడం వల్ల

కొన్ని అయ్యోలు,అరెరేలు

మరిన్ని ప్చ్…హ్మ్ లమధ్య..


ఒక FB మిత్రుడు నా పిక్ వెతికి పట్టుకొని

లేదా నా గోడనాసరాగొని

ఒక RIP పడేస్తాడు…

ఓపిక ఉన్న ఒకరిద్దరు..

రాత్రే పోస్టుపెట్టాడే ఇంతలోనే ఇలానా

అని రెండు ముక్కల కామెంట్ పెడతారు..

ఆరోజో అంతక్రితమో చూసిన పోస్టునుండి

నలుగురు కాపీ పేస్టులు చేస్తారు..

నివాళి ,శ్రద్ధాంజలి..అంటూ తెలుగులోనూ

సందట్లో సడేమియాగా ఎవరో

'Many HAPPY returns of the day' అంటూ

పోస్ట్/పేస్ట్ చేసి చేతులు దులుపుకొని ముందుకి స్క్రోల్ చేస్తారు…


మనపోస్టుల  కెపుడైనా లైకో కామెంటో పెట్టాడా 

అనుకొంటూ ముందుకి స్క్రోల్ చేస్తారింకొందరు..

ఇవన్ని చూడ్డానికి మనమెలాగూ ఉండమన్నది ఎరిగిన సంగతే..

తప్పని సరైన ఆ నలుగురి సహకారంతో

దహనము దశదిన కర్మలూ జరిగిపోతాయి

ఐతేగియితే ఓ ఆనవాయితిగా

ఓ నలుగురితో

 ఓ సంతాప,సంస్మరణ సభ…


ఎంత అస్పష్టంగా ఈలోకానికి వచ్చామో

అంతకన్నా దయనీయంగా నిష్క్రమించడమే..

చరిత్రకెక్కినవాళ్ళు,చరిత్రలు సృష్టించినవాళ్ళు

జీర్ణంకాని వాస్తవమవుతూ

నాలా ఏ చరిత్రా లేనివాళ్ళూ, 

త్రిప్పేసిన పుటలౌతూ-

కాస్త అటూఇటూగా, ఇలా నిశ్శబ్దంగా

గాలిలో గాలిగా,నీటిలో నీరుగా 

నిప్పులో నిప్పుగా మట్టిలో మట్టిగా

అనంత శూన్యాకాశపు దిశగా

మహా ప్రస్థానం కొనసాగిస్తూ...

కనుమరుగౌతూ..స్మృతి మరుపౌతూ…!!