Friday, January 21, 2022

 "గడబిడ ఎడద"


కాలం రథచక్రాల క్రింది నలిగి,

నీకు ఎక్కడ దూరమౌతానోనని…

దూరం వల్ల నా మరపు మెల్ల మెల్లగా

నిన్ను ఆవరించుకొని

యాది మనాదౌతుంటే…


రోజువారి ఒత్తిళ్ళు,బాధ్యతలు 

నిన్ను కబళిస్తోంటే…

కబళింపబడిన నీ మదిలో 

నేను మరుగున పడక మరేమౌతాను…


మార్గమేదీ కనపడక ,

రవికి మబ్బుకి పడక ,

సూర్యునికి పట్టే గ్రహణమొకటిక, 

ఏదో ఒక కారణంగా 

నా వైపు చీకట్లు చిమ్ముతుంటేనూ…


మంజుల మనోహర నిక్వణ స్వన సమ నీ గాత్రం 

వినేభాగ్యం లభ్యమౌతుందా మళ్ళీ మళ్ళీనూ…


ఇదంతా నా పిచ్చిగాని,

నీకెంతవరకు నచ్చానో,

ఏ రోజైనా రోజులో ఏ క్షణమైనా 

నీ తలపుల్లో నేను మెదులుతాను 

అన్నది నా వెర్రి భ్రమ…


భ్రమలూ,ఊహలు,కల్పనలు,స్వప్నాలు

ఆనందం కలుజేస్తుంటే 

అందులోనే హాయి హాయిగా 

మనుగడ సాగించక 

ఎందుకీ అంతరంగ రగడ…


ఆలోచిస్తూ ఆస్వాదిస్తే 

అనుక్షణమూ కమ్మని మీగడ

తియతీయని చెఱకుగెడ…!!